రాజమౌళి స్టార్స్.. వెంట పడుతున్న సందీప్! మహేశ్‌తో కాంబోపై.. విశేషంగా చర్చ!
ABN , Publish Date - Feb 18 , 2026 | 05:56 PM
ప్రస్తుతం మహేశ్ బాబు - రాజమౌళి 'వారణాసి' వైపే మూవీ లవర్స్ చూపు సాగుతోంది. ఆ సినిమా వచ్చే యేడాది జనం ముందుకు రానుంది. ఆ తరువాత మహేశ్ బాబు నెక్ట్స్ ఏంటి అనేదానిపైనా చర్చ సాగుతోంది. మహేశ్ తరువాతి సినిమాగా ఓ మేవరిక్ డైరెక్టర్ ప్రాజెక్ట్ ఉంటుందని టాక్... మరి అదేంటో?
మహేశ్ బాబు (Mahesh Babu) హీరోగా రాజమౌళి (Rajamouli) తెరకెక్కిస్తోన్న 'వారణాసి' (Varanasi) 2027 ఏప్రిల్ 7న రిలీజ్ కానుంది. అంటే ఇంకా సంవత్సరం పైగా ఉంది. ఈ సినిమా ప్రస్తుతం జార్జియాలో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ యేడాది డిసెంబర్ లోగా 'వారణాసి' షూటింగ్ పార్ట్ పూర్తవుతుందని తెలుస్తోంది. తరువాత ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ తో సాగుతుంది. మరి మహేశ్ బాబు తరువాత ఏ సినిమాలో నటించడానికి అంగీకరించారు అన్న అంశంపై ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ సైతం చర్చించుకుంటున్నారు. మహేశ్ తో సినిమా రూపొందించడానికి తెలుగు దర్శకులతో పాటు పలువురు పరభాషా డైరెక్టర్స్ సైతం ఆసక్తిగా ఉన్నారు. అయితే మహేశ్ మాత్రం మన తెలుగు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఓ వార్త విశేషంగా వినిపిస్తోంది. సందీప్ తెలుగువారైనా బాలీవుడ్ లోనూ తన సత్తా చాటుకుంటున్నారు. ప్రస్తుతం ప్రభాస్ (Prabhas) హీరోగా సందీప్ రెడ్డి 'స్పిరిట్' అనే మూవీని రూపొందిస్తున్నారు. ఆ సినిమా కూడా వచ్చే యేడాది వెలుగు చూడనుంది. ఈ నేపథ్యంలో ఇటు మహేశ్, అటు సందీప్ ఇద్దరూ ఫ్రీ అవుతారు కాబట్టి వారి కాంబినేషన్ లోనే సినిమా ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు. మహేశ్ తో సందీప్ సినిమా అనగానే ఫ్యాన్స్ లోనూ అమితాసక్తి కలుగుతోంది.
నిస్సందేహంగా 'వారణాసి' సినిమా తరువాత మహేశ్ బాబు ఇమేజ్ ఇంటర్నేషనల్ లెవెల్ కు చేరుతుందని ట్రేడ్ టాక్. అందువల్ల మహేశ్ తో సందీప్ తీయబోయే సినిమా ఎలా ఉంటుందనే అంశంపై అభిమానులు తమలో తాము పలు విధాలా ఊహించుకుంటున్నారు. మహేశ్ బాబు ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొనే సందీప్ తనదైన స్టైల్ లో సినిమా తెరకెక్కిస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే మహేశ్ లాంటి సూపర్ స్టార్ పై సందీప్ తన రెగ్యులర్ ఫార్ములాలో లాగా డార్క్ కంటెంట్ చొప్పిస్తే హీరో ఇమేజ్ కు దెబ్బ పడుతుందని కొందరి భావన. ఆ కంటెంట్ ను కూడా మహేశ్ స్టేచర్ కు తగ్గట్టుగానే తెరకెక్కిస్తారు సందీప్ అని మరికొందరి అభిప్రాయం. ఏది ఏమైనా మహేశ్ తో మాత్రం సందీప్ రెడ్డి రెగ్యులర్ ఫార్మాట్ మూవీ తీయడని, అందులో కొత్తదనం తప్పనిసరిగా ఉంటుందనీ చాలామంది ఆశిస్తున్నారు.
రాజమౌళి 'బాహుబలి' సిరీస్ తోనే ప్రభాస్ కు ఇంటర్నేషనల్ స్టార్ గా గుర్తింపు లభించింది. ఇప్పుడు మహేశ్ బాబుతో రాజమౌళి 'వారణాసి' చిత్రాన్ని అంతర్జాతీయ విలువలతోనే తెరకెక్కిస్తున్నారు. రాజమౌళి క్రేజ్ సంపాదించి పెట్టిన స్టార్స్ వైపే చాలామంది దర్శకుల చూపు సాగుతుంది. అందులో ఆశ్చర్యపడాల్సిన అవసరమేమీలేదు. అయితే సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం ప్రభాస్ తో 'స్పిరిట్' రూపొందిస్తున్నారు. ఇది కాగానే మహేశ్ బాబుతోనే సాగితే, ఆయన రాజమౌళి క్రేజ్ సంపాదించి పెట్టిన హీరోల వెంటే పరిగెట్టినట్టు అవుతుంది కదా !. ప్రభాస్ అయినా 'బాహుబలి' సిరీస్ తరువాత ఆరు సినిమాల్లో నటించాకే సందీప్ రెడ్డి డైరెక్షన్ లో నటిస్తున్నారు. మహేశ్ అలా కాకుండా రాజమౌళి సినిమా కాగానే సందీప్ ప్రాజెక్ట్ లో ఎంట్రీ ఇస్తే అది కూడా ఓ అరుదైన అంశమవుతుందని ఫ్యాన్స్ మాట!. మరి ఈ మూవీ ఎప్పుడు పట్టాలెక్కనుంది? ఈ ప్రశ్నకు మహేశ్ ఫ్యాన్స్ లో అధిక సంఖ్యాకులు 2027 లో హీరో బర్త్ డే ఆగస్టు 9న షూటింగ్ మొదలవుతుందని అంటున్నారు. అదే నిజమైతే రాబోయే సంవత్సరం మహేశ్ ఫ్యాన్స్ కు ఓ స్పెషల్ అనే చెప్పాలి.