MSG: ఇంతకీ శంకర వర ప్రసాద్ టీమ్ చేసే పనేంటి

ABN , Publish Date - Jan 03 , 2026 | 03:49 PM

చిరంజీవి హీరోగా నటిస్తున్న 'మన శంకర వర ప్రసాద్ గారు సినిమా  ప్రచారంలో భాగంగా 'వరప్రసాద్‌ టీమ్‌' అంటూ పోస్టర్‌ విడుదల చేసారు మేకర్స్.

మెగాస్టార్  చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా  అనిల్‌ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘మన శంకర వరప్రసాద్‌గారు’ (Mana Shankara Vara Prasad Garu). నయనతార కథానాయిక. వెంకటేశ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.  ప్రచారంలో భాగంగా 'వరప్రసాద్‌ టీమ్‌' అంటూ పోస్టర్‌ విడుదల చేసారు మేకర్స్. ఇందులో హర్షవర్థన్‌, కేథరిన్‌, అభినవ్  గోమఠం తదితరులు చిరంజీవి వెనక నిలబడి ఉన్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ ఆకట్టుకుంటుంది. 


అలాగే ఓవర్సీస్‌లో  ఈ సినిమా  టికెట్‌ బుకింగ్స్‌ ఓపెన్‌ అయ్యాయి. యూఎస్‌లో ఇప్పటికే 5వేలకు పైగా టికెట్లు విక్రయమయ్యాయి. సినిమా విడుదలకు 9 రోజుల సమయం మాత్రమే ఉండటంతో ఏపీ, తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో ప్రచార కార్యక్రమాలు చేయనున్నారు. జనవరి 4న రాజముండ్రిలో మొదలయ్యే ప్రచారం తిరుపతి, నెల్లూరు,  హైదరాబాద్‌, తాడేపల్లిగూడెం, విశాఖ, అనంతపురం, వరంగల్‌, బెంగళూరుల్లో జరగనుంది. వీటిలోని కొన్ని వేదికల్లో చిరంజీవి పాల్గొంటారని తెలిసింది.  తిరుపతిలో ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. దీని రన్‌టైమ్‌ 2 నిమిషాల 30 సెకన్లుగా అనిల్‌ రావిపూడి తెలిపారు.

Updated Date - Jan 03 , 2026 | 04:42 PM