Chennai Love Story Review: 'చెన్నై లవ్ స్టోరీ' ఎలా ఉందంటే
ABN , Publish Date - Jul 24 , 2026 | 06:39 AM
కిరణ్ అబ్బవరం , శ్రీ గౌరీ ప్రియా జంటగా నటించిన 'చెన్నై లవ్ స్టోరీ' శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ చిత్రం కిరణ్ కు హిట్ ఇచ్చిందా..
సినిమా రివ్యూ: చెన్నై లవ్‌స్టోరీ
విడుదల తేది: 24–7–2026
కిరణ్ అబ్బవరం సక్సెస్, ఫెయిల్యూర్స్‌ను పట్టించుకోకుండా వరుస చిత్రాలు చేస్తున్నారు. తాజాగా ఆయన నటించిన ప్రేమకథా చిత్రం 'చెన్నై లవ్‌స్టోరీ’. శ్రీగౌరి ప్రియ కథానాయిక. రవి నంబూరు దర్శకుడు. 'కలర్ ఫొటో’, 'బేబీ’ చిత్రాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన సాయి రాజేష్, నిర్మాత ఎస్‌కెఎన్‌తో కలిసి తీసిన సినిమా ఇది. ఈ చిత్రానికి సాయి రాజేశ్ కథ అందించారు. మణిశర్మ స్వరపర్చిన పాటలు, ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ప్రేమకథగా తెరకెక్కిన ఈ చిత్రం చిరంజీవి నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ 'ఇంద్ర' విడుదల సెంటిమెంట్‌తో ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మరీ చిత్రంతో కిరణ్ అబ్బవరం ఖాతాలో హిట్టు పడిందా లేదా అన్నది చూద్దాం.
కథ:
నెల్లూరుకు చెందిన స్టీవెన్ శంకర్ ఓ అనాథ. సినిమాపై పిచ్చితో ఎలాగైనా డైరెక్టర్ కావాలనే తపనతో చెన్నైలో వాలిపోతాడు. నివేదిత అలియాస్ నివి (శ్రీగౌరీ ప్రియ)కి మూడేళ్ళు ప్రేమించిన అబ్బాయితో పీటల మీద పెళ్లి ఆగిపోతుంది. చెన్నైలో ఉద్యోగం చేసే నివీ ఆ మందుకు బానిస అవుతుంది. ఆమె స్నేహితులు వారించి, కొద్దికాలం తనను ప్రశాంతంగా వదిలేయ్ మని కోరుతుంది. ఆమె స్నేహితులకు పరిచయమైన స్టీవెన్‌ను అదే ప్లాట్‌లో ఉండమని పిలుస్తారు. మొదట్లో నివి అతన్ని పట్టించుకోదు. ఓ సందర్భంలో అతనిపై విరుచుకు పడుతుంది కూడా. స్టీవెన్ అనుభవించిన సినిమా కష్టాలు తెలుసుకున్నాక ఓ నిర్మాతతో మాట్లాడి కథ చెప్పే అవకాశం ఇప్పిస్తుంది. అలా స్టీవెన్ ఓ మంచి కథ చెప్పడం, దర్శకుడిగా అవకాశం పొందటం జరుగుతుంది. ఓ సందర్భంలో నివి 'మనం పెళ్ళి చేసుకుందామా?' అని స్టీవెన్ ను అడగడంతో అతను వెంటనే సరేనంటాడు. అయితే పెళ్లికి కొన్ని గంటల ముందు స్టీవెన్‌కు యాక్సిడెంట్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? నివిని పెళ్లి పీటల మీద వదిలేసిన అజయ్ (తిగుణ్) మళ్లీ ఎందుకు ఆమె జీవితంలోకి వచ్చాడు? నివి నిజంగా ప్రేమించింది ఎవర్నీ? ఫైనల్‌గా ఎవర్ని పెళ్లి చేసుకుంది? అన్నది కథ.
