Varanasi: రాజమౌళి 'వారణాసి'కి.. కొత్త చిక్కులు?

ABN , Publish Date - Oct 18 , 2026 | 02:34 PM

రాజ‌మౌళి, మ‌హేశ్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న వారణాసి సినిమా విడుదల తేదీపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Varanasi

ఇండియన్‌ సినిమా చరిత్రలోనే మోస్ట్‌ ప్రెస్టీజియస్‌ ప్రాజెక్ట్‌లో వారణాసి (Varanasi) సినిమా ముందు వరుసలో ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. గ్లోబల్ లెవెల్‌లో తెలుగు సినిమా ఖ్యాతిని నిలబెట్టిన ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కలయికలో వస్తున్న వారణాసి ఎప్పుడైతే మొదలైందో, అప్పటి నుంచే ప్రపంచవ్యాప్తంగా మూవీ లవర్స్‌లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి.

ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) లాంటి అంతర్జాతీయ, పాన్-ఇండియా స్టార్స్ ఇందులో భాగం కావడంతో ఈ సినిమాపై మరింత హైప్ పెరిగింది. కానీ. ప్రస్తుతం ఫిలిం నగర్ సర్కిల్స్‌తో పాటు సోషల్ మీడియా వేదికగా ఈ ప్రాజెక్ట్ చుట్టూ కొన్ని సంచలన చర్చలు నడుస్తున్నాయి. వారణాసి సినిమా అనుకున్న టైంకి రాకపోవచ్చనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

మొదటినుంచీ వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని 2027 ఏప్రిల్ 7న ఉగాది పండుగ కానుకగా గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ తాజా ఇండస్ట్రీ టాక్ ప్రకారం చూస్తే, ఆ డేట్‌కు సినిమా రావడం దాదాపు అసాధ్యమనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. రాజమౌళి పనితీరు ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన పర్ఫెక్షన్ కోసం ఎంతటి సమయాన్నైనా వెచ్చిస్తారు. ప్రస్తుతానికి షూటింగ్‌ దాదాపు పూర్తయినా, విఎఫ్ఎక్స్ , పోస్ట్-ప్రొడక్షన్ పనులకు భారీగా సమయం పట్టే అవకాశం ఉంది.

ఇప్పటివరకు రిలీజ్ డేట్ వాయిదాపై చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికీ, లోపల జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే సినిమా విడుదల మరింత ఆలస్యం కావచ్చనే ప్రచారం జోరందుకుంది. మరో ఆసక్తికరమైన అంశం. సినిమా మార్కెటింగ్ స్ట్రాటజీ. ‘వారణాసి’ చిత్రాన్ని కేవలం భారతదేశానికే పరిమితం చేయకుండా. అమెరికా, బ్రెజిల్, ఫ్రాన్స్, మెక్సికో లాంటి మార్కెట్లలో భారీ స్థాయిలో విడుదల చేసి, సరికొత్త రికార్డులు సృష్టించాలని మేకర్స్ భావిస్తున్నారు.

‘ఆర్ఆర్ఆర్’ సాధించిన అద్భుతమైన విజయం తర్వాత, రాజమౌళి తర్వాతి ప్రాజెక్ట్‌పై పశ్చిమ దేశాల్లో విశేషమైన క్రేజ్ ఉంటుందని అందరూ అంచనా వేశారు. అయితే ప్రస్తుతానికి అంతర్జాతీయ మార్కెట్లలో ఆశించిన స్థాయిలో చర్చ గానీ, ఆ స్థాయి ఎగ్జైట్‌మెంట్ గానీ ఇంకా కనిపించడం లేదన్నది వాస్తవం. సరైన కంటెంట్ డ్రాప్స్, టీజర్లు లేదా ఇంటర్నేషనల్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లు ఇంకా మొదలుకాకపోవడమే ఇందుకు ప్రధాన కారణం కావచ్చు.

అంతేకాదు, గ్లోబల్ రీచ్‌పైనే ఎక్కువ దృష్టి పెట్టే క్రమంలో లోకల్ ప్రమోషన్లు కాస్త నెమ్మదించాయనే టాక్ కూడా సినీ వర్గాల్లో వినిపిస్తోంది. ఎంత అంతర్జాతీయ సినిమా అయినా, ఏ పాన్-వరల్డ్ ప్రాజెక్ట్‌కైనా పునాది స్వదేశీ మార్కెట్టే. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం ఈ సినిమా సేఫ్ జోన్‌లోకి వెళ్లాలంటే దాదాపు 2,000 కోట్ల భారీ బ్రేక్-ఈవెన్ టార్గెట్‌ను అందుకోవాల్సి ఉంటుందని అంచనా.

అంతటి భారీ మైలురాయిని చేరాలంటే ముందుగా మన దేశంలోని అన్ని భాషల ప్రేక్షకుల నుంచి తిరుగులేని ఆదరణ లభించాలి. లోకల్ ఫ్యాన్స్, ట్రేడ్ వర్గాల్లో పాజిటివ్ బజ్ ఉంటేనే గ్లోబల్ మార్కెట్‌లోనూ ఆ వేవ్ కొనసాగుతుంది. ఏదేమైనా, సినిమా ప్రమోషన్ల విషయంలో జక్కన్న వ్యూహాలు ఎప్పుడూ ఊహకందని విధంగా ఉంటాయి. సరైన సమయం చూసి ఒక్క వీడియో గ్లింప్స్ లేదా ఫస్ట్ లుక్ వదిలితే చాలు... ప్రపంచవ్యాప్తంగా రికార్డుల లెక్కలు తారుమారవ్వడం ఖాయం. రాబోయే రోజుల్లో మేకర్స్ ఎలాంటి వ్యూహాలతో రంగంలోకి దిగుతారో వేచి చూడాల్సిందే.

Updated Date - Oct 18 , 2026 | 04:08 PM