బాలయ్య ‘దాదా’ షూటింగ్ విరామంలో మంచు మనోజ్ ఏం చేశారంటే..
ABN , Publish Date - Oct 07 , 2026 | 06:35 PM
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘దాదా’. ఇందులో మంచు మనోజ్ ఓ కీలక పాత్ర చేస్తోన్న విషయం తెలిసిందే.
నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హీరోగా, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని (Gopichand Malineni) దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘దాదా’ (Dada Movie). వీరిద్దరి కాంబోలో ఇప్పటికే వచ్చిన ‘వీరసింహారెడ్డి’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వస్తున్న చిత్రం కావడంతో దీనిపై ఇండస్ట్రీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ కర్ణాటకలోని మైసూరు పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో ‘రాకింగ్’ మంచు మనోజ్ (RawKing Manchu Manoj) అత్యంత కీలకమైన, పవర్‌ఫుల్ పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. అయితే షూటింగ్ విరామం దొరకగానే మనోజ్ చేసిన పని ఇప్పుడు నెట్టింట విశేషంగా ఆకట్టుకుంటోంది.
షెడ్యూల్ బ్రేక్ సమయంలో మంచు మనోజ్ తన సతీమణి భూమా మౌనిక మంచు, కుమారుడు ధైరవ్, ముద్దుల కుమార్తె దేవసేన శోభలతో కలిసి మైసూరులోని ప్రసిద్ధ చాముండి కొండలపై కొలువైన శ్రీ చాముండేశ్వరి అమ్మవారిని (Sri Chamundeshwari Temple in Mysuru) దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన మనోజ్ దంపతులకు ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో సాదర స్వాగతం పలికారు. అమ్మవారి సన్నిధిలో కుటుంబ సమేతంగా కూర్చుని ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు మనోజ్. అనంతరం వేద పండితులు వారికి వేద మంత్రోచ్ఛారణలతో దివ్య ఆశీర్వచనాలు అందజేశారు. ఆలయ అధికారులు వారికి శేషవస్త్రాలు కప్పి, తీర్థ ప్రసాదాలు అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ పూజా కార్యక్రమంలో పలువురు స్థానిక ప్రముఖులు కూడా పాల్గొన్నారు. మనోజ్ ఫ్యామిలీతో కలిసి ఆలయానికి రావడంతో స్థానిక భక్తులు, అభిమానులు ఆయనను చూసేందుకు, పలకరించేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మనోజ్ కూడా అభిమానులందరికీ అభివాదం చేస్తూ ఆప్యాయంగా పలకరించారు.

ఇక రీ-ఎంట్రీలో విభిన్నమైన ప్రాజెక్టులను ఎంచుకుంటూ ఫుల్ జోష్‌లో ఉన్న మంచు మనోజ్.. అటు బాలయ్యతో స్క్రీన్ షేర్ చేసుకుంటూనే, మరోవైపు కుటుంబానికి సమయం కేటాయించి ఇలా ఆధ్యాత్మిక యాత్ర చేయడం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ ఆధ్యాత్మిక దర్శనం తర్వాత మనోజ్ మళ్లీ ‘దాదా’ యాక్షన్ ప్యాక్డ్ షూటింగ్‌లో బిజీ కానున్నారు.
ఇవి కూడా చదవండి:
2 కోట్లతో 400 కోట్లు.. మాకు చెంపపెట్టులా ఉంది: మైత్రీ రవిశంకర్
జైలర్ 2 లో హృతిక్.. కూలీలో అమీర్‌లా ఉండడుగా
మళ్లీ తల్లి కాబోతోన్న కియారా అద్వానీ.. ఫొటోతో గుడ్‌న్యూస్