Mamitha Baiju: చిన్న గ్రామం నుంచి రూ.200 కోట్ల క్లబ్ వరకు.. మమితా బైజు జర్నీ
ABN , Publish Date - Sep 06 , 2026 | 08:16 AM
సహజసిద్ధమైన నటన, అమాయకపు చూపులతో భావాలు పలికిస్తూ నేటితరం కలల రాణిగా మారిపోయింది మమితా బైజు.
సహజసిద్ధమైన నటన, అమాయకపు చూపులతో భావాలు పలికిస్తూ నేటితరం కలల రాణిగా మారిపోయింది మమితా బైజు (Mamitha Baiju). కేరళలోని ఒక చిన్న గ్రామంలో మొదలైన ఆమె ప్రయాణం.. ఈ రోజు భారతీయ చిత్ర పరిశ్రమలో ఒక ఏడాదిలో మూడు రూ.200 కోట్ల క్లబ్ సినిమాల్లో నటించిన ఏకైక నటిగా సరికొత్త రికార్డు సృష్టించే వరకు సాగింది. ఇటీవల ఓ చిత్ర ప్రచార కార్యక్రమంలో మమిత తన విజయ ప్రస్థానాన్ని ఇలా పంచుకుంది.
నిజానికి నేను నటిని కావాలని ఎప్పుడూ అనుకోలేదు. కేరళలోని కొట్టాయం జిల్లా కిడంగూర్ గ్రామంలో నా బాల్యం గడిచింది. మా నాన్నగారు డాక్టర్ బైజు కృష్ణన్. నా చిన్నప్పుడు నాన్న క్లినిక్‌కు వచ్చే రోగులు నన్ను ఎంతో ఆప్యాయంగా ‘బేబీ డాక్టర్’ అని పిలిచేవారు. నాన్న దగ్గరకు అనారోగ్యంతో వచ్చి ఆయన వైద్యంతో కోలుకున్నాక కృతజ్ఞతతో ధన్యవాదాలు చెప్పే రోగులను చూసి పెరిగినదాన్ని. అందుకే నాన్న లాగే నేను కూడా పెద్దయ్యాక డాక్టర్ కావాలని, స్టెతస్కోప్ పట్టుకుని రోగులను పరీక్షించాలని కలలు కనేదాన్ని.
ఆటలు... నృత్యం
పాఠశాల రోజుల్లో నా దృష్టంతా క్రీడలపై ఉండేది. బాస్కెట్‌బాల్ ఎంతో ఉత్సాహంగా ఆడేదాన్ని, కానీ ఒక చిన్న గాయం వల్ల క్రీడలకు దూరం కావాల్సి వచ్చింది. నాలోని కళాత్మక కోణానికి నాట్యం ఊపిరిపోసింది. భరతనాట్యం, కూచిపూడి నృత్యాలలో శిక్షణ తీసుకున్నాను. కేరళ రాష్ట్ర స్థాయి కళోత్సవంలో పాల్గొని ఎన్నో బహుమతులు సాధించాను.
తొమ్మిదో తరగతిలో మలుపు
నేను తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడు మా నాన్న స్నేహితుడు ఒకరు ‘సర్వోపరి పాలక్కారన్’ (2017) అనే మలయాళ సినిమా ఆడిషన్స్‌కి వెళ్లమన్నారు. కానీ నాకేమీ నటిని అయిపోవాలన్న ఆశలేదు. అయితే, అసలు సినిమాలు ఎలా తీస్తారోనన్న చిన్న పిల్లలకు ఉండే కుతూహలంతో అక్కడికి వెళ్లాను. వెళ్లాక ఆడిషన్‌లో ఎంపికవడం, షూటింగ్ సెట్లో అడుగుపెట్టడం నా జీవిత దశనే మార్చేసింది. ఇంటర్ పూర్తిచేసి నాన్న కల నెరవేర్చడానికి ‘నీట్’ రాశాను. కానీ సరైన ర్యాంకు రాకపోవడంతో కొచ్చిలోని ‘సేక్రెడ్ హార్ట్’ కాలేజీలో సైకాలజీలో చేరాను.
సైకాలజీ నేర్పిన పరిపక్వత
మానసిక శాస్త్రం చదవడం వల్ల విభిన్న రకాల మనుషుల ప్రవర్తనలను, మనస్తత్వాన్ని లోతుగా అర్థం చేసుకునే పరిపక్వత వచ్చింది. ఏయే సందర్భాల్లో మనుషులు ఎలా స్పందిస్తారు? వారి భావోద్వేగాలు ఎలా ఉంటాయి? అనేవి నటిగా విభిన్న పాత్రలు పోషించేటప్పుడు నాకు ఎంతో ఉపకరించాయి.
తొలి గుర్తింపు
ప్రారంభంలో ‘హనీబీ 2’ ‘డాకిని’, ‘వికృతి’ వంటి చిత్రాల్లో చిన్న పాత్రలు చేసినా, 2019లో వచ్చిన ‘జూన్’ చిత్రంలోని ‘కుంజు’ పాత్రతో నాకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత వచ్చిన ‘ఆపరేషన్ జావా’ (2021) నా కెరీర్‌కు మంచి ఊపునిచ్చింది. అలాగే ‘ఖో ఖో’ అనే స్పోర్ట్స్ సినిమాలో అథ్లెట్‌గా నటించిన నేను ‘44వ కేరళ ఫిల్మ్ క్రిటిక్స్’ అవార్డుల్లో ‘ఉత్తమ సహాయనటి’ అవార్డు అందుకున్నాను. నా శ్రమకు దక్కిన ఆ మొదటి అవార్డు నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది.
