ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఫౌజీకి ప్రీక్వెల్ కూడా..
ABN , Publish Date - May 01 , 2026 | 07:39 PM
ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ గా జేజేలు అందుకుంటున్నారు ప్రభాస్ (Prabhas). ఆయన సినిమాల కోసం జనం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ యేడాది సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ప్రభాస్ 'ద రాజాసాబ్' ఏ మాత్రం అలరించలేక పోయింది.
ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ గా జేజేలు అందుకుంటున్నారు ప్రభాస్ (Prabhas). ఆయన సినిమాల కోసం జనం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ యేడాది సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ప్రభాస్ 'ద రాజాసాబ్' ఏ మాత్రం అలరించలేక పోయింది. దాంతో ఫ్యాన్స్ చూపులన్నీ ఇప్పుడు ప్రభాస్ తో హను రాఘవపూడి తెరకెక్కిస్తోన్న 'ఫౌజీ (Fauzi)' చిత్రంపైనే ఉన్నాయి. ఈ మూవీ ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకుందని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, టి-సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా 1940ల ప్రాంతంలో బ్రిటీష్ రాజ్ సమయాన జరిగిన కథతో తెరకెక్కుతోంది. ఓ సైనికుడు ఏ తీరున తన దేశం కోసం పోరాడాడు అన్నదే 'ఫౌజీ' ప్రధాన కథాంశం. ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 15న విడుదల చేయబోతున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందా అన్న ప్రశ్నకు 'ప్రీక్వెల్' ఉంటుందని వినిపిస్తోంది. దాంతో ఫ్యాన్స్ లో మరింత ఆసక్తి చోటు చేసుకుంది.
దర్శకుడు హను రాఘవపూడి చిత్రాలను పరిశీలిస్తే సున్నితమైన కథాంశంతో పాటు కట్టిపడేసే యాక్షన్ సీన్స్ కూడా ఉంటాయని తెలుస్తుంది. పైగా ప్రభాస్ లాంటి స్టార్ హీరోతో సినిమా కాబట్టి 'ఫౌజీ'లోనూ అదే తీరు సాగుతోందని సమాచారం. ఈ చిత్రాన్ని 700 కోట్ల రూపాయల వ్యయంతో తెరకెక్కిస్తున్నారు. ఇంత భారీ బడ్జెట్ మూవీలో ప్రభాస్ లుక్ ఎలా ఉంటుందో చూడాలన్న ఆత్రుత కూడా ఫ్యాన్స్ లో నెలకొంది. ఈ సినిమాను చూస్తే హీరోకు సంబంధించిన అంశాలు మరిన్ని తెలుసుకోవాలి అనిపిస్తుందట. అందువల్లే 'ఫౌజీ' ప్రీక్వెల్ కూడా ఉందని మేకర్స్ హింట్ ఇచ్చారు. దాంతో ముందు 'ఫౌజీ'ని చూసేయాలని తరువాత ప్రీక్వెల్ చూడొచ్చని ఫ్యాన్స్ ఉత్సాహంతో ఉన్నారు.
భారీ స్థాయిలో తెరకెక్కుతోన్న 'ఫౌజీ' చిత్రంలో సోషల్ మీడియా సెన్సేషన్ ఇమాన్వీ నాయికగా నటిస్తోంది. ఇక జయప్రద, మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్ ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను త్వరితంగా పూర్తి చేసి అనుకున్న సమయానికి సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. మరి 'ఫౌజీ' ఎప్పుడు జనం ముందు నిలుస్తుందో? తరువాత ఈ మూవీ ప్రీక్వెల్ ఎప్పుడు పట్టాలెక్కుతుందో? తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా ప్రభాస్ కు హను రాఘవపూడి ఓ మెమరబుల్ మూవీగానే 'ఫౌజీ'ని అందిస్తారని ఇన్ సైడ్ టాక్... ఏమవుతుందో చూడాలి.