ఎట్టకేలకు వరుణ్ కూడా హిట్ కొట్టేశాడు..

ABN , Publish Date - Aug 07 , 2026 | 04:28 PM

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'ముకుంద', 'కంచె' వంటి వైవిధ్యమైన చిత్రాలతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, 'ఫిదా', 'తొలిప్రేమ' చిత్రాలతో క్లాస్, లవర్ బాయ్‌గా ప్రశంసలు అందుకున్నాడు.

Varun Tej

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) 'ముకుంద', 'కంచె' వంటి వైవిధ్యమైన చిత్రాలతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, 'ఫిదా', 'తొలిప్రేమ' చిత్రాలతో క్లాస్, లవర్ బాయ్‌గా ప్రశంసలు అందుకున్నాడు. అలాగే 'గద్దలకొండ గణేష్' మూవీలో తన ఊరమాస్ పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను విపరీతంగా మెప్పించిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా తర్వాత వచ్చిన కొన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద తీవ్ర పరాజయాన్ని ఎదుర్కోవడంతో వరుణ్ తేజ్ కెరీర్ కొంత ఊగిసలాటలో పడింది. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న ఈ మెగా హీరో, ఇప్పుడు 'కొరియన్ కనకరాజు' రూపంలో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చి సాలిడ్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.


డైరెక్టర్ మేర్లపాక గాంధీ తెరకెక్కించిన ఈ ఇండో-కొరియన్ హారర్ కామెడీ చిత్రం శుక్రవారం రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ టాక్ ను అందుకుంది. ప్రీమియర్ల నుంచే ఈ చిత్రానికి అత్యంత పాజిటివ్ టాక్ రావడంతో సోషల్ మీడియా అంతటా 'కొరియన్ కనకరాజు' హవా నడుస్తోంది. యువి క్రియేషన్స్ నిర్మాణం, తమన్ అందించిన ఎనర్జిటిక్ మ్యూజిక్, సత్య మార్క్ వన్ లైనర్స్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ పోషించిన కనకరాజు పాత్ర థియేటర్లలో ప్రేక్షకులచేత విజిల్స్ వేయిస్తోంది. పెనుగొండ నేపథ్యంతో సాగే పల్లెటూరి కుర్రాడి వైబ్స్, అతని శరీరంలోకి ఒక కొరియన్ వ్యక్తి ఆత్మ ప్రవేశించిన తర్వాత వచ్చే సన్నివేశాల్లో వరుణ్ చూపించిన బాడీ లాంగ్వేజ్, టైమింగ్ థియేటర్లను నవ్వుల సముద్రంలో ముంచెత్తుతున్నాయి. కమెడియన్ సత్యతో కలసి వరుణ్ పండించిన కామెడీ కెమిస్ట్రీ ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది.


చాలా కాలం తర్వాత వరుణ్ తేజ్ కి ఒక పర్ఫెక్ట్ హిట్ పడిందని చెప్పొచ్చు. ఈ ఏడాది వరుస ప్లాప్ లతో ఉన్న హీరోలందరికీ మంచి విజయాలు దక్కుతున్నాయి. మొన్నటికి మొన్న అఖిల్ లెనిన్ సినిమాతో హిట్ ని అందుకున్నాడు. ఇక ఇప్పుడు వరుణ్ కూడా హిట్ ని పట్టేశాడు. ఈ హిట్ తో వరుణ్ కి ఎలాంటి సినిమాలు ఎప్పుడు తీయాలి అనే క్లారిటీ వచ్చింది. మరి ముందు ముందు వరుణ్ ఇలానే మంచి కథలను ఎంచుకొని హిట్స్ అందుకుంటాడా.. లేక ఈ విజయంతోనే సరిపెట్టుకుంటాడా అనేది చూడాలి.

Updated Date - Aug 07 , 2026 | 04:29 PM