కిడ్నాప్ కేసు.. మోహన్ బాబుకు హైకోర్టులో చుక్కెదురు

ABN , Publish Date - Feb 18 , 2026 | 05:47 AM

మోహన్ బాబు యూనివర్సిటీ ఛాన్సలర్, సినీ నటుడు మోహన్ బాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.

Mohan Babu

మోహన్ బాబు యూనివర్సిటీ ఛాన్సలర్, సినీ నటుడు మోహన్ బాబు (Mohan Babu) కు హైకోర్టులో చుక్కెదురైంది. విద్యార్థి నాయకుల కిడ్నాప్ కేసులో అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు న్యాయస్థానం నిరాకరించింది. విద్యార్థి నాయకుల కిడ్నాప్‌కు ముందు, తరువాత కూడా కేసులో ప్రధాన నిందితుడు, వర్సిటీ పీఆర్వో సతీష్ పిటిషనర్ ఫోన్లో మాట్లాడారని, మెసేజ్‌లు కూడా చేసుకున్నారని పోలీసులు చెబుతున్నారని గుర్తు చేసింది.

ఫోన్ కాల్స్‌తో పాటు మెసేజ్‌ల‌ను విశ్లేషించి ఫోరెన్సిక్ ల్యాబోరేటరీ నివేదిక అందజేయాల్సి ఉందని పేర్కొంది. ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేసింది. అరెస్ట్‌తో పాటు ఎఫ్ఐఆర్ ఆధారంగా తదుపరి చర్యలు నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న మోహన్ బాబు అభ్యర్ధనను హైకోర్టు తోసి పుచ్చింది. అనుబంధ పిటిషన్‌ను కొట్టివేసింది. వ్యాజ్యంపై లోతైన విచారణ జరుపుతామని పేర్కొంటూ క్వాష్ పిటిషన్‌పై విచారణను మార్చి 3కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి మంగళవారం ఉత్తర్వులు ఇచ్చారు.

Updated Date - Feb 18 , 2026 | 10:44 AM