సెప్టెంబర్ 18న.. ప్రేక్షకుల ముందుకు ‘మిస్సింగ్ మేఘన’
ABN , Publish Date - Sep 16 , 2026 | 06:49 AM
రామ్ కార్తీక్, అమ్ము అభిరామి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘మిస్సింగ్ మేఘన’ సెప్టెంబర్ 18న విడుదల కానుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చిత్రబృందం సినిమా విశేషాలను పంచుకుంది.
రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘మిస్సింగ్ మేఘన’ విడుదలకు సిద్ధమైంది. ఫస్ట్ కాపి మూవీస్, కేడి&కో బ్యానర్లపై పంచుమర్తి నరేష్ బాబు నిర్మించిన ఈ చిత్రానికి వాచస్పతి దర్శకత్వం వహించారు. గోపరాజు రమణ, వెంప కాశి, కౌశిక్, మహిపాల్, రుచిత, నళిని, శ్రీనివాస్, అజీమ్, పండు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్‌కు మంచి స్పందన లభించగా, ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరణ జరగడం విశేషం. నిర్మాత సురేష్ బాబు విడుదల చేసిన తొలి పాట కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. శామ్ కె. నాయుడు సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రానికి ఆర్.ఆర్. ధ్రువన్ సంగీతం సమకూర్చారు.
సెప్టెంబర్ 18న థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకకు నిర్మాత దామోదర్ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిత్ర బృందం సినిమా విశేషాలను పంచుకుంది. దర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి మాట్లాడుతూ, దర్శకుడు వాచస్పతి కృషిని అభినందిస్తూ సినిమా ఘన విజయాన్ని సాధించాలని ఆకాంక్షించారు. నటుడు ధనుష్ రఘుముద్రి మాట్లాడుతూ ఫస్ట్ కాపి మూవీస్ బ్యానర్ తనకు ప్రత్యేకమైనదని, ‘మిస్సింగ్ మేఘన’ ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందని అన్నారు.
సింగర్ సాకేత్ మాట్లాడుతూ చిత్రంలోని పాటలు, విజువల్స్ ఆకట్టుకునేలా ఉన్నాయని పేర్కొన్నారు. నటుడు గోపరాజు రమణ మాట్లాడుతూ కుటుంబ కథకు ఉత్కంఠభరితమైన అంశాలను జోడించి దర్శకుడు సినిమాను ఆసక్తికరంగా మలిచారని చెప్పారు. సంగీత దర్శకుడు ఆర్.ఆర్. ధ్రువన్ మాట్లాడుతూ ఈ సినిమా కోసం కొత్త తరహా సంగీతాన్ని అందించేందుకు ప్రయత్నించానని తెలిపారు. చిత్ర బృందం చేసిన కృషి ప్రేక్షకులను మెప్పిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
నిర్మాత బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ సినిమా చూసిన తర్వాత దానిలోని కంటెంట్ తనను ఆకట్టుకుందని, అందుకే పూర్తి మద్దతు అందిస్తున్నానని చెప్పారు. రామ్ కార్తీక్, అంకిత్ కొయ్య నటన ప్రత్యేకంగా నిలుస్తుందని పేర్కొన్నారు.దర్శకుడు వాచస్పతి మాట్లాడుతూ మంచి కథే ఈ చిత్రానికి బలమని, తన ప్రయాణంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రేక్షకులు సినిమాను ఆదరించాలని కోరారు.
హీరో రామ్ కార్తీక్ మాట్లాడుతూ చిత్ర బృందం అందరి సహకారంతో సినిమా అద్భుతంగా రూపుదిద్దుకుందని చెప్పారు. సంగీతం, కథ, నటీనటుల ప్రదర్శన ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని నమ్మకం వ్యక్తం చేశారు.నటుడు అంకిత్ కొయ్య మాట్లాడుతూ దర్శకుడు వాచస్పతి అంకితభావంతో ఈ చిత్రాన్ని రూపొందించారని, ప్రేక్షకుల ఆదరణతో సినిమా మరింత ముందుకు వెళ్లాలని ఆశిస్తున్నానన్నారు.
ముఖ్య అతిథి దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ చిన్న సినిమాలకు ప్రేక్షకులు, మీడియా నుంచి ప్రోత్సాహం ఎంతో అవసరమని చెప్పారు. కంటెంట్‌పై నమ్మకంతో తెరకెక్కిన ‘మిస్సింగ్ మేఘన’ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. సస్పెన్స్, భావోద్వేగాలు, కుటుంబ కథా అంశాలతో రూపొందిన ‘మిస్సింగ్ మేఘన’ సెప్టెంబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రేక్షకులను థ్రిల్ చేసే కంటెంట్ ఈ చిత్రంలో ఉందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది.