Tollywood: జనవరి ప్రోగ్రెస్ రిపోర్ట్... అగ్రస్థానంలో మెగాస్టార్ మూవీ...
ABN , Publish Date - Feb 01 , 2026 | 07:40 PM
కొత్త సంవత్సరంలో తొలిమాసం వెళ్ళిపోయింది. ఈ నెలలో 27 సినిమాలు విడుదలైతే 'మన శంకర వరప్రసాద్ గారు' రిజనల్ మూవీస్ లో ఇండస్ట్రీ రికార్డ్ ను సృష్టించడం విశేషం.
కొత్త సంవత్సరంలో తొలి మాసం జనవరి వెళ్ళిపోయింది. విశేషం ఏమంటే... ఈ నెల సరికొత్త ఉత్సాహాన్ని తెలుగు సినిమా రంగంలో నింపింది. ముఖ్యంగా సంక్రాంతి కానుకగా వచ్చిన చిత్రాలు సరికొత్త రికార్డులను నెలకొల్పాయి. ఈ జనవరిలో ఐదు డబ్బింగ్ సినిమాలతో కలిపి మొత్తం 27 సినిమాలు విడుదలయ్యాయి.
జనవరి ఒకటి, రెండు తారీఖులలో తొమ్మిది స్ట్రయిట్ తెలుగు సినిమాలు, మూడు డబ్బింగ్ చిత్రాలు కలిపి మొత్తం 12 సినిమాలు థియేటర్లలో విడుదలయ్యాయి. అలానే 'నువ్వు నాకు నచ్చావ్' సినిమా రీ-రిలీజ్ అయ్యింది. అయితే 'సైక్ సిద్ధార్థ', 'వనవీర' (Vanaveera), 'సఃకుటుంబానాం' వంటి సినిమాలు విడుదలకు ముందు కాస్తంత క్యూరియాసిటీని కలిగించినా... బాక్సాఫీస్ బరిలో మాత్రం ఎలాంటి ప్రభావాన్ని చూపించలేదు. ఆ వీకెండ్ లో 'మదం, ఓ అందాల రాక్షసి, గులాబి, నీలకంఠ, ఘంటసాల ది గ్రేట్, వినరా ఓ వేమతో పాటు కన్నడ అనువాద చిత్రాలు '45, గత వైభవం, మార్క్' విడుదలయ్యాయి.
ఇక అందరూ ఎదురుచూసిన సంక్రాంతి సీజన్ తెలుగు చిత్రసీమలో కొత్త వెలుగులు నింపింది. సంక్రాంతి సీజన్ లో ఏకంగా ఐదు స్ట్రయిట్ తెలుగు సినిమాలు, అవీ ప్రామిసింగ్ హీరోల చిత్రాలు విడుదలయ్యాయి. 9వ తేదీ ప్రభాస్ పాన్ ఇండియా మూవీ 'ది రాజాసాబ్', 12వ తేది చిరంజీవి 'మన శంకరవరప్రసాద్ గారు' (Mana Shankara Varaprasad Garu), 13న రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి', 14వ తేదీ మార్నింగ్ షోలో నవీన్ పోలిశెట్టి 'అనగనగా ఒక రాజు' (Anaganaga Oka Raju), ఫస్ట్ షో కు శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' (Nari Nari Naduma Murari) చిత్రాలు విడుదలయ్యాయి. టాక్ తో సంబంధం లేకుండా 'ది రాజా సాబ్' (The Raja Saab) మంచి కలెక్షన్స్ సాధించింది. అయితే మూవీ బడ్జెట్ కు రాబడికి భారీ తేడా ఉండటంతో ఇది బ్రేకీవెన్ సాధించలేదు. ఆ తర్వాత వచ్చిన 'మన శంకరవరప్రసాద్ గారు' మూవీ ఫ్యామిలీ ఆడియెన్సే కాదు యూత్ ను కూడా బాగా ఆకట్టుకుంది. ఈ యేడాది సంక్రాంతి విన్నర్ గా అది నిలిచింది. దాదాపు నాలుగువందల కోట్ల గ్రాస్ ను సాధించిన ఆ సినిమా ఆల్ టైమ్ రీజనల్ ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'... ఇటీవల కాలంతో వచ్చిన రవితేజ చిత్రాలలో బెటర్ మూవీ అనిపించుకున్నా... దానికి ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాలేదు. నవీన్ పోలిశెట్టి నటించిన 'అనగనగా ఒక రాజు'కు డివైడ్ టాక్ వచ్చి... ఊహకందని ఓపెనింగ్స్ వచ్చాయి. ఆ తర్వాత కూడా మూవీ టీమ్ ప్రమోషనల్ టూర్ చేయడంతో ఆ సినిమా కూడా వంద కోట్ల గ్రాస్ ను అందుకుంది. ఇక ఈ సంక్రాంతికి అసలైన ఆనందాన్ని పొందిన హీరో ఎవరైనా ఉన్నారంటే అది శర్వానంద్. కొన్నేళ్ళుగా సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న శర్వానంద్ నటించిన 'నారీ నారీ నడుమ మురారి' ఊహించని విజయాన్ని అందుకుంది. మొదట్లో ఈ సినిమాకు తగినన్ని ధియేటర్లు దొరకలేదు. కానీ మూవీకి హిట్ టాక్ రావడంతో అన్ని ప్రధాన సెంటర్స్ లో స్క్రీనింగ్స్ పెంచేశారు. ఆ రకంగా శర్వానంద్ కు సంక్రాంతి మరోసారి కలిసొచ్చినట్టు అయ్యింది. టాలీవుడ్ కు భిన్నమైన అనుభవాన్ని ఈసారి కోలీవుడ్ పొందింది. పొంగల్ కు బరిలో దిగాల్సిన విజయ్ సినిమా 'జననాయగన్' (Jana Nayagan) సెన్సార్ సమస్యలతో విడుదల కాలేదు. శివ కార్తికేయన్ 'పరాశక్తి' (Parasakthi) జనవరి 10న విడుదలైన ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. డిసెంబర్ లోనే విడుదల కావాల్సి ఉండి వాయిదా పడిన కార్తి 'వా వాతియార్' సంక్రాంతి కానుకగా 14న విడుదలైంది కానీ ఇదీ ఫ్లాప్ అయ్యింది. 'పరాశక్తి', 'వా వాతియార్' చిత్రాలు తెలుగులో డబ్ అయ్యాయి. కానీ ఇక్కడ వాటిని నిర్మాతలు విడుదల చేయలేకపోయారు.
గత యేడాదిలానే ఈసారి కూడా సంక్రాంతి తర్వాత వారాంతంలో ఏ సినిమా కూడా విడుదల కాలేదు. ఇక జనవరి లాస్ట్ వీకెండ్ లో రెండు అనువాద చిత్రాలతో పాటు ఎనిమిది స్ట్రయిట్ సినిమాలు వచ్చాయి. మలయాళ చిత్రం 'చఠా పచా'ను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ తెలుగులో విడుదల చేసింది కానీ అది ఎలాంటి ప్రభావం చూపించలేదు. చాలామందికి అసలీ సినిమా తెలుగులో వచ్చినట్టే తెలియదు. ఇక మలయాళ చిత్రం 'జయ జయ జయ జయహే' తెలుగులో 'ఓం శాంతి శాంతి శాంతిః' పేరుతో రీమేక్ అయ్యింది. తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన ఈ సినిమా విడుదలకు ముందు కాస్తంత బజ్ క్రియేట్ చేసింది కానీ విజయాన్ని అందుకోలేకపోయింది. అదే వారం వచ్చిన 'జమానా, ధృతరాష్ట్రుడు, ప్రేమకడలి, త్రిముఖ, వన్ బై ఫోర్, జగన్నాథ్, దేవగుడి' అన్ని సినిమాలదీ అదే పరిస్థితి. హిందీ డబ్బింగ్ సైలెంట్ మూవీ 'గాంధీ టాక్స్'లో విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, అదితి రావ్ హైదరీ వంటి వారు చేసిన... దాని వైపు కూడా ఎవరూ దృష్టి సారించలేదు. దాంతో ఈ నెలలో 'మన శంకరవరప్రసాద్ గారు' సినిమానే అగ్రస్థానంలో నిలిచింది.