మహేష్.. మాములోడు కాదుగా దిగ్గ‌జాల‌ను లైన్‌లో పెట్టాడు! ఫ్యాన్స్‌కు ఇక జాత‌రే

ABN , Publish Date - Apr 28 , 2026 | 03:16 PM

వార‌ణాసి కోసం మూడేండ్ల సుదీర్ఘ కాలం కేటాయించిన మహేష్ బాబు, ఆ తర్వాత ఏమాత్రం విరామం తీసుకోకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

Mahesh Babu

దర్శకధీరుడు రాజమౌళి (S. S. Rajamouli) దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) నటిస్తున్న గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం వారణాసి (Varanasi). ఇది కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, భారతీయ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే మూవీగా ఇప్పటికే సంచ‌ల‌నాలు సృష్టిస్తోంది. ఇందులో మహేష్ బాబు 'రుద్ర' అనే పాత్రలో, కాలంలో ప్రయాణం చేసే అడ్వెంచరర్‌గా కనిపించబోతున్నారని సమాచారం. రాజమౌళి మార్క్ విజువల్స్, మహేష్ మేకోవర్ ఈ సినిమాను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ చిత్రంలో మహేష్ సరసన గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా 'మందాకిని' అనే కీలక పాత్రలో నటిస్తుండగా, మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ 'కుంభ' అనే పవర్‌ఫుల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. సుమారు 1,200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతున్న ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 7, 2027న గ్రాండ్‌గా విడుదల కానుంది. చిత్ర బృందం ఇప్పటికే మెక్సికో వంటి అంతర్జాతీయ వేదికలపై సినిమా గ్లింప్స్‌ను ప్రదర్శించి గ్లోబల్ మార్కెట్‌పై కన్నేసింది.

అయితే రాజమౌళి సినిమా కోసం సుదీర్ఘ కాలం కేటాయించిన మహేష్ బాబు, ఆ తర్వాత మాత్రం ఏమాత్రం విరామం తీసుకోకూడదని నిర్ణయించుకున్నారట. 'వారణాసి' విడుదలైన తదుపరి మూడేళ్లలో కనీసం మూడు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఆయన లక్ష్యంగా పెట్టకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే కొన్ని అగ్ర నిర్మాణ సంస్థలతో చర్చలు ముగిశాయని టాక్. రాజమౌళి సినిమా షూటింగ్ పూర్తి కాగానే, ఏమాత్రం గ్యాప్ లేకుండా మహేష్ తన తదుపరి ప్రాజెక్టును పట్టాలెక్కించేలా షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటున్నారట.


ఫిల్మ్ నగర్ సమాచారం ప్రకారం, మహేష్ బాబు తన తదుపరి చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ (mythri movie makers) బ్యానర్‌పై చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే అడ్వాన్స్ కూడా చేతులు మారిందని, ఇది ఒక భారీ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోందని టాక్. అయితే ఈ చిత్రానికి దర్శకత్వం వహించేది ఎవరనేది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. 'వారణాసి'తో గ్లోబల్ ఇమేజ్ రాబోతుండటంతో, ఈ సినిమాను కూడా అదే స్థాయిలో పాన్-ఇండియా మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని రూపొందించనున్నారట.

మైత్రీ మూవీ మేకర్స్‌తో పాటు, మహేష్ లైనప్‌లో మరికొందరు క్రేజీ దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో డెవిల్ (Devil) అనే టైటిల్‌తో ఒక సినిమా రాబోతోందని ప్రచారం జరుగుతోంది. అలాగే గతంలో '1: నేనొక్కడినే' వంటి ప్రయోగాత్మక సినిమా ఇచ్చిన సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేసే అవకాశం ఉంది. ఈ ఇద్దరు దర్శకులతో ఇప్పటికే చర్చలు జరిగాయని, కథలు ఓకే అయితే మహేష్ బ్యాక్-టు-బ్యాక్ ఈ భారీ ప్రాజెక్టులతో తన ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ అందించనున్నారు.

Updated Date - Apr 28 , 2026 | 03:16 PM