‘ప్రేమలు’తో సంచలనం
నా కెరీర్‌ను ఒక్కసారిగా నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లిన సినిమా ‘ప్రేమలు’ (2024). గిరీశ్ ఏడీ దర్శకత్వంలో వచ్చిన ఆ రొమాంటిక్ కామెడీలో నేను పోషించిన ‘రీను’ పాత్ర గ్లోబల్ వండర్‌గా మారింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ ఆ సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు నన్ను తమ సొంత ఇంటి అమ్మాయిలా గుండెల్లో పెట్టుకున్నారు. ఇప్పటికీ ఎయిర్‌పోర్టులోనో, బయటో కనిపిస్తే ‘రీను’ అని పిలుస్తుంటే నా కళ్లు ఆనందంతో చెమరుస్తాయి.

సరిహద్దుల్లేని నటన
ఒక తమిళ చిత్రంలో నటించేటప్పుడు అక్కడి పాత్రకు సరిపోతానా? లేదా? అన్న చర్చలు జరిగినప్పుడు దర్శకుడు విఘ్నేశ్ రాజా నా ఆడిషన్ నమ్మి అవకాశం ఇచ్చారు. విభిన్న భాషల్లోకి అడుగుపెడుతున్నప్పుడు భాషా సరిహద్దులను చెరిపేస్తూ, ఆయా ప్రాంతీయ సంస్కృతిలో ఒదిగిపోవడమే ఒక నటిగా నా బాధ్యత అని భావిస్తాను. తమిళంలో అరంగేట్రం తర్వాత కూడా ‘రెబల్’, ‘కర’ వంటి చిత్రాల ద్వారా మరింత పరిణతి చెందడానికి ప్రయత్నించాను.
సూపర్ స్టార్లతో...
ఆ తర్వాత విజయ్ చివరి చిత్రంగా చెప్పిన ‘జన నాయగన్’లో నటించే అరుదైన అవకాశం దక్కింది. చిన్నప్పటి నుంచి విజయ్ ‘గిల్లి’ సినిమా చూస్తూ ఆయనకు చాలా పెద్ద ఫ్యాన్‌గా పెరిగాను. ‘సూర్య’తో నటించాను కాబట్టి విజయ్ సినిమా ఛాన్స్ రాదేమో అని ఒకప్పుడు అనుకున్నాను. కానీ ‘జన నాయగన్’ సెట్లో ఆయన పక్కన నిలబడినప్పుడు నా కల నిజమైంది. విజయ్ ఎంతో సమయపాలన పాటిస్తారు, చిన్న చిన్న విషయాలను కూడా గుర్తుపెట్టుకుంటారు. ఆయన రోజూ మధ్యాహ్నం సామన్ (సాల్మన్) చేపల వంటకం తింటారని తెలుసుకుని సరదాగా పలకరించేదాన్ని. అలాగే ‘సూర్య 46’ సెట్లో కూడా. సూర్య ప్రతిరోజూ నా కోసం ప్రత్యేకమైన కాఫీ పంపేవారు. ధనుష్ తో ‘కర’ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు ఆయన అద్భుతమైన నటన చూసి షాక్ అయ్యా. నా జీవితంలో మొదటిసారి నా డైలాగ్స్ కూడా మర్చిపోయాను. అంతటి మహామహుల వద్ద పని చేయడం నా భాగ్యం.
అరుదైన మైలురాయి
నేను నటించిన ‘జన నాయగన్’ రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించగా, సూర్యతో చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’, నివిన్ పౌలీతో చేసిన ‘బెత్లెహేమ్ కుటుంబ యూనిట్’ చిత్రాలు రూ. 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. ఒకే ఏడాదిలో రూ. 200 కోట్ల మార్కు దాటిన మూడు చిత్రాల్లో భాగమైన ఏకైక భారతీయ నటిగా రికార్డుల్లో నిలవడం నా కలలకే ఊహకందని విషయం.
నటన నిరంతర సాధన
నన్ను చాలామంది ‘నేషనల్ క్రష్’ అని పిలుస్తుంటే నాకేదో కలలా అనిపిస్తుంది. కానీ నటన అనేది ఒక నిరంతర ప్రయాణం. బేబీ డాక్టర్ కావాలనుకున్న నేను, ఈరోజు వెండితెరపై ఎంతోమంది ముఖాల్లో చిరునవ్వులు పూయించగలుగుతున్నానంటే దానికి కారణం నన్ను నమ్మిన దర్శకులు, నా కుటుంబం, నన్ను గుండెల్లో పెట్టుకున్న అభిమానుల ప్రేమే.
ట్రోల్స్‌పై క్రీడాస్ఫూర్తి
‘జన నాయగన్’ ఆడియో లాంచ్‌లో విజయ్‌పై పాట పాడినప్పుడు సోషల్ మీడియాలో నాపై వచ్చిన ట్రోల్స్ చూసి చాలామంది బాధపడ్డారు. కానీ నేను దాన్ని కేవలం ఒక వినోదంగా మాత్రమే తీసుకున్నాను. జనాలు నవ్వుకోవడానికి ఒక చిన్న సందర్భం దొరికింది, అందులో తప్పేముంది అని తేలిగ్గా తీసుకున్నాను. కళాకారులకు ప్రశంసలతో పాటు విమర్శలు, వినోదాలు సహజమే అని భావిస్తాను. విజయాలు వచ్చినప్పుడు పొంగిపోవడం కానీ, పరాజయాలు పలకరించినప్పుడు కుంగిపోవడం చేయకూడదని అర్థమైంది. జీవితం ఇచ్చే ప్రతి అనుభవాన్ని చిరునవ్వుతో స్వీకరిస్తూ, భాషా సరిహద్దులను చెరిపేస్తూ మరిన్ని మంచి పాత్రలతో మిమ్మల్ని అలరించడమే నా లక్ష్యం.