Meenakshi Chaudhary: మీనూ.. ముచ్చటగా మూడో హిట్ కోసం వైటింగా
ABN , Publish Date - Jan 19 , 2026 | 08:04 PM
మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) నాజూకు షోకులు కుర్రాళ్ళను కిర్రెక్కిస్తున్నాయి. మీనాక్షి నటించిన చిత్రాల జయాపజయాలు ఎలా ఉన్నా ఆమె కోసం థియేటర్లకు పరుగులు తీసే ఫ్యాన్స్ ను సంపాదించుకుంది ఈ భామ.
Meenakshi Chaudhary: మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) నాజూకు షోకులు కుర్రాళ్ళను కిర్రెక్కిస్తున్నాయి. మీనాక్షి నటించిన చిత్రాల జయాపజయాలు ఎలా ఉన్నా ఆమె కోసం థియేటర్లకు పరుగులు తీసే ఫ్యాన్స్ ను సంపాదించుకుంది ఈ భామ. తెలుగు చిత్రాల్లోనే మీనాక్షి అందం రసికులకు బంధాలు వేస్తూ ఉండడం గమనార్హం! 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' అనే చిత్రంతో తెలుగువారి ముందు నిలచిన మీనాక్షి అప్పటి నుంచీ అందంతోనే ఆకట్టుకుంటోంది... కొన్ని చిత్రాల్లో నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు పోషించినా ఆమెకు అదిరిపోయే హిట్ ను అందించిన చిత్రంగా 'సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vastunnam)' నిలచింది. గత సంవత్సరం పొంగల్ రేస్ లోనే కాదు, 2025 బ్లాక్ బస్టర్ హిట్ గా నిలచింది 'సంక్రాంతికి వస్తున్నాం'... దాంతో మీనాక్షి రేంజ్ పెరిగిపోయింది. ఈ సారి సంక్రాంతి సందడిలోనూ మీనాక్షి నాయికగా రూపొందిన 'అనగనగా ఒకరాజు (Anaganaga Oka Raju)' కుర్రకారును ఆకర్షిస్తోంది.
మీనాక్షి నటించిన తెలుగు చిత్రాల్లో 'హిట్-2' సక్సెస్ రూటులో సాగింది. తరువాత మహేశ్ బాబు 'గుంటూరు కారం'లో మీనాక్షి రాజీ అనే పాత్రలో కనిపించింది. కానీ, అందులో ఆమె కథానాయిక కాదు. 'లక్కీ భాస్కర్'లో దుల్కర్ సల్మాన్ భార్యగా నటించి మెప్పించింది మీనాక్షి... ఈ సినిమా డీసెంట్ హిట్ ను పట్టేసింది. "మట్కా, మెకానిక్ రాకీ' మెప్పించలేక పోయాయి. తరువాత వచ్చిన 'సంక్రాంతికి వస్తున్నాం'లో వెంకటేశ్ లాంటి సీనియర్ స్టార్ సరసన నటించి మరీ మురిపించింది మీనాక్షి. ఆ సినిమా 300 కోట్లు పోగేసి అదరహో అనిపించింది... ఈ సారి 'అనగనగా ఒకరాజు'లో సోలో హీరోయిన్ గా అలరిస్తోంది. ఈ మూవీ ఐదు రోజులకే వంద కోట్లు దాటేసి చిన్న సినిమాల్లో పెద్దగా నిలచింది... అలా వరుసగా రెండు సంవత్సరాలు పొంగల్ బరిలో గ్రాండ్ సక్సెస్ చూసిన మీనాక్షివైపు అందరి చూపు సాగుతోంది.
ప్రస్తుతం నాగచైతన్య హీరోగా రూపొందుతోన్న 'వృషకర్మ' చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది... 'విరూపాక్ష' సినిమాతో సాయిధరమ్ తేజ్ కు ఓ మంచి విజయాన్ని అందించిన కార్తిక్ వర్మ దండు ఈ 'వృషకర్మ' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు... దాంతో 'వృషకర్మ'పై భారీ అంచనాలున్నాయి. ఇందులో నాగచైతన్య సాహసవంతుని పాత్రలో నటిస్తూండగా, ఆయనకు సమానమైన రోల్ లోనే మీనాక్షి కూడా నటిస్తోంది. ఈ సినిమా కూడా విజయం సాధిస్తే మీనాక్షి వరుసగా మూడు హిట్స్ తో 'హ్యాట్రిక్' సాధించినట్టవుతుంది. డీసెంట్ రోల్స్ లో మురిపిస్తోన్న మీనాక్షి చౌదరి 'వృషకర్మ'తో ఎలాంటి సక్సెస్ ను సొంతం చేసుకుంటుందో, ఆ తరువాత ఏ తీరున సాగుతుందో చూడాలి.