Chiranjeevi: కోర్టుకు.. మన శంకర వరప్రసాద్ నిర్మాతలు
ABN , Publish Date - Jan 07 , 2026 | 09:23 AM
సంక్రాంతికి రాబోతున్న తమ చిత్రం టిక్కెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఇవ్వమంటూ 'మన శంకర వరప్రసాద్ గారు' నిర్మాతలు తెలంగాణ హైకోర్టు తలుపు తట్టారు. దీనిపై ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టబోతోంది.
చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా తెరకెక్కిన 'మన శంకర వరప్రసాద్ గారు' (Mana Shankara Varaprasad Garu) సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కాబోతోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలకు ఇటు ఆంధ్రప్రదేశ్ లోనూ, ఇటు తెలంగాణలోనూ టిక్కెట్ రేట్లు పెంచుకునే అవకాశం అలానే బెనిఫిట్ షోస్ వేసుకున్న సౌలభ్యం ఉన్నాయి. కానీ కొంత కాలంగా టిక్కెట్ రేట్లను పెంచుతూ ప్రభుత్వం జీవో ఇచ్చినా... దానిపై కొందరు కోర్టుకు వెళ్ళడంతో ఆ నిర్ణయం అమలు కావడం లేదు. మరికొందరు నిర్మాతలు మరోసారి ధర్మాసనంకు వెళ్ళి చివరి క్షణంలో తమ చిత్రాల టిక్కెట్ రేట్లు పెంచుకునేలా అనుమతి పొందుతున్నారు. మొత్తంగా ఈ రెండు రాష్ట్రాలలోనూ టిక్కెట్ రేట్ల పెంపు అనేది ఓ పెద్ద తతంగంగా మారిపోయింది. ఈ నేపథ్యం తెలంగాణ హైకోర్ట్ లో సింగిల్ జడ్జి టిక్కెట్ రేట్ల పెంచకుండా ఉత్తర్వులు జారీ చేశారు. దీనిని సవాల్ చేస్తూ 'మన శంకర్ వర ప్రసాద్ గారు' సినిమా నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ ఎల్.ఎల్.పి. హైకోర్టును ఆశ్రయించింది. సినిమా టిక్కెట్ రేట్లు పెంచకుండా నిర్మాతకే కాకుండా సినిమా రంగానికి, కార్మికులకు సైతం నష్టం వాటిల్లుతుందని పేర్కొంది.
ఇప్పటికే హోంశాఖ ముఖ్యకార్యదర్శికి సైతం నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ టిక్కెట్ రేట్ల పెంపు విషయాన్ని పరిశీలించమని ఓ లేఖ రాసింది. ఈ అంశాన్ని అత్యవసరంగా విచారించాలని నిర్మాణ సంస్థ తరఫు న్యాయవాదులు మంగళవారం జస్టిస్ మౌసమీ భట్టాచార్య, జస్టిస్ గాడి ప్రవీణ్ కుమార్ ధర్మాసనం ఎదుట లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేశారు. అయితే దీనిని బుధవారం విచారణ చేపడతామని ధర్మాసనం పేర్కొంది. కాబట్టి సంక్రాంతి సినిమాల టిక్కెట్ రేట్ల విషయమై ఇవాళ ఓ నిర్ణయం హైకోర్టు నుండి వెలువడే ఆస్కారం ఉంది. ఇదిలా ఉంటే... సినిమా టిక్కెట్ రేట్లను పెంచడానికి ప్రభుత్వం సుముఖంగా లేదని, ఇకపై తమను ఆ విషయంలో సంప్రదించవద్దని ఆ మధ్య తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓ సందర్భంలో ఖరాఖండిగా చెప్పారు. మరి కోర్టు ఇచ్చే తీర్పు బట్టి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.