Dasari Narayanarao: దాసరి వర్ధంతి.. అంతా అయ్యక క్యూ కడుతున్నారు..

ABN , Publish Date - May 30 , 2026 | 05:50 PM

మే 30వ తేది.. ఒకప్పుడు టాలీవుడ్‌కు పెద్ద దిక్కుగా ఉన్న దర్శకరత్న దాసరి నారాయణరావు వర్ధంతి. ఈ విషయాన్ని ఇండస్ట్రీలో అతి తక్కువమందికి గుర్తుంది.


మే 30వ తేది.. ఒకప్పుడు టాలీవుడ్‌కు పెద్ద దిక్కుగా ఉన్న దర్శకరత్న దాసరి నారాయణరావు వర్ధంతి. ఈ విషయాన్ని ఇండస్ట్రీలో అతి తక్కువమందికి గుర్తుంది. ఆయన కుమారులు ప్రభు, అరుణ్‌లకు గుర్తుందో లేదో కూడా తెలియదు. దాసరి వర్ధంతిని గుర్తు పెట్టుకున్న కొందరు అభిమానులు మొయినాబాద్‌లోని ఆయన స్మారక స్థలానికి వెళ్లారు.
అక్కడ పరిస్థితిని చూసి షాకయ్యారు. అక్కడ వ్యవసాయం క్షేత్రంలో ఉన్న దాసరి నారాయణరావు, పద్మల సమాఽధులు ముళ్ల కంచెలు, పిచ్చి మొక్కల మధ్య దారితెన్ను లేకుండా ఉండటాన్ని గమనించిన అభిమానులు భావోద్వేగానికి లోనయ్యారు. ఆ సన్నివేశాలను చిత్రీకరించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా వైరల్‌ అయ్యాయి. దాంతో టాలీవుడ్‌లో ఒక్కొక్కరికి దాసరి గుర్తొచ్చారు. ఒక్కప్పుడు ఆయన సినీ ఇండస్ట్రీకి పెద్దగా ఉన్నారనీ, ఎంతోమందికి ఎన్నో చేశారని, లైఫ్‌ ఇచ్చారని గుర్తు చేసుకుంటూ రంగంలోకి దిగారు. అయితే నిజంగా దాసరిని గుర్తుంచుకున్న కొందరు మాత్రం దాసరి ఘాట్‌ దగ్గర పరిస్థితి చూసి హృదయం చలించి అక్కడ శుభ్రతా కార్యక్రమాలు చేపట్టారు. అందులో మొదటిగా స్పందించింది దర్శకుడు సాయిరాజేశ్‌ నీలం, మంచు మనోజ్‌. ఈ ఇద్దరూ వెంటనే తమ సిబ్బందిని మొయినాబాద్‌లోని దాసరి వ్యవసాయ క్షేత్రానికి తమ సిబ్బందిని పంపి శుభ్రతా కార్యక్రమాలు చేపట్టారు. మంచు మనోజ్‌ అయితే ఉదయాన్నే అక్కడికి జరుగుతున్న పనులను పర్యవేక్షించారు. దాసరి శిష్యుల్లో ఒకరైన దర్శకుడు రాజ వన్నెంరెడ్డి కూడా ఇందులో పాల్గొన్నారు. తదుపరి స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్యతో కలిసి పూల మాలలతో నివాళులు అర్పించారు.


మంచు మనోజ్‌కు పోటీగా ‘మా’ అధ్యక్షుడు విష్ణు...
దాసరి నారాయణరావు ఘాట్‌ విషయంలో మూవీ ఆర్టిస్ట్ప్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మంచు విష్ణు కాస్త ఆలస్యంగా స్పందించారు. ఆయన టీమ్‌ కూడా శుభ్రత కార్యక్రమాల్లో భాగమయ్యారు. పాలభిషేకాలు చేశారు. అప్పటికే ఇతర బృందాలు ఆయా కార్యక్రమాలను పూర్తి చేశారు. మంచి మనోజ్‌ స్వయంగా రంగంలోకి దిగిన విజువల్స్‌నే విష్ణు టీమ్‌ కూడా పంపడం గమనార్హం. అన్నదమ్ములిద్దరూ ఇక్కడ కూడా పోటీ పడుతున్నారంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. నిజం చెప్పాలంటే మనోజ్‌ స్పందించి కార్యక్రమాలు చేపట్టే వరకూ విష్ణు, అతని టీమ్‌ నుంచి ఎలాంటి స్పందన లేదు. శనివారం మధ్యాహ్నాం మూడు గంటల సమయంలో విష్ణు బృందం స్పందించడంతో ట్రోల్‌ అయ్యారు. ‘మా’ అధ్యక్షుడిగా మీ బాఽధ్యత ఇదేనా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

నటి హేమ నివాళి..
దాసరి వర్ధంతి విషయం తెలుసుకున్న నటి హేమ మొయినాబాద్‌ వెళ్లి నివాళి అర్పించారు. ఈ మేరకు ఆమె సోషల్‌ మీడియాలో వీడియో పోస్ట్‌ చేశారు. ‘నిజంగా ఈ రోజు గురువుగారి వర్ధంతి అని గుర్తు లేదు. ఆయనే గుర్తు చేసినట్లుగా ఇక్కడికి వచ్చేశాను’ అని పేర్కొన్నారు. నేటి ఉదయం వరకూ దాసరి వర్ధంతి అని గుర్తు లేని చాలామంది ఒక్కసారిగా దాసరి స్మారక స్థలాన్ని దర్శించడానికి క్యూ కట్టేస్తున్నారు. అయితే ఆయన కొడుకులిద్దరి నుంచి ఎలాంటి స్పందనా లేకపోవడం బాధాకరం.  

Updated Date - May 30 , 2026 | 05:54 PM