ఊగిస‌లాట‌లో.. అటు విశ్వంభ‌ర ఇటు కాక‌

ABN , Publish Date - Sep 25 , 2026 | 09:02 AM

చిరంజీవి సినిమా వస్తుందంటే చాలు.. థియేటర్ల దగ్గర పండగ వాతావరణం కనిపిస్తుంది. అలాంటిది ఒకే సీజన్‌లో ఒకే హీరో నటించిన రెండు భారీ సినిమాలు తలపడితే పరిస్థితి ఎలా ఉంటుంది..?

Chiranjeevi

బాక్సాఫీస్ దగ్గర మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సినిమా వస్తుందంటే చాలు.. థియేటర్ల దగ్గర పండగ వాతావరణం కనిపిస్తుంది. అలాంటిది ఒకే సీజన్‌లో.. అదీ టాలీవుడ్ అతిపెద్ద పండగ సంక్రాంతి బరిలో ఒకే హీరో నటించిన రెండు భారీ సినిమాలు తలపడితే పరిస్థితి ఎలా ఉంటుంది..? ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో ఇదే హాట్ టాపిక్! మెగాస్టార్ రెండు ప్రాజెక్టులు.. ఇద్దరు క్రేజీ డైరెక్టర్లు.. ఇద్దరు బడా నిర్మాతలు.. అసలు మెగాస్టార్ ఓటు ఎవరికి పడనుంది..? విశ్వంభర (Vishwambhara) దారి క్లియర్ అవుతుందా లేక కాకా బాక్సాఫీస్ వేట మొదలవుతుందా?

ముందుగా వశిష్ట (Mallidi Vasishta) దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ తెరకెక్కిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ 'విశ్వంభర' విషయానికి వస్తే, వాస్తవానికి ఈ సినిమాను 2025 సంక్రాంతికే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేశారు. కానీ సినిమా స్థాయి దృష్ట్యా, గ్రాఫిక్స్ విషయంలో ఏమాత్రం రాజీపడకూడదన్న ఉద్దేశంతో అనుకున్న సమయానికి రాలేకపోయింది. VFX వర్క్ ఆలస్యం కావడంతో విడుదల వాయిదా పడుతూ వచ్చింది. ఈ ఏడాది వేసవిలో వస్తుందని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూశారు. ఆ తర్వాత దసరా సీజన్‌కు తీసుకొస్తారనే చర్చ కూడా గట్టిగానే సాగింది. కానీ నెలలు గడుస్తున్నా మేకర్స్ నుంచి ఎలాంటి అప్‌డేట్ రాలేదు. దీంతో ఫ్యాన్స్‌లో తీవ్ర నిరాశ మొదలైంది.

అయితే తాజాగా విశ్వంభర చిత్రాన్ని సంక్రాంతి సీజన్‌లో రిలీజ్‌ చేయాలనే ప్రయత్నాలు మొదలయ్యాయి. దీంతో పాటు, మెగాస్టార్‌కు 'వాల్తేరు వీరయ్య'తో సూపర్ హిట్ అందించిన బాబీ కొల్లి (Bobby Kolli) దర్శకత్వంలో రూపొందుతున్న 'కాకాస‌ (Kaaka) చిత్రం కూడా సరిగ్గా అదే సంక్రాంతి సీజన్‌ను టార్గెట్ చేస్తోంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ ప్రాజెక్ట్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. బాబీ మేకింగ్ స్పీడ్ చూస్తుంటే పండగ సమయానికి సినిమా సిద్ధం చేయడం ఏమంత పెద్ద కష్టం కాదని టాక్ వినిపిస్తోంది.

పైగా సంక్రాంతి సెంటిమెంట్ చిరంజీవికి ఎంతో బాగా కలిసివచ్చిన నేపథ్యం ఉంది. అందుకే ఇటు కేవీఎన్ ప్రొడక్షన్స్, అటు డైరెక్టర్ బాబీ సంక్రాంతి స్లాట్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవడానికి సిద్ధంగా లేరు. ఒకే సీజన్‌లో ఇద్దరు వేర్వేరు హీరోల సినిమాలు పోటీ పడితే రసవత్తరంగా ఉంటుంది. కానీ ఒకే హీరో నటించిన రెండు భారీ బడ్జెట్ చిత్రాలు ఒకేసారి రిలీజ్ అయితే..? ఖచ్చితంగా థియేటర్ల కేటాయింపు, కలెక్షన్ల పరంగా బాక్సాఫీస్ వద్ద భారీ డ్యామేజ్ జరిగే ముప్పు ఉంది.

ఈ పరిస్థితుల్లో మెగాస్టార్ ఎవరికి సపోర్ట్ చేయాలనే విషయంపై తీవ్ర తర్జనభర్జన పడుతున్నట్లు ఫిలిం నగర్ సమాచారం. ఇప్పటికే రెండు చిత్ర నిర్మాణ సంస్థలతో స్వయంగా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అయితే ఇరు సంస్థలు తాము నిర్మిస్తున్న కంటెంట్‌పై పూర్తి నమ్మకంతో ఉండటం వల్ల ఏ ఒక్కరూ వెనక్కి తగ్గేందుకు సుముఖంగా లేరట. దీంతో మెగాస్టార్ సైతం ప్రస్తుతానికి మౌనం వహించారనే ప్రచారం నడుస్తోంది.

మరోవైపు విశ్వంభర చిత్రాన్ని నవంబర్ నెలాఖరులో రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా యూవీ క్రియేషన్స్ పరిశీలిస్తున్నట్లు వినికిడి. కానీ కేవలం రెండు నెలల గ్యాప్‌లోనే మరో మెగా మూవీ 'కాకా' థియేటర్లలోకి వస్తే.. విశ్వంభర లాంగ్ రన్‌పై ప్రభావం పడే అవకాశం లేకపోలేదు. బిజినెస్ పరంగా, ప్రమోషన్స్ పరంగా రెండు ప్రాజెక్టులకు ఇది కాస్త రిస్కే అని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు. సంక్రాంతి బరిలో ఇద్దరు మేకర్లలో ఎవరు వెనక్కి తగ్గుతారనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది.

Updated Date - Sep 25 , 2026 | 09:02 AM