మార్చి మొదటివారంలో సతీ లీలావతి...
ABN , Publish Date - Feb 12 , 2026 | 03:56 PM
లావణ్య త్రిపాఠి కొణిదెల టైటిల్ రోల్ ప్లే చేసిన చిత్రం 'సతీ లీలావతి'. మలయాళ నటుడు దేవ్ మోహన్ హీరోగా నటించిన ఈ సినిమా మార్చి 6న విడుదల కాబోతోంది.
లావణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్ జంటగా నటించిన సినిమా ‘సతీ లీలావతి’ (Sathi Leelavathi). తాతినేని సత్య (Thathineni Satya) దర్శకత్వంలో ఈ సినిమాను నాగ మోహన్ నిర్మించారు. మార్చి 6న ఈ మూవీని విడుదల చేయబోతున్నట్టు బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో తెలిపారు.
ఈ సందర్భంగా లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) మాట్లాడుతూ, 'సతీ లీలావతి మూవీని ప్రారంభించినప్పుడు నేను గర్భవతిని. కేవలం మూడు నెలల్లోనే షూటింగ్ పూర్తి చేశాను. దర్శక, నిర్మాతల సపోర్ట్ వల్లే నేను నటించగలిగాను. సప్తగిరి (Sapthagiri) గారితో పని చేయడం ఆనందంగా ఉంది. దేవ్ మోహన్ (Dev Mohan) గారి నటన ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. ఇది పూర్తిగా వినోదాత్మక చిత్రం. ఈ సినిమాను చూసి పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. తాతినేని సత్య మాట్లాడుతూ, 'కమల్ హాసన్ గారు చేసిన ‘సతీ లీలావతి’తో మాత్రం నా సినిమాని పోల్చను. అయితే అందరికీ కనెక్ట్ అయ్యేలా ఈ సినిమాను తీశాను’ అని చెప్పారు.
'పాత 'సతీ లీలావతి' ఎంత పెద్ద హిట్ అయ్యిందో ఈ సినిమా కూడా అంత హిట్ కావాలని కోరుకుంటున్నా'నని నటుడు సప్తగిరి అన్నారు. నిర్మాతగా తనకిది మొదటి చిత్రమని, ఈ సినిమా ప్రయాణంలో ఎన్నో నేర్చుకున్నానని, వరల్డ్ వైడ్ మార్చి 6న సినిమాను విడుదల చేయబోతున్నామని నిర్మాత నాగ మోహన్ చెప్పారు. ఇందులో నరేష్, వీటీవీ గణేష్, మొట్టా రాజేంద్రన్, జాఫర్ సాదిక్, జోషి తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.