అనీల్ చేతిలో.. బేబ‌మ్మ జాత‌కం

ABN , Publish Date - Jun 18 , 2026 | 10:39 PM

సినీ ఇండస్ట్రీలో ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డమ్ తెచ్చుకున్న హీరోయిన్లు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి కోవలోకే వస్తుంది బ్యూటిఫుల్ కృతి శెట్టి

Krithi Shetty

సినీ ఇండస్ట్రీలో ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డమ్ తెచ్చుకున్న హీరోయిన్లు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి కోవలోకే వస్తుంది బ్యూటిఫుల్ కృతి శెట్టి (Krithi Shetty). వైష్ణవ్ తేజ్ హీరోగా, బుచ్చిబాబు దర్శకత్వంలో 2021లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఉప్పెన (Uppena) చిత్రంతో ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఫస్ట్ మూవీతోనే బేబమ్మ బాక్సాఫీస్ వద్ద ఏకంగా వంద కోట్ల కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమాతో తన అందం, అద్భుతమైన అభినయంతో కుర్రకారు మనసులను కొల్లగొట్టింది. ఆ మొదటి సినిమా ఇచ్చిన ఊపుతో కృతి శెట్టి తన తదుపరి ప్రాజెక్టులను చాలా వేగంగా ఎంపిక చేసుకుని విజయాల బాట పట్టింది. నేచురల్ స్టార్ నాని సరసన నటించిన 'శ్యామ్ సింగరాయ్', అక్కినేని నాగచైతన్యతో కలిసి నటించిన 'బంగార్రాజు' చిత్రాలు వరుసగా ఘనవిజయాలు సాధించడంతో కృతి శెట్టి ఖాతాలో అనతికాలంలోనే హ్యాట్రిక్ హిట్లు చేరిపోయాయి.

అయితే, ఈ హ్యాట్రిక్ విజయాల తర్వాత బేబమ్మ కెరీర్ ఒక్కసారిగా తీవ్ర ఒడిదొడుకులకు లోనైంది. ఆమె ఎన్నో ఆశలు పెట్టుకుని నటించిన మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, ది వారియర్, కస్టడీ, మనమే వంటి వరుస చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేక పోయాయి. 'ఉప్పెన' విడుదలై ఐదేళ్లు గడుస్తున్నా ఆ స్థాయి బ్లాక్‌బస్టర్ హిట్ మళ్లీ దక్కకపోవడంతో ఆమె కెరీర్ గ్రాఫ్ నెమ్మదించింది. దీంతో టాలీవుడ్‌లో ఒకప్పుడు గోల్డెన్ లెగ్ అనిపించుకున్న ఈ భామ కాస్తా ఐరన్ లెగ్‌గా మారిందంటూ ట్రోల్స్ కూడా మొదలయ్యాయి. సరిగ్గా ఇలాంటి క్లిష్ట సమయంలో కృతి శెట్టికి టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) రూపంలో ఒక అద్భుతమైన అవకాశం తలుపు తట్టింది.

టాలీవుడ్‌లో ఫెయిల్యూర్ ఎరుగని దర్శకుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న ఆయన సినిమాల్లో హీరోయిన్ల క్యారెక్టరైజేషన్ చాలా వినోదాత్మకంగా, ఎనర్జిటిక్‌గా ఉంటుంది. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కలయికలో అనిల్ రావిపూడి తెరకెక్కించబోయే భారీ మల్టీస్టారర్ ప్రాజెక్టులో కృతి శెట్టి ఒక హీరోయిన్ గా ఎంపికైంది. ఈ సినిమాలో మరో కథానాయికగా కీర్తి సురేష్ నటిస్తుండగా, ఈ చిత్రం జూన్ 18న పూజా కార్యక్రమాలతో అట్టహాసంగా ప్రారంభమైంది. పరాజయాల్లో ఉన్న హీరోయిన్లకు సైతం తనదైన మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో బ్లాక్‌బస్టర్ హిట్స్ ఇచ్చే ట్రాక్ రికార్డ్ అనిల్ రావిపూడికి ఉండటంతో, ఈ క్రేజీ ప్రాజెక్టు కృతి శెట్టికి ఖచ్చితంగా పూర్వ వైభవాన్ని తెస్తుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

ఇక ఈ ప్రాజెక్టులో నటిస్తున్న మిగతా తారాగణానికి కూడా విజయం చాలా కీలకం. కళ్యాణ్ రామ్ (Kalyan Ram) 'బింబిసార' లాంటి భారీ సక్సెస్ తర్వాత చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడలేదు. అసలు అనిల్ ని 'పటాస్' సినిమాతో దర్శకుడిగా పరిచయం చేసిందే కళ్యాణ్ రామ్ కావడంతో, ఆ కృతజ్ఞతతో ఎలాగైనా తన ఫస్ట్ హీరోకు ఒక సాలిడ్ కమ్ బ్యాక్ హిట్ ఇవ్వాలనే కసితో దర్శకుడు ఉన్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. దీనికి తోడు కీర్తి సురేష్ కు కూడా బాక్సాఫీస్ వద్ద పక్కా కమర్షియల్ బ్లాక్ బస్టర్ పడి చాలా కాలం అవుతుండటంతో, అనిల్ మార్క్ ఎంటర్టైనర్ తన కెరీర్ కు మళ్లీ మంచి బూస్ట్ ఇస్తుందని ఆమె బలంగా నమ్ముతోంది.

మొత్తంగా చూసుకుంటే ఈ సినిమాలో కేవలం వెంకటేష్ మినహా కళ్యాణ్ రామ్, కీర్తి సురేష్ (Keerthy Suresh), కృతి శెట్టి ముగ్గురూ ఒక భారీ కమర్షియల్ హిట్ కోసం గట్టిగా ఎదురుచూస్తున్న వారే. వీళ్లందరి ఆశలు ఇప్పుడు అనిల్ రావిపూడి మార్క్ మేకింగ్ మీదే ఉన్నాయి. అపజయం అనే మాటే తెలియని దర్శకుడు కాబట్టి, తమ కెరీర్ లను మళ్ళీ విజయాల ట్రాక్ లోకి తెచ్చుకోవడానికి వీరికి ఇది బెస్ట్ ఛాన్స్ అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో, వీళ్లందరికీ ఎలాంటి భారీ విజయాన్ని అందిస్తుందో వేచి చూడాలి.

Updated Date - Jun 18 , 2026 | 10:39 PM