మన శంకరవరప్రసాద్ గారు.. 50 రోజులు పూర్తిచేసుకున్నారు

ABN , Publish Date - Mar 02 , 2026 | 04:03 PM

ముచ్చటగా మూడేళ్ళ తరువాత మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అభిమానులకు ఆనందం పంచే స్థాయిలో 'మన శంకరవరప్రసాద్ గారు (Mana ShankaraVaraPrasad Garu)' మూవీ ఘనవిజయం సాధించింది.

Mana ShankaraVaraPrasad Garu

ముచ్చటగా మూడేళ్ళ తరువాత మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అభిమానులకు ఆనందం పంచే స్థాయిలో 'మన శంకర వరప్రసాద్ గారు (Mana Shankara VaraPrasad Garu)' మూవీ ఘనవిజయం సాధించింది. 2023లో 'వాల్తేరు వీరయ్య'తో బిగ్ హిట్ పట్టేసిన చిరంజీవి, తరువాత పరాజయాన్ని చూశారు. నిరాశ చెందిన ఫ్యాన్స్ కు ఈ యేడాది సంక్రాంతి సందడిలో జనవరి 12న విడుదలైన 'మన శంకరవరప్రసాద్ గారు' ఎంతో సంతృప్తిని కలిగించింది. ఈ సినిమా మార్చి 2వ తేదీన యాభై రోజులు పూర్తి చేసుకుంది. మొత్తం 109 కేంద్రాలలో అర్ధశతదినోత్సవం జరుపుకున్నట్టు మేకర్స్ ప్రకటించారు. అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో సుస్మిత కొణిదెల, సాహు గారపాటి నిర్మించిన ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూర్చారు. ఈ మూవీ ఆడియో సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. విడుదలకు ముందే ఇందులోని 'మీసాల పిల్లా...' సాంగ్ 100 మిలియన్ వ్యూస్ పోగేయడం విశేషం.

'మన శంకరవరప్రసాద్ గారు' చిత్రంలో విక్టరీ వెంకటేశ్ అతిథి పాత్ర పోషించారు. ఇందులో నయనతార నాయికగా నటించగా, కేథరిన్ త్రెసా, జరీనా వహాబ్, హర్షవర్ధన్, అభినవ్, సచిన్ ఖేడేకర్, శరత్ సక్సేనా తదితరులు నటించారు. భాస్కరభట్ల, కాసర్ల శ్యామ్, అనంత్ శ్రీరామ్, రామజోగయ్య శాస్త్రి పాటలు పలికించారు. గత సంవత్సరం అనిల్ రావిపూడి తెరకెక్కించిన 'సంక్రాంతికి వస్తున్నాం' కూడా పొంగల్ బరిలోనే దూకి ఘనవిజయం సాధించింది. ఈ సారి కూడా సంక్రాంతి సంబరాల్లోనే 'మన శంకరవరప్రసాద్ గారు' బంపర్ హిట్ సాధించడం విశేషంగా మారింది. అలా లాస్ట్ ఇయర్ తో పాటు, ఈ యేడాది కూడా సంక్రాంతి సంబరాల్లో వెంకటేశ్ సూపర్ హిట్స్ చూసేసినట్టయింది. ఈ చిత్రాలకు అనిల్ రావిపూడి డైరెక్టర్ కావడం విశేషం!

కేవలం తెలుగు భాషలోనే రూపొంది ఘనవిజయం సాధించిన 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రాన్ని 'రీజనల్ మూవీస్'లో ఇండస్ట్రీ హిట్ గా కొనియాడుతున్నారు. ఈ మూవీ ఇప్పటి దాకా 400 కోట్ల రూపాయలు పోగేసింది. ఈ మధ్యే ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవడం మొదలెట్టింది. ఇలా ఈ యేడాది తెలుగు సినిమాకు శుభారంభం పలికిన చిత్రంగా 'మన శంకరవరప్రసాద్ గారు' నిలచింది. ఈ సినిమా చూపిన సక్సెస్ రూటులో ఇంకా ఎన్ని చిత్రాలు పయనిస్తాయో చూడాలి.

Updated Date - Mar 02 , 2026 | 05:38 PM