మంచు మనోజ్‌: చిన్నారి ప్రాణాలు కాపాడితే అందరూ గెలిచినట్లే..

ABN , Publish Date - Feb 24 , 2026 | 05:23 PM

చిన్నారి పునర్విక పేరు ప్రస్తుతం అన్ని మాధ్యమాల్లోనూ వైరల్‌గా మారింది. తాజాగా ఈ చిన్నారి ఆరోగ్య పరిస్థితిపై మంచు మనోజ్‌ స్పందించారు.


చిన్నారి పునర్విక (Punarvika) పేరు ప్రస్తుతం అన్ని మాధ్యమాల్లోనూ వైరల్‌గా మారింది. తాజాగా ఈ చిన్నారి ఆరోగ్య పరిస్థితిపై మంచు మనోజ్‌ (Manchu Manoj) స్పందించారు. పునర్విక గురించి తెలిసి తన హృదయం ముక్కలైందని ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా వెల్దుర్తికి చెందిన సురేశ్‌కుమార్‌, పుష్పవతి దంపతులకు గతేడాది ఏప్రిల్‌ 12న  పునర్విక పుట్టింది.  ఆరు నెలలైనా పాపలో  కదిలికలు లేకపోవడంతో తల్లిదండ్రులు వైద్య పరీక్షలు చేయించారు. చిన్నారి స్పైనల్‌ మస్క్యులర్‌ ఆంట్రోఫీ అనే సమస్యతో బాధపడుతున్నట్లు, దీనికి రూ.16 కోట్ల విలువ చేేస ఇంజెక్షన్‌ ఒకటే చికిత్స అని వైద్యులు చెప్పారు. దీంతో ఆ చిన్నారి కష్టం తెలుసుకున్న తెలుగు యువత ఆమెకు అండగా నిలబడటానికి ముందుకొచ్చారు.

సోషల్‌ మీడియా వేదికగా ఇన్‌ఫ్లూయెన్సర్లు వరుసగా పోస్ట్‌లు పెడుతూ చికిత్స కోసం ఇప్పటి దాకా రూ.8 కోట్లు కలెక్ట్‌ చేశారు. ఈ విషయం తెలుసుకున్న నటుడు మంచు మనోజ్‌ యువతను అభినందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. ఆ చిన్నారికి సాయం అందేలా చూడాలని పీఎంవో, రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ట్యాగ్‌ చేశారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితి బాగోలేదని ఆమెను కలిసే ప్రయత్నం ఎవరూ చేయవద్దని కోరారు. ఆ చిన్నారి ప్రాణాలు కాపాడగలిగితే పాప కుటుంబంతో పాటు అందరూ గెలిచినట్లే అని తెలిపారు.  

 

Updated Date - Feb 24 , 2026 | 05:30 PM