బాలయ్య సినిమాలో... మోహన్‌లాల్‌? ఇది క‌దా.. కాంబినేష‌న్ అంటే

ABN , Publish Date - May 25 , 2026 | 08:11 AM

సినిమా ప్రియులు ఎల్లప్పుడూ వెండితెరపై క్రేజీ కాంబినేషన్లను చూడాలని ఆరాట పడుతుంటారు. అయితే ఇలాంటి భారీ కాంబోలు ప్రాణం పోసుకోవడం చాలా అరుదుగా జరుగుతుంటుంది.

Balakrishna

సినిమా ప్రియులు ఎల్లప్పుడూ వెండితెరపై క్రేజీ కాంబినేషన్లను చూడాలని ఆరాట పడుతుంటారు. అయితే ఇలాంటి భారీ కాంబోలు ప్రాణం పోసుకోవడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. మొన్నటి 'జైలర్' చిత్రంలో రజనీకాంత్, మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్లను ఒకే ఫ్రేమ్‌లో చూసి అభిమానులు మురిసిపోయినా, అది కేవలం క్యామియోలకే పరిమితం కావడంతో పూర్తి స్థాయి తృప్తి దక్కలేదు.

దర్శకధీరుడు రాజమౌళి 'RRR'తో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి ఇద్దరు స్టార్ హీరోలను కలిపి సరికొత్త సంప్రదాయానికి తెరలేపారు. కానీ, అంతటి భారీ మల్టీస్టారర్ కథలను సిద్ధం చేసే రచయితలు, వాటిని తెరకెక్కించే దర్శకులు టాలీవుడ్‌లో చాలా తక్కువగా కనిపిస్తున్నారు. ఈ తరుణంలోనే సినీ వర్గాల నుండి ఒక అత్యంత ఆసక్తికరమైన కాంబినేషన్ గురించిన వార్త బయటకు వచ్చి సంచలనం సృష్టిస్తోంది.

నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ (Vivek Athreya) దర్శకత్వంలో ఒక భారీ ప్రాజెక్ట్ రూపుదిద్దుకోబోతున్న సంగతి తెలిసిందే. విభిన్నమైన కథాంశాలతో సినిమాలు తీసే వివేక్ ఆత్రేయ, మాస్ గాడ్ బాలయ్యతో సినిమా అనగానే ఇండస్ట్రీలో మొదట కొన్ని సందేహాలు వ్యక్తమయ్యాయి. అసలు ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందా లేదా అనే ప్రచారం కూడా ఫిలిం నగర్ సర్కిల్స్‌లో బలంగా నడిచింది. కానీ, సినీ విశ్లేషకుల సమాచారం ప్రకారం ఈ క్రేజీ కాంబినేషన్ ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు కాదని టాక్. స్క్రిప్ట్ వర్క్ పక్కాగా జరుగుతోందని, కొంచెం ఆలస్యమైనా సరే ఈ చిత్రం ఖచ్చితంగా సెట్స్ పైకి వెళ్లడం ఖాయమని స్పష్టం చేస్తున్నారు.

ఇక ఈ సినిమా కథకు సంబంధించి ఇండస్ట్రీ లోపల ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఈ చిత్రంలో రెండు అత్యంత పవర్‌ఫుల్ పాత్రలు ఉంటాయని సమాచారం. కథ ప్రాథమిక దశలో ఉన్నప్పుడు బాలకృష్ణతోనే డ్యూయల్ రోల్ చేయించాలని వివేక్ ఆత్రేయ భావించారట. అయితే, కథను మరింత ఉన్నతంగా మార్చే క్రమంలో.. ఆ రెండో పాత్రను మరొక సీనియర్ స్టార్ హీరోతో చేయిస్తే బాగుంటుందని దర్శకుడు ఆలోచించారు. అలా బాలయ్యకు సమానమైన ఆ రెండో పవర్‌ఫుల్ క్యారెక్టర్ కోసం మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ (Mohanlal) ను సంప్రదించేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది.

మోహన్‌లాల్ పాత్రలో బలం ఉండి.. కథ నచ్చితే ఇతర భాషా చిత్రాల్లో నటించడానికి ఎప్పుడూ వెనుకాడరు. గతంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన 'జనతా గ్యారేజ్' సినిమాలో ఆయన పూర్తి స్థాయి పాత్రలో మెప్పించారు. అలాగే కేవలం కంటెంట్ నచ్చడం వల్లే 'మనమంతా' అనే చిన్న బడ్జెట్ సినిమాను కూడా ఒప్పుకున్నారు. తమిళంలో విజయ్ 'జిల్లా' సినిమా చేయడానికి కూడా బలమైన పాత్రే కారణం. కాబట్టి, వివేక్ ఆత్రేయ గనుక మోహన్‌లాల్‌ను సరైన రీతిలో కన్విన్స్ చేయగలిగితే.. ఈ ప్రాజెక్టులోకి లాలెట్టన్ రావడం పెద్ద కష్టమేమీ కాదని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.

ప్రస్తుతం ఆ కన్విన్సింగ్ పనుల్లోనే దర్శకుడు బిజీగా ఉన్నారట. వివేక్ ఆత్రేయ సినిమాలో గనుక ఈ కాంబో సెట్ అయితే, వెండితెరపై ఇద్దరు మహామహుల నటనను ఫుల్ లెంగ్త్ రోల్స్‌లో చూసే అదృష్టం ప్రేక్షకులకు దక్కుతుంది. రెండు సింహాల మధ్య జరిగే ఆన్-స్క్రీన్ యుద్ధంలా ఈ సినిమా సాగుతుందని ఫ్యాన్స్ అప్పుడే ఊహించుకుంటున్నారు. అయితే ఈ సెన్సేషనల్ కాంబినేషన్‌పై అధికారిక ప్రకటన వచ్చే వరకు సినిమా ప్రియులు కాస్త ఓపిక పట్టాల్సిందే.

Updated Date - May 25 , 2026 | 08:18 AM