బాలయ్య సినిమా సీక్వెల్‌తో.. మోక్షజ్ఞ ఎంట్రీ?
ABN , Publish Date - Mar 06 , 2026 | 11:14 AM
నందమూరి నట సింహం బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ వెండితెర అరంగేట్రం గురించి గత దశాబ్ధ కాలంగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి.
నందమూరి నట సింహం బాలకృష్ణ (Nandamuri Balakrishna) వారసుడు మోక్షజ్ఞ (Mokshagna)వెండితెర అరంగేట్రం గురించి గత దశాబ్ధ కాలంగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అయితే, ఈసారి మాత్రం ఈ వార్తలు కేవలం రూమర్స్ కాదని, ఒక పక్కా ప్లాన్‌తో మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీకి సర్వం సిద్ధమైందని ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. మొన్నటి వరకు హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో మోక్షజ్ఞ పరిచయం కాబోతున్నారనే వార్త విపరీతంగా ప్రచారమైంది.
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో మోక్షజ్ఞ ఒక కీలక పాత్రతో ఎంట్రీ ఇస్తారని అందరూ భావించారు. చాలా మందికి తెలిసిన విషయమేమిటంటే, ప్రశాంత్ వర్మ మేకింగ్ స్టైల్ నేటి యూత్‌కు బాగా కనెక్ట్ అవుతుంది. అయితే, కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతానికి పక్కకు వెళ్ళినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రాకపోయినా, మెగా ప్లాన్ మారిందని మాత్రం స్పష్టమవుతోంది.
ఇప్పుడు ఫిల్మ్ నగర్‌లో వినిపిస్తున్న లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే.. బాలయ్య కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన ఆదిత్య 369 (Aditya 369) సినిమాకు సీక్వెల్‌గా ఆదిత్య 999 (Aditya 999) మ్యాక్స్ రాబోతోంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రంతోనే మోక్షజ్ఞ హీరోగా పరిచయం కాబోతున్నారు. విశేషమేమిటంటే, ఈ సినిమాకు స్వయంగా బాలకృష్ణే కథను అందించారు.
టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో వచ్చే ఈ కథను నేటి తరం అభిరుచులకు తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసే బాధ్యతను డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి (Krish Jagarlamudi) కి అప్పగించారట. గౌతమీపుత్ర శాతకర్ణి వంటి చారిత్రాత్మక విజయాన్ని బాలయ్యకు అందించిన క్రిష్‌పై నందమూరి కుటుంబానికి పూర్తి నమ్మకం ఉంది. సోషియో ఫాంటసీ, సైన్స్ ఫిక్షన్ అంశాలతో కూడిన ఈ భారీ బడ్జెట్ సినిమాను క్రిష్ అద్భుతంగా హ్యాండిల్ చేయగలరని భావిస్తున్నారు. ఈ సినిమాకు బుర్రా సాయి మాధవ్ మాటలు అందించనున్నారు.
ఈ సినిమాలో పాత కాలం నాటి ఘట్టాలతో పాటు, భవిష్యత్తు ప్రపంచాన్ని కూడా చూపించబోతున్నారట. గ్రాఫిక్స్ పరంగా, విజువల్స్ పరంగా ఈ సినిమా ఇండియన్ స్క్రీన్‌పై ఒక విజువల్ వండర్‌గా నిలవబోతోంది. మోక్షజ్ఞ ఇప్పటికే నటనలో, డ్యాన్స్‌లో శిక్షణ పూర్తి చేసుకుని ఎంట్రీకి సిద్ధంగా ఉన్నాడు.
త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావడమే కాకుండా, గ్రాండ్‌గా ఓపెనింగ్ వేడుకను నిర్వహించబోతున్నారట. అప్పుడే మోక్షజ్ఞ ఎంట్రీపై వస్తున్న అన్ని రూమర్స్‌కు ఒక ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంది. దీనితో పాటుగా, ఈ సినిమాలో బాలయ్య కూడా ఒక కీలక పాత్రలో కనిపించనున్నారని టాక్.. ఏది ఏమైనా నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ నందమూరి అభిమానులకు పూనకాలు తెప్పించడం ఖాయం.