టాలీవుడ్ కోసం మెగాస్టార్ ముందడుగు.. అమిత్ షాతో చిరు భేటీ

ABN , Publish Date - Nov 02 , 2026 | 09:06 PM

ఇండస్ట్రీలో ఆర్టిస్టుల హక్కులు, వారి గౌరవానికి తీవ్ర భంగం కలిగిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డీప్‌ఫేక్ టెక్నాలజీల దుర్వినియోగంపై మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ముందడుగు వేశారు.

Megastar Chiranjeevi

ఇండస్ట్రీలో ఆర్టిస్టుల హక్కులు, వారి గౌరవానికి తీవ్ర భంగం కలిగిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డీప్‌ఫేక్ టెక్నాలజీల దుర్వినియోగంపై మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ముందడుగు వేశారు. ఇటీవల కాలంలో ఈ సాంకేతికతను తప్పుడు మార్గాల్లో వాడుతూ, నటీనటుల సృజనాత్మకతను, వారి వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీస్తున్న వికృత చేష్టలపై ఆయన గళమెత్తారు. ఈ క్రమంలోనే, ఆయన గళం కేవలం సోషల్ మీడియా వేదికలకే పరిమితం కాకుండా, సమస్యను నేరుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. సోమవారం హైదరాబాద్‌లో భారత గౌరవ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను చిరంజీవి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ ప్రత్యేక సమావేశంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా పాల్గొని, చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న ఈ డిజిటల్ సవాళ్లను హోంమంత్రికి క్షుణ్ణంగా వివరించారు.


అమిత్ షా భేటీకి సంబంధించిన ఫోటోలను చిరు షేర్ చేస్తూ.. ఆయనను కలవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. 'ఈ రోజు గౌరవనీయులైన కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారిని కలవడం ఒక గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డీప్‌ఫేక్ (Deepfake) సాంకేతికతల దుర్వినియోగం వల్ల కళాకారుల హక్కులు, గౌరవం, సృజనాత్మకతకు తీవ్ర ప్రమాదం ఏర్పడుతోందనే విషయంపై నా లోతైన ఆందోళనను ఆయనతో పంచుకున్నాను. ఆయన మన ఆందోళనలను ఎంతో సానుకూలంగా అర్థం చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ అంశాన్ని తక్షణమే పరిశీలించి కఠినమైన రక్షణ చర్యలు, భారీ జరిమానాలతో కూడిన చట్టాలు తీసుకొచ్చే దిశగా పనిచేస్తుందని హామీ ఇచ్చారు.


అలాగే, దీనికి సంబంధించి ఒక లిఖితపూర్వక వినతిపత్రం సమర్పించాలని సూచించి, ఈ వ్యవహారాన్ని సమన్వయం చేసే బాధ్యతను కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి గారికి అప్పగించారు. ఇది చలనచిత్ర రంగానికి ఎంతో ప్రోత్సాహకరమైన ముందడుగు. హోంమంత్రి గారు ఇచ్చిన హామీకి ధన్యవాదాలు తెలుపుతున్నాను, త్వరలోనే కళాకారులకు తగిన రక్షణ వ్యవస్థ రూపుదిద్దుకుంటుందని ఆశిస్తున్నాను' అని ఎక్స్ ద్వారా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Updated Date - Nov 02 , 2026 | 09:09 PM