బాబాయ్ డెబ్యూ డేట్ పట్టిన అబ్బాయ్.. కలిసొచ్చేనా
ABN , Publish Date - Jul 03 , 2026 | 07:15 PM
ఇండస్ట్రీలో ఇప్పటికే బాబాయ్ - అబ్బాయ్ లు చాలామంది ఉన్నారు. పవన్ కళ్యాణ్ - రామ్ చరణ్, బాలకృష్ణ - ఎన్టీఆర్, వెంకటేష్- రానా.. ఇలా అన్న కొడుకులు హీరోలుగా మారడం. వారికి ఈ బాబాయ్ లు సపోర్ట్ గా నిలవడం చూస్తూనే ఉన్నాం.
ఇండస్ట్రీలో ఇప్పటికే బాబాయ్ - అబ్బాయ్ లు చాలామంది ఉన్నారు. పవన్ కళ్యాణ్ - రామ్ చరణ్, బాలకృష్ణ - ఎన్టీఆర్, వెంకటేష్- రానా.. ఇలా అన్న కొడుకులు హీరోలుగా మారడం. వారికి ఈ బాబాయ్ లు సపోర్ట్ గా నిలవడం చూస్తూనే ఉన్నాం. ఇక తాజాగా ఇండస్ట్రీలో మరో బాబాయ్- అబ్బాయ్ వచ్చారు. వారే మహేష్ బాబు (Mahesh Babu) - జయకృష్ణ (Jayakrishna). మహేష్ అన్న రమేష్ కొడుకే జయకృష్ణ. అతను శ్రీనివాస మంగాపురం (Srinivasa Mangapuram)సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న విషయం తెల్సిందే. ఆరెక్స్ 100, మంగళవారం చిత్రాల ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఈ సినిమా అన్నీ బావుండి ఉంటే జులై 9 న ప్రేక్షకుల ముందుకు వచ్చేది. కానీ, కొన్ని కారణాల వలన ఈ సినిమా వాయిదా పడింది. తాజాగా మేకర్స్ శ్రీనివాస మంగాపురం జులై 30 న రిలీజ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు ఈ డేట్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. దానికి కారణం.. అబ్బాయ్ డెబ్యూ సినిమా రిలీజ్ డేట్.. బాబాయ్ డెబ్యూ సినిమా రిలీజ్ డేట్ ఒకటే కావడం.
మహేష్ బాబు.. బాలనటుడిగా కెరీర్ ని ప్రారంభించి రాజకుమారుడు అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఈ చిత్రంలో మహేష్ సరసన బాలీవుడ్ బ్యూటీ ప్రీతిజింటా నటించింది. ఈ సినిమా 1999 జూలై 30వ తేదీన రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. సరిగ్గా 27 ఏళ్ల తరువాత ఇదే డేట్ న శ్రీనివాస మంగాపురం రిలీజ్ అవుతోంది. ఇది యాదృచ్చికం అనడం కన్నా.. జయకృష్ణ లక్ అని చెప్పొచ్చు. బాబాయ్ కి కలిసివచ్చిన రోజునే అబ్బాయ్ కూడా వస్తున్నాడు అంటే.. సగం హిట్ అయ్యినట్టే అని ఘట్టమనేని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు.
కేవలం డేట్ ఒక్కటే యాదృచ్చికం కాదు. అప్పుడు రాజకుమారుడు సినిమాను నిర్మించిన అశ్వనీదత్ నే.. ఇప్పుడు శ్రీనివాస మంగాపురం సినిమాను సమర్పిస్తున్నారు. అంతేనా.. అప్పుడు బాబాయ్ పక్కన బాలీవుడ్ భామ ప్రీతి జింటా నటించింది. ఇప్పుడు అబ్బాయ్ పక్కన బాలీవుడ్ భామ రాషా తడానీ నటించింది. ఇలా ప్రతిదీ జయకృష్ణకు సెంటిమెంట్ గా మారింది. మరి ఈ డేట్ తో బాబాయ్ లక్.. కొంచెమైనా అబ్బాయ్ కి వస్తుందేమో చూడాలి.