యూ ట్యూబర్ 'నా అన్వేష్'కు మెటా ఝలక్.. ఇన్‌స్టా అకౌంట్ తొలగింపు
ABN , Publish Date - Feb 20 , 2026 | 05:47 AM
నా అన్వేషణ పేరిట సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రముఖ యూ ట్యూబర్ 'నా అన్వేష్'కు మెటా సంస్థ బిగ్ షాక్ ఇచ్చింది.
నా అన్వేషణ (Naa Anveshana) పేరిట సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రముఖ యూ ట్యూబర్ 'నా అన్వేష్'కు మెటా సంస్థ బిగ్ షాక్ ఇచ్చింది. అతడి ఇన్‌స్టాగ్రామ్ (Instagram Ban) ఖాతాను తొలగిస్తున్నట్లు గురువారం ప్రకటించింది. కొంతకాలంగా ఆయన తన ఇన్‌స్టా ఖాతాలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం, హిందూ దేవుళ్లను కించపరిచేలా వీడియోలు చేస్తున్నాడు. దీంతో ఆయనపై నగరంలోని పంజాగుట్ట, సీసీఎస్ సైబర్ క్రైమ్ విభాగాల్లో కొన్ని రోజుల క్రితం పలువురు ఫిర్యాదులు చేశారు.
ఈ క్రమంలో హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా అన్వేష్‌కు సంబంధించిన సోషల్ మీడియా ఖాతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. తాజాగా అతడి సోషల్ మీడియా ఖాతాలపై మెటా నిషేధం విధిస్తూ పూర్తిగా బ్యాన్ చేసింది. ఇదిలా ఉండగా, గతంలో అన్వేష్ ఇన్ స్టాగ్రామ్ అకౌంటుకు 18 మిలియన్ల మంది పాలోవర్లు ఉండేవారు. అయితే ఆయన ఇటీవల భారతదేశంపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఫాలోవర్ల సంఖ్య క్రమేపీ 1.3 మిలియన్లకు తగ్గింది. తాజాగా మెటా తీసుకున్న చర్యలతో అతడి ఖాతా పూర్తిగా బ్యాన్ కావడం గమనార్హం.