Mahesh Babu: వారణాసి కోసం.. మహేష్ త్యాగాలు
ABN , Publish Date - Feb 05 , 2026 | 05:28 PM
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ అంటేనే ఒక ప్రభంజనం. వీరిద్దరి కలయికలో వస్తున్న వారణాసి చిత్రం ఇప్పుడు గ్లోబల్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), దర్శకధీరుడు రాజమౌళి( SS Rajamouli) కాంబినేషన్ అంటేనే ఒక ప్రభంజనం. వీరిద్దరి కలయికలో వస్తున్న వారణాసి (Varanasi) చిత్రం ఇప్పుడు గ్లోబల్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. గతేడాది విడుదలైన 'రుద్ర' లుక్ గ్లింప్స్ చూశాక అభిమానుల అంచనాలు ఆకాశాన్ని తాకాయి. వారణాసి ఘాట్ల నుంచి అంటార్కిటికా మంచు ఖండాల వరకు, ఆఫ్రికా అడవుల నుంచి త్రేతాయుగ కాలం వరకు.. ఈ సినిమా ఒక అద్భుత దృశ్య కావ్యంలా ఉండబోతోంది. అయితే ఈ అద్భుతం వెనుక మహేష్ బాబు చేసిన కృషి, పడ్డ కష్టం సామాన్యమైనది కాదు.
గుంటూరు కారం సినిమా వచ్చి అప్పుడే రెండేళ్లు గడిచిపోయింది. సాధారణంగా ఏడాదికి ఒక సినిమా చేసే మహేష్, ఈ ప్రాజెక్ట్ కోసం తన కెరీర్ లోనే అత్యధిక సమయాన్ని కేటాయించారు. కేవలం మేకోవర్ కోసమే ఏడాది పాటు జిమ్ లో శ్రమించారు. రాజమౌళి ఊహించిన రుద్ర పాత్రకు ప్రాణం పోయడానికి తన శరీర ఆకృతిని పూర్తిగా మార్చేశారు. ఈ సినిమా కోసం మహేష్ ప్రత్యేకంగా కలరిపయట్టు అనే యుద్ధ విద్యను నేర్చుకున్నారు. సుమారు ఆరు నెలల పాటు కఠినమైన శిక్షణ తీసుకుని, ఆ విద్యలో ప్రావీణ్యం సంపాదించారు. ఇక మహేష్ బాబు రన్నింగ్ స్టైల్ కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. కానీ, రాజమౌళి మాత్రం ఈ సినిమా కోసం ఆ స్టైల్ ను కూడా మార్చాలని పట్టుబట్టారట. దర్శకుడి విజన్ కోసం మహేష్ తన సిగ్నేచర్ స్టైల్ ను సైతం పక్కన పెట్టి కొత్తగా ప్రయత్నించారు. ఇక డాన్స్ విషయానికి వస్తే, ప్రియాంక చోప్రా ఈ సినిమాలో మందాకిని పాత్రలో నటిస్తోంది. చాలా కాలం తర్వాత ఇండియన్ స్క్రీన్ పై కనిపిస్తుండటంతో, తన కోరిక మేరకు రాజమౌళి ఒక హెవీ డాన్స్ నంబర్ ప్లాన్ చేశారు. ప్రియాంక గ్రేస్ కు తగ్గట్టుగా స్టెప్పులు వేయడం కోసం మహేష్ రాత్రింబవళ్లు ప్రాక్టీస్ చేశారట. రాజమౌళి ఇచ్చే టాస్క్ లు ఎంత కఠినంగా ఉంటాయో మనకు తెలిసిందే, వాటన్నింటినీ మహేష్ చిరునవ్వుతో అధిగమించారు.
ఒక టాప్ హీరో తన కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు మూడు ఏళ్ళ కాలాన్ని ఒకే సినిమాకు అంకితం చేయడం అంటే అది మామూలు విషయం కాదు. కమర్షియల్ లెక్కలు చూసుకోకుండా, కేవలం సినిమాపై ఉన్న ప్యాషన్ తో మహేష్ ఈ సాహసం చేస్తున్నారు. కుంభ పాత్రలో పృద్వీరాజ్ సుకుమారన్ తో తలపడే సన్నివేశాలు సినిమాకే హైలైట్ గా నిలవనున్నాయి. ఉగ్రబత్తి కేవ్స్ లో చిత్రీకరించిన యాక్షన్ సీక్వెన్స్ లు ఆడియన్స్ కు వెన్నులో వణుకు పుట్టించడం ఖాయం. ప్రాంతీయ స్టార్ గా ఉన్న మహేష్ బాబుని గ్లోబల్ ఐకాన్ గా మార్చడమే లక్ష్యంగా రాజమౌళి ఈ చెక్కుడును కొనసాగిస్తున్నారు. మహేష్ పడ్డ ఈ కష్టం, చేసిన త్యాగం రేపు వెండితెరపై ఒక చరిత్రను సృష్టించబోతోంది. అందరూ అనుకున్నట్లుగా ఈ సినిమాను రెండు భాగాలుగా కాకుండా ఒకే పార్టుగా తెరకెక్కించబోతున్నాడు రాజమౌళి. మూడు గంటలకు పైగా నిడివి ఉండే ఈ సినిమాలో ప్రతి సీన్ ఆడియెన్స్ ను కట్టిపడేస్తుందని మేకర్స్ భావిస్తున్నారు.