Lenin Trailer: అయ్యా.. ఇదయ్యా.. మీ విశ్వరూపం

ABN , Publish Date - Jun 30 , 2026 | 08:48 PM

అక్కినేని హీరో అక్కినేని అఖిల్ (Akkineni Akhil) ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటిస్తున్న సరికొత్త యాక్షన్ డ్రామా లెనిన్ (LENIN). మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించిన ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించారు.

Lenin

అక్కినేని హీరో అక్కినేని అఖిల్ (Akkineni Akhil) ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటిస్తున్న సరికొత్త యాక్షన్ డ్రామా లెనిన్ (LENIN). మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించిన ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే నటించింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. జులై 10 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ పెంచిన మేకర్స్ తాజాగా లెనిన్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.


ఈ ట్రైలర్ అక్కినేని నాగార్జున వాయిస్ ఓవర్ తో మొదలయ్యింది. కథ విషయానికొస్తే.. చిత్తూరు జిల్లా శ్రీరామపురం ఆ గ్రామంలో 18 రోజులు ద్రౌపదమ్మ జాతర జరుగుతుంది. ఆ జాతర ముగిసేవరకు చుక్క రక్తం కూడా నేల మీద పడకూడదు. ఆ జాతర చూడడానికి ఆ ఊరులో ఉండే రాజకీయ నాయకుడు ఫ్రెండ్ లెనిన్ వస్తాడు. జాతరలో భారతిని చూసి ఇష్టపడతాడు. అయితే కొంతమంది.. ఆ ఊరిలో రక్తం చిందాలని, అదే సరైన సమయం అని ఆ ఊరిపై దండెత్తుతారు. ఆ గొడవల్లో లెనిన్ ఫ్రెండ్, భారతి చిక్కుల్లో పడతారు. మరి ఆ గొడవలు ఏంటి.. ? లెనిన్ కత్తి పట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది.. ? చివరకి ఫ్రెండ్ ని, భారతిని కాపాడుకున్నాడా.. ? ఈ మహాభారతంలో గెలిచింది ఎవరు అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.


గ్రామీణ ప్రాంతంలో జరిగే ఆధిపత్య పోరాటం, రాజకీయాలు, ప్రతీకారంతో పాటు ద్రౌపది నాటకం, కురుక్షేత్రం, శ్రీకృష్ణార్జునుల ప్రస్తావన వంటి పౌరాణిక ఎలిమెంట్స్‌ను నేటి కాలానికి ముడిపెడుతూ తెరకెక్కించినట్లు తెలుస్తోంది. చిత్తూరు జిల్లా నేపథ్యాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ ఈ మహాభారతం చిత్తూరు జిల్లాలో ప్రతిరోజూ జరుగుతుంది.. అంటూ బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే డైలాగ్స్ సినిమా కథ ఎంత ఇంటెన్సివ్‌గా ఉండబోతోందో చూపించింది. ముఖ్యంగా అఖిల్ లుక్, బాడీ లాంగ్వేజ్ మునుపెన్నడూ చూడని విధంగా ఊరమాస్, రస్టిక్ అవతారంలో అదరగొట్టేలా ఉన్నాయి. యాక్షన్ ఎపిసోడ్స్‌లో అఖిల్ చూపించిన రౌద్రం, ఇంటెన్సిటీ థియేటర్లలో పూనకాలు తెప్పించడం ఖాయం. భాగ్యశ్రీ బోర్సే తన గ్లామర్‌తో పాటు ఎమోషనల్ నటనతోనూ మెప్పించబోతోందని తెలుస్తోంది. ట్రైలర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది మాత్రం సంగీత దర్శకుడు ఎస్. థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అని చెప్పొచ్చు. ట్రైలర్ తో సినిమాపై మేకర్స్ అంచనాలను పెంచేశారు. ట్రైలర్ చూశాక .. అక్కినేని ఫ్యాన్స్.. అయ్యగారు.. ఇది మీ విశ్వరూపం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ సినిమాతో అఖిల్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Updated Date - Jun 30 , 2026 | 09:13 PM