Varanasi: జక్కన్న.. నీ ఫ్లానింగ్ను కొట్టేవాడేలేడు పో!
ABN , Publish Date - Nov 12 , 2026 | 05:56 PM
మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న వారణాసి సినిమా ఓటీటీ హక్కులు రూ.400-500 కోట్లకు అమ్ముడైనట్లు ప్రచారం జరుగుతోంది. నెట్‌ఫ్లిక్స్ భారీ డీల్‌పై ఆసక్తికర చర్చ నడుస్తోంది.
భారతీయ సినీ చరిత్రలో ఇప్పటివరకు ఎన్నో రికార్డులు చూశాం.. ఎన్నో బాక్సాఫీస్ సునామీలను చూశాం. అయితే ఇప్పుడు యావత్ ప్రపంచం ఎదురుచూస్తున్న ఒకే ఒక్క సినిమా.. సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) , గ్లోబల్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) కాంబినేషన్లో రాబోతున్న వారణాసి (Varnasi). బాహుబలితో తెలుగు సినిమా స్థాయిని పెంచిన జక్కన్న, RRRతో ఏకంగా ఆస్కార్ వేదికపై మన సత్తా చాటారు. అలాంటి దర్శకుడి నుంచి సూపర్ స్టార్‌తో ఒక గ్లోబల్ అడ్వెంచర్ థ్రిల్లర్ వస్తోందంటే అంచనాలు ఏ రేంజ్లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ గురించి ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లోనే కాకుండా, గ్లోబల్ మీడియాలోనూ ఒక సెన్సేషనల్ న్యూస్ చెక్కర్లు కొడుతోంది. రిలీజ్‌కు ముందే ఈ సినిమా ఒక ఊహకందని బిజినెస్ రికార్డ్ సృష్టించిందట.
చాలా కాలంగా సైలెంట్‌గా, పక్కా ప్లానింగ్‌తో జరుగుతున్న వారణాసి సినిమా షూటింగ్ ఇప్పుడు దాదాపు ముగింపు దశకు చేరుకుందనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. రాజమౌళి సినిమాలంటే సాధారణంగా ఏళ్ల తరబడి షూటింగ్స్ జరుగుతుంటాయి. కానీ ఈ ప్రాజెక్ట్ విషయంలో పక్కా ప్రీ-ప్రొడక్షన్‌తో వేగంగా వర్క్ పూర్తి చేసినట్లు టాక్. ఇక షూటింగ్ చివరి దశకు రావడంతో, మరోవైపు బిజినెస్ లెక్కలు కూడా ఒక్కసారిగా హీటెక్కాయి. సాధారణంగా ఏ సినిమాకైనా థియేట్రికల్ రైట్స్ భారీగా పలుకుతాయి. కానీ ‘వారణాసి’ విషయంలో నాన్-థియేట్రికల్ రైట్స్, ముఖ్యంగా డిజిటల్ రైట్స్ సరికొత్త బెంచ్‌మార్క్ సెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే తెలుగు రాష్ట్రాల థియెట్రికల్ రైట్స్‌ను మైత్రీ మూవీ మేకర్స్ 290 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసిందని టాక్. అంతేకాక ఇప్పటి వరకు టాలీవుడ్ లోనే అత్యధిక థియెట్రికల్ రేటు పలికిన చిత్రం కూడా వారణాసి కావడం మరో విశేషం. ఇక RRR సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయ్యాక ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో చూశాం. హాలీవుడ్ ప్రముఖులు, గ్లోబల్ ఆడియన్స్ రాజమౌళి టేకింగ్‌కు సలాం కొట్టారు. ఆ సక్సెస్‌తో నెట్‌ఫ్లిక్స్ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన వ్యూయర్షిప్ దక్కింది. అందుకే రాజమౌళి తర్వాతి ప్రాజెక్ట్‌ను ఏమాత్రం మిస్ చేసుకోకూడదని నెట్‌ఫ్లిక్స్ గట్టిగా ఫిక్స్ అయినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ క్రమంలోనే వారణాసి ఓటీటీ (OTT) డిజిటల్ రైట్స్ కోసం నెట్‌ఫ్లిక్స్ (Netflix) కళ్ళు చెదిరే ఆఫర్ ఇచ్చిందనే ప్రచారం ఊపందుకుంది. కేవలం సినిమా ఒక్కటే కాదు.. రాజమౌళి మేకింగ్ స్టైల్, ఈ సినిమా ప్రయాణం వెనుక ఉన్న విజువల్స్, అన్ సీన్ ఫుటేజ్, ఒక స్పెషల్ డాక్యుమెంటరీ కంటెంట్‌తో కలిపి ప్యాకేజ్ డీల్ కుదుర్చుకున్నట్లు టాక్ నడుస్తోంది. ఇక అందరినీ షాక్‌కు గురిచేస్తున్న అంశం.. ఆ డీల్ వాల్యూ. సోషల్ మీడియా సమాచారం ప్రకారం.. ఈ సినిమా ఓటీటీ రైట్స్ ఏకంగా 400 నుంచి 500 కోట్ల రూపాయల మధ్య అమ్ముడయ్యాయనే నంబర్లు వైరల్ అవుతున్నాయి.
భారతీయ సినీ చరిత్రలోనే ఒకే ఒక్క సినిమా డిజిటల్ రైట్స్‌కు ఇంత భారీ మొత్తం పలకడం బహుశా ఇదే మొదటిసారి కావచ్చు. గ్లోబల్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ బహుళ అంతర్జాతీయ భాషల్లో ఈ సినిమాను స్ట్రీమింగ్ చేసేలా ఒప్పందం కుదిరిందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, మేకర్స్ నుంచి లేదా నెట్‌ఫ్లిక్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు ఇది కేవలం ఒక క్రేజీ రూమర్‌గానే చూడాలి. ఏది ఏమైనా రిలీజ్‌కు ముందే ఇన్ని వండర్స్ క్రియేట్ చేస్తున్న వారణాసి రిలీజ్ తరువాత ఎన్ని సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి.