‘వారణాసి’ కళ్లు చెదిరే బిజినెస్.. తెలుగు రాష్ట్రాల హక్కులు ఎన్ని కోట్లంటే?

ABN , Publish Date - Nov 10 , 2026 | 03:11 PM

మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న ‘వారణాసి’ సినిమాపై బిజినెస్ పరంగా భారీ చర్చ నడుస్తోంది.

Varanasi

భారతీయ సినిమా చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రాల్లో ‘వారణాసి’ (Varanasi) ఒకటి. తెలుగు సినిమా స్థాయిని ఆస్కార్ వేదిక వరకు తీసుకెళ్లిన దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (Rajamouli), టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) తొలిసారి కలిసి పనిచేస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ మీద ప్రపంచవ్యాప్తంగా అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. కేఎల్ నారాయణ, ఎస్.ఎస్. కార్తీకేయ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా.. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ‘వారణాసి’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ప్రతి చిన్న వార్తా సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతోంది. తాజాగా టాలీవుడ్ వర్గాల్లో ఓ సంచలన వార్త హాట్ టాపిక్‌గా మారింది. అదేంటంటే.. ఈ సినిమా ఏపీ, తెలంగాణ థియేట్రికల్ హక్కులకు (AP Telangana Rights) సంబంధించి ఒక భారీ డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) తెలుగు రాష్ట్రాల హక్కుల కోసం ఏకంగా రూ. 290 కోట్లు చెల్లించినట్లు సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ ఒప్పందానికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ, ఈ వార్త నిజమైతే మాత్రం టాలీవుడ్ బాక్సాఫీస్ హిస్టరీలోనే ఇదొక సరికొత్త ఆల్-టైమ్ రికార్డ్ అవుతుంది.

ఇప్పటివరకు టాలీవుడ్ చరిత్రలో తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన రికార్డు రాజమౌళి గత చిత్రం 'ఆర్ఆర్ఆర్' పేరు మీద ఉంది. ఆ సినిమా థియేట్రికల్ రైట్స్ సుమారు రూ. 225 కోట్లు పలికాయి. ఇప్పుడు ఆ రికార్డును 'వారణాసి' సులువుగా దాటేసింది. అయితే ఈ రేసులో మైత్రీ మూవీ మేకర్స్‌తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థలు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ కూడా తీవ్రంగా పోటీ పడ్డాయని.. చివరికి మైత్రీ సంస్థే ఈ భారీ హక్కులను దక్కించుకుందని సమాచారం.

అయితే, రూ. 290 కోట్లు వెచ్చించి హక్కులు సొంతం చేసుకోవడం ఒకెత్తైతే.. అసలైన సవాలు సినిమా థియేటర్లలోకి వచ్చినప్పుడే మొదలవుతుందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. ఇంత భారీ మొత్తానికి బిజినెస్ జరిగితే.. బాక్సాఫీస్ వద్ద సినిమా బ్రేక్-ఈవెన్ సాధించాలంటే, కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే దాదాపు రూ. 500 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్, పాన్-వరల్డ్ అప్పీల్ దృష్ట్యా ఇది సాధ్యమే అయినప్పటికీ, టార్గెట్ మాత్రం చాలా పెద్దదే అని చెప్పాలి. అంతర్జాతీయ స్థాయి కథాంశం, భారీ తారాగణంతో సరికొత్త విజువల్ వండర్‌గా రాబోతున్న 'వారణాసి' సినిమాపై ఉన్న అంచనాలు సాధారణమైనవి కావు. మరి ఈ భారీ పెట్టుబడి మైత్రీ మూవీ మేకర్స్‌కు కాసుల వర్షం కురిపించి సరికొత్త చరిత్ర సృష్టిస్తుందా? లేక టాలీవుడ్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన రిస్క్‌గా మారుతుందా? అనేది వేచి చూడాలి.

Updated Date - Nov 10 , 2026 | 03:13 PM