మహేశ్‌ బాబాయ్‌కి.. ‘శ్రీనివాస మంగాపురం’ చాలా నచ్చింది

ABN , Publish Date - Jul 26 , 2026 | 08:48 AM

‘మహేశ్‌ బాబాయ్‌ ‘శ్రీనివాస మంగాపురం’ సినిమా చూశారు. ఆయనకు చాలా నచ్చిందని సూపర్‌ స్టార్‌ కృష్ణ మనవడు జయ‌కృష్ణ ఘట్టమనేని అన్నారు.

Jayakrishna

‘మహేశ్‌ బాబాయ్‌ ‘శ్రీనివాస మంగాపురం’ (Srinivasa Mangapuram) సినిమా చూశారు. ఆయనకు చాలా నచ్చిందని మెసేజ్‌ చేశారు. పోరాట సన్నివేశాలు, పాటలు చాలా బాగున్నాయని, తెరపై నేను కొత్తగా కనిపించానని మెచ్చుకున్నారు’ అని అన్నారు సూపర్‌ స్టార్‌ కృష్ణ మనవడు, మహేశ్‌ బాబు అన్న కుమారుడు జయ‌కృష్ణ ఘట్టమనేని (Jayakrishna). ఆయన హీరోగా, రాషా తడానీ (Rasha Thadani) హీరోయిన్‌గా అజయ్‌ భూపతి (Ajay Bhupathi) తెరకెక్కించిన చిత్రమిది. అశ్వినీదత్‌ సమర్పణలో పి.కిరణ్‌ నిర్మించారు. సినిమా ఈనెల 30వ తేదీన విడుదలవుతోంది. ఈ సందర్భంగా జై కృష్ణ మీడియాతో ముచ్చటించారు.

నాకు చిన్నప్పటి నుంచీ సినిమాలంటే చాలా ఇష్టం. నటుడిని కావాలని నా 16వ ఏటనే నిర్ణయించుకున్నాను. శిక్షణలో భాగంగా రెండేళ్లు ముంబై, ఆ తర్వాత పాండిచ్చెరి వెళ్లాను. ఆక్కడ కొంతకాలం శిక్షణ తీసుకున్న తర్వాత న్యూయార్క్‌ వెళ్లాను. అక్కడ కూడా రెండేళ్లు నటనలో శిక్షణ పొందాను. తిరిగి వచ్చిన తర్వాత కథలు వినడం మొదలుపెట్టాను.

జెమినీ కిరణ్‌ ద్వారా ‘శ్రీనివాస మంగాపురం’ జర్నీ ప్రారంభమైంది. ఇంతకు ముందు కూడా కథలు విన్నాను. కాకపోతే అజయ్‌ చెప్పిన కథ అద్భుతంగా అనిపించింది. ఒక మంచి ఎమోషన్‌, మంచి క్యారెక్టర్‌ ఉన్న కథతో ప్రేక్షకుల ముందుకు రావాలనుకున్నాను. అలా అన్ని అంశాలు ఈ కథలో కుదిరాయి.

అశ్వినీదత్‌ గారితో నాకు మంచి అనుబంధం ఉంది. వైజయంతి మూవీస్‌ లాంటి ప్రతిష్ఠాత్మక సంస్థ ద్వారా వెండి తెరకు నేను పరిచయం అవుతుండడం చాలా ఆనందంగా ఉంది. మహేశ్ (Mahesh Babu) బాబాయ్‌ తొలి సినిమా కూడా వైజయంతి మూవీ్‌సలోనే వచ్చింది. ఆ సినిమాకు వచ్చిన స్పందన నా చిత్రానికి కూడా వస్తుందనే నమ్మకముంది.

‘శ్రీనివాస మంగాపురం’ చిత్రం చాలా రియలిస్టిక్‌గా ఉంటుంది. క్యారెక్టర్స్‌, ఎమోషన్స్‌ అన్నీ కూడా చాలా రస్టిక్‌గా అనిపిస్తాయి. ఈ చిత్రంలో రాషాతో పనిచేయడం చాలా మంచి అనుభవాన్ని ఇచ్చింది. కచ్చితంగా ప్రేక్షకులు ఆమె నటనకు ఫిదా అవుతారు. జీవీ ప్రకాశ్‌ అద్భుతమైన సంగీతం ఇచ్చారు. ఆరు పాటలు దేనికవే ప్రత్యేకం.

ఈ చిత్రంలో ప్రేక్షకులు ఊహించలేని ట్విస్టులు కూడా ఉంటాయి. అజయ్‌ భూపతి చాలా క్లారిటీ ఉన్న డైరెక్టర్‌. నా తొలి సినిమాకే అలాంటి దర్శకుడితో పని చేయడం లక్కీగా భావిస్తున్నాను. మహేశ్‌ బాబాయ్‌ నాకు ప్రతి విషయంలోనూ సలహాలు ఇస్తారు. అలాగే నా ప్రతి అడుగులో బంగారు తాతయ్య ప్రోత్సాహం ఉంటుంది.

Updated Date - Jul 26 , 2026 | 08:48 AM