'బూంగ్' టీమ్‌కు ప్రధాని మోదీ ప్రశంసలు!

ABN , Publish Date - Feb 24 , 2026 | 03:51 PM

మణిపురి చిత్రం 'బూంగ్' బాఫ్టా అవార్డును గెలుచుకుంది. పలు హాలీవుడ్ చిత్రాలతో పోటీ పడి 'బూంగ్' ఈ అవార్డుకు ఎంపిక కావడం విశేషం. ఈ సినిమా బృందాన్ని మోదీ అభినందించారు.

Boong Movie

గుగున్ కిప్టెన్, బాలా హిజామ్, అంగోమ్ సనామతుమ్ కీలక పాత్రలు పోషించిన సినిమా 'బూంగ్' (Boong). ఈ మణిపురి చిత్రం ఇప్పుడు అంతర్జాతీయ యవనికపై తన సత్తాను చాటింది. 79వ బాఫ్టా (బ్రిటిష్‌ అకాడమీ ఆఫ్‌ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్) లో బెస్ట్ చిల్డ్రన్స్ అండ్ ఫ్యామిలీ ఫిల్మ్ కేటగిరిలో ఈ సినిమా అవార్డుకు ఎంపికైంది. ఓ భారతీయ చిత్రం ఈ విభాగంలో అవార్డు పొందడం ఇదే మొదటిసారి. ఈ విభాగంలో 'బూంగ్' చిత్రం 'జూటోపియా 2, లిలో-స్టిచ్‌, ఆర్కో' వంటి చిత్రాలతో పోటీ పడి నెగ్గడం మరో విశేషం. 'బూంగ్‌' చిత్రాన్ని లక్ష్మీ ప్రియా దేవి డైరెక్ట్ చేశారు. ఆమెకు ఇదే తొలి ఫీచర్ ఫిల్మ్. ఈ సినిమాను మెక్ అలెక్స్, రితేష్‌ సిధ్వాని, షుజాత్ వ్యాపారి నిర్మించారు. ఈ సినిమా రెండేళ్ళ క్రితం కెనడాలో జరిగిన 49వ టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తొలిసారి ప్రదర్శన జరుపుకుంది. గత యేడాది సెప్టెంబర్‌ 19న ఈ సినిమాను ఇండియాలో విడుదల చేశారు.


ఈ సినిమా కథ విషయానికి వస్తే... ఇది బూంగ్ అనే పాఠశాల విద్యార్థి కథ. తన తల్లిదండ్రులు మందాకిని, జాయ్ కుమార్ ను కలిపేందుకు బూంగ్ తన స్వస్థలం నుంచి మయన్మార్ సరిహద్దు వరకూ ఎలాంటి ఆపత్తులను ఎదుర్కొని చేరాడనేదే ఇందులోని ప్రధానాంశం. బాఫ్టాలో అవార్డును అందుకున్న అనంతరం దర్శకురాలు లక్ష్మీ ప్రియాదేవి జ్యూరీ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. తన మాతృభూమి మణిపుర్‌లో శాంతి నెలకొనాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు ఆమె తెలిపారు. ఇదే సందర్భంలో ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) 'బూంగ్' చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. దేశంలోని అపారమైన సృజనాత్మకతకు లభించిన గౌరవం ఇదని ప్రధాని అన్నారు. 'బాఫ్టా' అవార్డును గెలుచుకున్న 'బూంగ్' టీమ్‌ సభ్యులను సినిమా రంగానికి చెందిన పలువురు అభినందించారు.

Updated Date - Feb 24 , 2026 | 04:02 PM