Kodi Ramakrishna: కింద కూర్చుని సినిమా చూస్తానన్న కోడి రామకృష్ణ.. కృష్ణ ఏమన్నారంటే?
ABN , Publish Date - Nov 24 , 2026 | 06:14 PM
దర్శకుడు కోడి రామకృష్ణకు హీరో కృష్ణతో ఎదురైన తొలి అనుభవం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది.
హీరో కృష్ణతో కోడి రామకృష్ణ తొలి అనుభవం!
హీరో కృష్ణ నటించిన నూరవ చిత్రం ‘అల్లూరి సీతారామరాజు’ విడుదలకు ముందు మద్రాసులో ఫిల్మ్ చాంబర్ థియేటర్లో వేశారు. ఆ సమయంలో కోడి రామకృష్ణ దర్శకరత్న దాసరి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. మన్నెం వీరుడి గురించి తీసిన సినిమా కావడంతో దాన్ని చూడాలనే కోరికతో ఫిల్మ్ ఛాంబర్‌కు వెళ్లారు కోడి రామకృష్ణ. కానీ గేటు దగ్గరున్న ప్రొడక్షన్ మేనేజర్ వెంకన్న ఆయన్ని లోపలికి పంపించలేదు. ‘ఇది ముఖ్యమైన వ్యక్తుల కోసం వేస్తున్న షో. నువ్వెవరు?’ అని ప్రశ్నించారు. తను ఎవరో, ఎవరి దగ్గర పనిచేస్తున్నారో చెప్పడం కోడి రామకృష్ణకు ఇష్టం లేదు. . అందుకే ఆ విషయం చెప్పాకుండా ఆయన్ని బతిమాలుతూ అక్కడే ఉన్నారు.
కాసెపటికి పెద్ద కారులో హీరో కృష్ణ విజయనిర్మలతో అక్కడికి వచ్చారు. గేటు దగ్గర కోడి రామకృష్ణ బతిమాలడం గమనించి దగ్గరకు రమ్మని పిలిచారు కృష్ణ. ఆయన దగ్గరకు వెళ్లగానే ‘ఎవరు నువ్వు?’ అనడిగారు కృష్ణ. ‘మీ సినిమా గురించి అందరూ గొప్పగా చెప్పుకోవడం విన్నానండీ.. అందుకే సినిమా చూద్దామని వచ్చాను. నేను అసిస్టెంట్ డెరెక్టర్నండీ. కానీ ఆయన లోపలకి వెళ్లనివ్వడం లేదు’ అని చెప్పారు కోడి రామకృష్ణ.
‘ఎవరి దగ్గర నువ్వు పనిచేస్తున్నావు?’ అని మళ్లీ అడిగారు కృష్ణ.
‘సార్.. అతను నన్ను తోసెయ్యకముందు అడిగితే చెప్పేవాడినండీ.. తోశాక చెప్పడం మర్యాద కాదండీ’ అన్నారు కోడి రామకృష్ణ.
‘సరే అయితే.. నువ్వు లోపలికి వెళ్లు. సీటు ఖాళీగా ఉంటే కూర్చో. సీటు లేకపోతే... ’అని ఆయన ఏదో చెప్పబోతుండగానే ‘కింద కూర్చుంటానండీ’ అన్నారు కోడి రామకృష్ణ.
‘కింద కాదు. వెంకన్నబాబుకి చెప్పు.. కుర్చీ వేస్తాడు. కూర్చుని సినిమా చూడు. చూశాక ఎలా ఉందో నాకు చెప్పు’ అని చెప్పి లోపలికి పంపించారు కృష్ణ.
అలా కోడి రామకృష్ణ ప్రివ్యూ చూసిన తొలి సినిమా ‘అల్లూరి సీతారామరాజు’. బయటకి వచ్చి ‘బ్రహ్మాండంగా ఉంది సార్’ అని కృష్ణతో చెబుదామని అటూఇటూ చూశారాయన. కానీ ఆయన అప్పటికే వెళ్లిపోయారు. కొన్నేళ్ల తర్వాత ‘పోరాటం’ చిత్రం షూటింగ్ చేస్తున్నప్పుడు ఒక రోజు కృష్ణతో ఈ విషయం చెప్పారు కోడి రామకృష్ణ. ‘అవును.. నాకూ గుర్తుంది. వెంకన్నబాబు నిన్ను లోపలికి పంపించలేదు కదూ’ అని గుర్తు చేసుకున్నారు హీరో కృష్ణ.