విశ్లేషణ :
'బేబీ' సినిమాను డైరెక్ట్ చేసిన తర్వాత సాయి రాజేశ్ రాసిన కథ ఇది. ఫస్ట్ లవ్ అనేది ఎప్పటికీ మెమరబుల్. అది ఎప్పటికీ శాశ్వతం అని 'బేబీ'తో చెప్పారు. ఇప్పుడాయన సెకెండ్ లవ్ ఎలా ఉంటుందో చూపించే ప్రయత్నం చేశారు. అయితే ఈ రెండు కథల్లోనూ ఇద్దరు అబ్బాయిలతో ఓ అమ్మాయి ప్రేమ అన్నది కామన్ పాయింట్. అయితే ఇక్కడ ప్రేమలో విఫలమైన అమ్మాయి యాంగిల్‌లో చూపించారు. హీరోయిన్ పరిచయ సన్నివేశాలతో కథ ఆసక్తిగా మొదలవుతుంది. హీరో ఎంట్రీ సోసోగా ఉంటుంది. హీరోయిన్ ఇంట్లోకి హీరో మకాం మార్చినప్పటి నుంచి కథ ఇంట్రెస్ట్‌గా సాగుతుంది. ప్రేమ విఫలమైన బాధ నుంచి హీరోయిన్‌ని బయటకు తీసుకురావడానికి హీరో చేసే ప్రయత్నాలతో ఆసక్తిగా సాగుతూ అసలైన కథలోకి ప్రేక్షకుడిని తీసుకు వెళ్తుంది. స్టీవెన్, నివి మధ్య ప్రేమ చిగురించడం, అది పెళ్లి వరకూ వెళ్లడంతో ఆసక్తి మరింత పెరుగుతుంది. కథ కూడా జెట్ స్పీడ్‌తో నడుస్తుంది. దర్శకుడు కాలేడనుకున్న వ్యక్తికి అవకాశం రావడం, పెళ్లి ఆగిపోయిన బాధ నుంచి బయటకు రాదనుకున్న అమ్మాయి మరొకరితో ప్రేమలో పడటం, ఆ ప్రేమకు మళ్లీ బ్రేక్ రావడం దీంతో ఇంటర్వెల్‌తో కథకు ఫుల్‌స్టాఫ్ పడిందనిపిస్తుంది. అయితే అక్కడి నుంచి ఫాంటసీ జానర్‌లోకి కథ వెళ్తుంది. ఇంటర్వెల్ సీన్స్ మాత్రం ఊహకు అందకుండా ఓ సస్పెన్స్‌లా ఉంటుంది. దాంతో ద్వితీయార్థాన్ని దర్శకుడు ఎలా డీల్ చేస్తాడోనని ఆసక్తి రెట్టింపు అవుతుంది. ఫస్టాఫ్‌లో హోటల్‌లో పని చేసే పిల్లాడు 'చనిపోయిన తన తండ్రితో మాట్లాడుతున్నాడు.. ఇదెలా సాధ్యం’ అనే సీన్‌కు సెకెండాఫ్‌లో హీరో పాత్రతో క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు. అయితే కొన్ని సన్నివేశాల్లో మాత్రం లాజిక్కులు వదిలేసి దర్శకుడు ఏం చెప్పాడో అది నమ్మాలి అనేలా సీన్లు ఉన్నాయి. మాజీ ప్రియుడు మళ్లీ తెరపైకి వచ్చిన సన్నివేశాలు, అతన్ని చూసి స్టీవెన్ జెలసీ ఫీల్ అవ్వడం, ఆ అమ్మాయి పట్ల పొసెసివ్‌గా ఉండటం కాస్త విడ్డూరంగా ఉంటాయి కానీ నవ్వులు పూయిస్తాయి. ప్రీ క్లైమాక్స్‌లో హీరోయిన్‌ను కాపాడే సన్నివేశం ఐడియా బావుంది. అయితే ఆఖరి ఘట్టం ఎమోషనల్‌గా సాగినా ప్రతి సీను ఊహకు అందేలాగే తీర్చిదిద్దారు.
నటీనటులు, సాంకేతిక నిపుణులు:
స్టీవెన్ శంకర్ పాత్రకు కిరణ్ పర్పెక్ట్‌గా యాప్ట్ అయ్యారు. అతని టైమింగ్ కూడా బావుంది. నివి పాత్రలో శ్రీగౌరి ప్రియ అద్భుతమైన నటన కనబర్చింది. అందంతోనే కాకుండా భావోద్వేగ సన్నివేశాల్లో కట్టిపడేసింది. ప్రేక్షకులు గుర్తుంచుకునే పాత్ర ఆమెది. మరో కీలక పాత్రలో త్రిగున్ ఫర్వాలేదనిపించారు. సిరి హనుమంతు, మహేందర్, నవీన్ నేని, నరేశ్, పూజ, దేవి ప్రసాద్, ప్రమోదిని పరిధి మేరకు నటించారు. సీనియర్ దర్శకుడు పి. వాసు, కరుణకుమార్ కీలక పాత్రల్లో మెరిశారు. ఇక ఈ సినిమాకు మేజర్ పిల్లర్ మణిశర్మ. ఆయన పాటలతోనూ, నేపథ్య సంగీతంతోనూ ప్రతి సన్నివేశాన్నీ ఎలివేట్ చేశారు. నేపథ్య సంగీతానికి మణిశర్మ ఎందుకు బెస్ట్ అనేది ప్రశ్నకు ఈ సినిమా మరో ఉదాహరణ. సినిమాటోగ్రఫీ కూడా ఎక్స్ లెంట్‌గా ఉంది. నిర్మాణంలో సాయిరాజేశ్, ఎస్‌కెఎన్ ఎక్కడా రాజీపడలేదు. కథానుగుణంగా కామెడీ, చక్కని భావోద్వేగాలు సమపాళ్లల్లో ఉన్నాయి. ఇంటర్వెల్ వరకూ హైలో ఉన్న కథ సెకెండాఫ్‌కి వచ్చేసరికి కాస్త డల్ అయిందనే చెప్పాలి. స్టోరీ, క్యారెక్టరైజేషన్స్ బాగా రాసుకున్నారు కానీ ద్వితీయార్థం తెరకెక్కించడంలో చిన్న తడబాటు కనిపించింది. లాజిక్కులు వదిలేసి మ్యాజిక్ చేయాలనే తపన కనిపించింది. అయితే రొటీన్ గా వస్తున్న లవ్‌స్టోరీస్‌లో ఇది కాస్త డిఫరెంట్ అని చెప్పవచ్చు.
ట్యాగ్‌లైన్: ఓ ఆత్మ ప్రేమకథ!
రేటింగ్: 2.75/5