పంథా మార్చుకున్న రాజ‌మౌళి.. షూటింగ్‌కు బ్రేక్‌

ABN , Publish Date - Apr 06 , 2026 | 09:24 PM

మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న పాన్ వరల్డ్ చిత్రం వారణాసి షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని శంకరపల్లిలో జరుగుతోంది.

Mahesh Babu

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) కాంబినేషన్‌లో వస్తున్న పాన్ వరల్డ్ చిత్రం వారణాసి (Varanasi)షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని శంకరపల్లిలో జరుగుతోంది. వారణాసి బ్యాక్‌డ్రాప్‌లో వేసిన ప్రత్యేక సెట్‌లో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా (Priyanka chopra), పృధ్వీరాజ్ సుకుమార‌న్ (Prithviraj Sukumaran)లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ మరో రెండు వారాల పాటు సాగనుంది. రుద్ర పాత్రలో మహేష్, మందాకినిగా ప్రియాంక నటిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

అయితే వేసవి తీవ్రత దృష్ట్యా మే నెల మొత్తం షూటింగ్‌కు విరామం ఇవ్వాలని చిత్ర యూనిట్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ విరామంలో మహేష్ బాబు తన కుటుంబంతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్తుండగా, రాజమౌళి కూడా ఒక చిన్న టూర్ ప్లాన్ చేశాట. సాధారణంగా సినిమా పూర్తయ్యే వరకు హీరోలకు గ్యాప్ ఇవ్వని రాజమౌళి, ఈసారి పంథా మార్చుకోవడం విశేషం. ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తి కావడంతో, ఈ విరామం టీమ్ అందరికీ రీఛార్జ్ అయ్యేందుకు ఉపయోగపడనుంది.

ఈ భారీ బడ్జెట్ అడ్వెంచర్ థ్రిల్లర్ ప్లానింగ్ విషయంలో రాజమౌళి అత్యంత పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు. షూటింగ్‌తో పాటే పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా సమాంతరంగా నడిపిస్తూ, 2027 వేసవి నాటికి సినిమాను విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. విరామం తర్వాత అంటార్కిటికాలో షెడ్యూల్ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అయితే జూన్-జులై నెలల్లో అక్కడ సూర్యుడు ఉదయించకపోవడం, గడ్డకట్టే చలి ఉండటం వంటి సవాళ్లు ఉన్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

ఈ సినిమా టీజర్‌కు ఇప్పటికే భారీ స్పందన లభించగా, కథాంశంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వారణాసి వంటి ఆధ్యాత్మిక నగర నేపథ్యానికి సైన్స్ ఫిక్షన్‌ను జోడించి ఈ అడ్వెంచర్ కథను రాజమౌళి రూపొందిస్తున్నారు. గంగా ఘాట్ల సెట్‌లో మహేష్ బాబు మేకోవర్ అద్భుతంగా ఉంటుందని ఇండస్ట్రీ టాక్. ఈ చిత్రం రెండు భాగాలుగా రానుందనే ప్రచారం కూడా జరుగుతోంది. దర్శకధీరుడి వర్కింగ్ స్టైల్ గురించి అనేకమందికి సుపరిచితమే, కాబట్టి ఈ వెయ్యి కోట్ల ప్రాజెక్టుతో ఆయన ప్రపంచవ్యాప్తంగా మరిన్ని రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.

Updated Date - Apr 06 , 2026 | 09:24 PM