బాల‌య్య‌.. ఇంకెన్ని షాక్‌లు ఇస్తావయ్య‌! రెండు భాగాలుగా.. బాల‌కృష్ణ‌, వివేక్ ఆత్రేయ‌ సినిమా

ABN , Publish Date - Apr 04 , 2026 | 02:56 PM

గాడ్‌ ఆఫ్‌ మాస్‌ బాలకృష్ణ, యువ దర్శకుడు వివేక్ ఆత్రేయ కలయికలో ఓ మూవీ రానున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

Balakrishna

గాడ్‌ ఆఫ్‌ మాస్‌ బాలకృష్ణ (Nandamuri Balakrishna), యువ దర్శకుడు వివేక్ ఆత్రేయ (Vivek Athreya) కలయికలో ఓ మూవీ రానున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. మాస్ యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే బాలయ్య, విభిన్నమైన కథాంశాలతో తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్న వివేక్ ఆత్రేయ కలిసి పనిచేస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. వీరిద్దరి కాంబినేషన్ అనగానే సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వైరల్ అవుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను మేకర్స్ ఒకే భాగంలో కాకుండా రెండు భాగాలుగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. దర్శకుడు వివేక్ ఆత్రేయ రాసుకున్న కథ పరిధి చాలా పెద్దదిగా ఉండటంతో, కేవలం మూడు గంటల సినిమాలో ఆ భావోద్వేగాలను, యాక్షన్ సన్నివేశాలను పూర్తిస్థాయిలో చూపించడం సాధ్యం కాదని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఈ ప్రతిపాదనకు బాలకృష్ణ కూడా సానుకూలంగా స్పందించడం విశేషం. కథలో ఉన్న దమ్మును నమ్మి, రెండు భాగాలుగా తెరకెక్కించేందుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఈ చిత్రానికి ‘కురుక్షేత్రం’ (Kurukshetram) అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను చిత్ర యూనిట్ పరిశీలిస్తోంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది దసరా పండుగ ముగిసిన వెంటనే ఈ ప్రాజెక్ట్‌ను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

షూటింగ్ షెడ్యూల్స్ విషయంలో కూడా బాలయ్య ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. రెండు భాగాల షూటింగ్‌ను ఒకేసారి లేదా తక్కువ గ్యాప్‌లో పూర్తి చేయాలని ఆయన దర్శకుడికి సూచించారు. దీనివల్ల సమయం కలిసి రావడమే కాకుండా, సినిమా అవుట్‌పుట్ విషయంలో కూడా స్పష్టత ఉంటుందని ఆయన భావిస్తున్నారు. వివేక్ ఆత్రేయ కూడా అందుకు తగ్గట్టుగా పక్కా ప్లానింగ్‌తో షెడ్యూల్స్ రూపొందిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. బాలయ్య క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్ట్ కోసం భారీ బడ్జెట్‌ను కేటాయించినట్లు సమాచారం. వివేక్ ఆత్రేయ మార్క్ టేకింగ్, బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్‌కు తగినట్టుగా కథలో హై వోల్టేజ్ ఎలిమెంట్స్ ఉంటాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి ఈ కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.

Updated Date - Apr 04 , 2026 | 02:57 PM