‘బా బా బ్లాక్ షీప్’పై మేఘాలయ సీఎం ప్రశంసలు.. ఈ తెలుగు సినిమాకు ఇంత ప్రత్యేకత ఉందా?

ABN , Publish Date - Oct 08 , 2026 | 11:22 AM

మేఘాలయలో పూర్తిగా తెరకెక్కిన తొలి దక్షిణ భారత చిత్రంగా ‘బా బా బ్లాక్ షీప్’ నిలిచింది. అక్టోబర్ 9న రిలీజ్ కానున్న ఈ సినిమాను సీఎం కాన్రాడ్ సంగ్మా ప్రశంసించారు.

Ba Ba Black Sheep

మొట్ట మొద‌టి సారిగా మేఘాలయ (Meghalaya) లోని ప్రకృతి అందాలను నేపథ్యంగా చేసుకుని ఊహించని మలుపులు, వైవిధ్యమైన పాత్రలతో తెరకెక్కిన తెలుగు క్రైమ్ కామెడీ ‘బా బా బ్లాక్ షీప్’ (Ba Ba Black Sheep) విడుదలకు సిద్ధమైంది. అక్టోబర్ 9 శుక్ర‌వారం రోజున ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. మేఘాలయోలో పూర్తిస్థాయిలో చిత్రీకరణ జరుపుకొన్న దక్షిణాది చిత్రంగా అరుదైన ఘనత సాధించింది. తాజాగా మేఘాలయ ముఖ్యమంత్రి (Meghalaya CM) కాన్రాడ్ కె. సంగ్మా (Conrad Sangma) చిత్ర బృందాన్ని అభినందిస్తూ ప్రత్యేక వీడియో విడుదల చేశారు.

‘మేఘాలయాలోని అద్భుతమైన అందాలను సౌత్‌ ప్రేక్షకులకు మరింత చేరువ చేసే ఈ చిత్రం మా రాష్ట్రానికి గర్వకారణం’ అని పేర్కొన్నారు. మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రంగా ‘బా బా బ్లాక్ షీప్’ నిలిచిందని సంగ్మా పేర్కొన్నారు. ఈ సినిమా ద్వారా రాష్ట్రంలోని కొండలు, జలపాతాలు, నదులు, సహజంగా ఏర్పడిన వేర్ల వంతెనల అందాలు దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు పరిచయం అవుతాయని అన్నారు. తమ ప్రాంతాన్ని ప్రపంచానికి పరిచయం చేసేందుకు సినిమాలు మంచి వేదికగా నిలుస్తాయని తెలిపారు.

సినిమా కోసం మేఘాలయను ఎంచుకున్న నిర్మాత వేణు దోనేపూడి, చిత్రాలయం స్టూడియోస్ బృందంతో పాటు నటీనటులు, సాంకేతిక నిపుణులను సీఎం అభినందించారు. సినిమా షూటింగ్ వల్ల స్థానిక యువతకు ఉపాధి అవకాశాలతో పాటు కొత్త నైపుణ్యాలు నేర్చుకునే అవకాశం లభిస్తుందని చెప్పారు. భవిష్యత్తులో మరింత మంది సినీ నిర్మాతలు మేఘాలయకు రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

ఇక ‘బా బా బ్లాక్ షీప్’లో కామెడీతో పాటు క్రైమ్ అంశాలు, అనూహ్య మలుపులు, విభిన్నమైన పాత్రలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని సంగ్మా అన్నారు. సినిమా ద్వారా మేఘాలయ ప్రకృతి అందాలను చూసే ప్రేక్షకులు.. ఆ తర్వాత రాష్ట్రాన్ని ప్రత్యక్షంగా సందర్శించాలని ఆయన ఆకాంక్షించారు.

ఈ సంద‌ర్భంగా సీఎం ప్రశంసలపై నిర్మాత వేణు దోనేపూడి స్పందిస్తూ.. కాన్రాడ్ సంగ్మా అందించిన ప్రోత్సాహానికి కృతజ్ఞతలు తెలిపారు. మేఘాలయ ప్రజలు తమ చిత్ర బృందానికి ఎంతో ఆత్మీయంగా స్వాగతం పలికారని చెప్పారు. అక్కడి ప్రకృతి, స్థానికుల ఆతిథ్యం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ మేఘాలయలో మరిన్ని సినిమాలు తెరకెక్కించాలని ఉందన్నారు.

టిను ఆనంద్‌, ఉపేంద్ర లమాయే, రాజా రవీంద్ర ప్రధాన పాత్రధారులుగా గుణి మంచికంటి దర్శకత్వం వహిస్తున్న ఈ న్యూ ఏజ్ క్రైమ్ కామెడీని వేణు దోనేపూడి నిర్మిస్తున్నారు. దోనేపూడి చక్రపాణి సమర్పణలో చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్‌పై రూపొందిన ‘బా బా బ్లాక్ షీప్’ అక్టోబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated Date - Oct 08 , 2026 | 11:25 AM