మంచు లక్ష్మి: 'టీచ్ ఫర్ ఛేంజ్' లక్ష్యం అదే
ABN , Publish Date - Mar 29 , 2026 | 12:40 PM
నటి, నిర్మాత మంచు లక్ష్మి 2014లో 'టీచ్ ఫర్ ఛేంజ్' సంస్థను స్థాపించారు. దీని ద్వారా ప్రతి ఏడాదీ ప్రభుత్వ పాఠశాలలు, విద్యార్థులకు మద్దతుగా నిధుల సేకరణ కార్యక్రమం నిర్వహిస్తారు.
నటి, నిర్మాత మంచు లక్ష్మి (Manchu Lakshmi) 2014లో 'టీచ్ ఫర్ ఛేంజ్' (Teach For Change) సంస్థను స్థాపించారు. దీని ద్వారా ప్రతి ఏడాదీ ప్రభుత్వ పాఠశాలలు, విద్యార్థులకు మద్దతుగా నిధుల సేకరణ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ ఏడాది ప్రీమియర్ ఎనర్జీస్ సమర్పణలో హెచ్ఐసీసీ కన్వెన్షన్ సెంటర్ (HICC)లో ఈ కార్యక్రమం జరిగింది. దీనికి తెలంగాణ ఇరిగేషన్ & సిఎడి మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సీతక్క, ప్రిన్సిపల్ ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్ సహా పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు.
'నేపథ్యం ఏదైనా సరే ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య అందాలనే ఆశయంతో 'టీచ్ ఫర్ ఛేంజ్' ప్రారంభమైంద'ని సంస్థ ఛైర్ పర్సన్, మేనేజింగ్ ట్రస్టీ లక్ష్మీ మంచు తెలిపారు. ఇప్పటి వరకు ఈ సంస్థ ద్వారా దేశ వ్యాప్తంగా మూడు లక్షల మందికి పైగా విద్యార్థులకు, అలాగే 1,549 ప్రభుత్వ పాఠశాలలకు మద్దతు తెలిపామని లక్ష్మీ మంచు అన్నారు. ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడం, వెనుకబడిన వర్గాల పిల్లల అభ్యాస ఫలితాలను మెరుగుపరచడం తమ లక్ష్యమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీరత్ కపూర్, అక్షర గౌడ, పాయల్ రాజ్‌పుట్, హెబ్బా పటేల్, తేజస్వి మదివాడ, ఫరియా అబ్దుల్లా, రాశి సింగ్, శివాని నాగారం, దక్ష నగర్కర్, నందిత స్వేత, సుహాసిని, రితికా నాయక్, అమృత అయ్యర్, ఐశ్వర్య అర్జున్, శ్రీదేవి, జయప్రద తదితరులు ర్యాంప్ వాక్ చేశారు. హీరోలలో శివ కందుకూరి, అరవింద్ కృష్ణ, ప్రిన్స్, విరాజ్ అశ్విన్, రోషన్ కె, నందు, ప్రియదర్శి పులికొండ, రోషన్ తదితరులు పాల్గొన్నారు.