Chiranjeevi: భావాన్ని స్వరంగా మార్చిన అసాధారణ కళాకారిణి
ABN , Publish Date - Jul 12 , 2026 | 07:50 AM
ఆరు దశాబ్దాలపాటు 20 భాషల్లో 50 వేలకు పైగా పాటలు పాడిన గాన కోకిల, ప్రముఖ గాయని ఎస్.జాసకి(88) కన్నుమూశారు. చిరంజీవి నివాళులు అర్పిస్తూ పోస్ట్ పెట్టారు
ఆరు దశాబ్దాలపాటు 20 భాషల్లో 50 వేలకు పైగా పాటలు పాడిన గాన కోకిల, ప్రముఖ గాయని ఎస్.జాసకి(88) కన్నుమూశారు. వయో సహజ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె మైసూరులోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం 7.30 గంటల సమయంలో తుది శ్వాస విడిచారు. మైసూరు నగరంలోని బన్నూరు రోడ్డులో జానకమ్మకు ఫాంహౌస్ ఉంది. కొంతకాలంగా ఆమె అక్కడే ఉంటున్నారు. శుక్రవారం రాత్రి ఆమె శ్వాసకోశ సమస్యతో ఇబ్బంది పడినట్లు డాక్టర్లు తెలిపారు. వయోధిక సమస్యలతో ఆమె కన్నుమూసినట్లు జానకమ్మ మనవరాలు అప్సర విద్యుల ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తెలిపారు. జానకమ్మ చివరి కోరిక మేరకు ఆమె అంత్యక్రియలు అదివారం మైసూరులో జరపాలని నిర్ణయించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అధికార లాంఛనాలతో ఆదివారం అంత్యక్రియలు జరుగనున్నాయి. జానకమ్మ మరణవార్తతో టాలీవుడ్ మాత్రమే కాదు దక్షిణాది చిత్ర పరిశ్రమలన్నీ తీవ్ర దిగ్ర్భాంతికి లోనయ్యాయి. పలువురు సినీ ప్రముఖులు ఆమెకు నివాళులు అర్పిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి జానకమ్మకు నివాళులు అర్పిస్తూ సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్ పెట్టారు.
ప్రతి పాట జీవితకాలపు అనుబంధం: చిరంజీవి
'జానకమ్మ గారి మరణవార్త నా హృదయాన్ని ఎంతో కలచివేసింది. నా సినీ ప్రయాణంలో ఎన్నో మరపురాని పాటలకు ఆమె తన అపురూపమైన గాత్రాన్ని అందించారు. మేము తెరపై పలికించిన ఎన్నో భావోద్వేగాలకు ప్రాణం పోసింది ఆమె స్వరమే. నా కెరీర్‌లో ప్రేక్షకులు ప్రేమగా గుర్తుంచుకున్న ఎన్నో పాటల వెనుక జానకమ్మ గారి మధుర గాత్రం ఉంది. ఆ పాటలు వినిపించిన ప్రతిసారీ, ఆ రోజులు.. ఆ జ్ఞాపకాలు... మళ్లీ కళ్లముందు సజీవంగా నిలుస్తాయి. జానకమ్మ ఒక గాయని మాత్రమే కాదు... భావాన్ని స్వరంగా మార్చిన అసాధారణ కళాకారిణి. ఆమె పాడిన ప్రతి పాట ఒక జ్ఞాపకం... ఒక అనుభూతి... ఒక జీవితకాలపు అనుబంధం. ఈ రోజు మనం సంగీత ప్రపంచంలోని ఓ మహోన్నత శిఖరాన్ని కోల్పోయాం. కానీ ఆమె గానం ఎన్నో తరాలకు స్ఫూర్తిగా, మన జీవితాలకు నేపథ్య సంగీతంగా చిరకాలం మార్మోగుతూనే ఉంటుంది. ఎస్. జానకి గారి కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు, ఆమెను అభిమానించే కోట్లాది సంగీతాభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను' అని పేర్కొన్నారు.
మహోన్నత శిఖరం జానకమ్మని కోల్పోయాం: బాలకృష్ణ
ఈ రోజు మనం సంగీత ప్రపంచంలోని ఓ మహోన్నత శిఖరం జానకమ్మని కోల్పోయామని నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యానించారు. ఆమె గానం ఎన్నో తరాలకు స్ఫూర్తిగా, మన జీవితాలకు నేపథ్య సంగీతంగా చిరకాలం మార్మోగుతూనే ఉంటుందని స్మరించుకున్నారు. ఆమె కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు, ఆమెను అభిమానించే కోట్లాది సంగీతాభిమానులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని అన్నారు.