మరో మలయాళ బ్యూటీని దింపుతున్న గోపీచంద్

ABN , Publish Date - Aug 01 , 2026 | 08:05 PM

టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ (Gopichand) ఎంతగా కష్టపడుతున్నప్పటికీ, ఈమధ్య కాలంలో ఆయన చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయాయి.

Anarkali Marikar

టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ (Gopichand) ఎంతగా కష్టపడుతున్నప్పటికీ, ఈమధ్య కాలంలో ఆయన చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయాయి. సరైన హిట్ పడి చాలా కాలమే అయినప్పటికీ, ఆ ఫలితాలతో సంబంధం లేకుండా గోపీచంద్ మాత్రం వరుస ప్రాజెక్టులను లైన్‌లో పెడుతూ ఫుల్ బిజీగా గడిపేస్తున్నాడు. కథల విషయంలో సరికొత్త ప్రయోగాలు చేస్తూ, తన మాస్ ఇమేజ్‌కి తగ్గట్టుగా విభిన్నమైన సినిమాలను మేకర్స్‌తో కలసి సెట్స్ పైకి తీసుకెళ్తున్నాడు. ప్రస్తుతం గోపీచంద్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ఒకటి భరతవర్ష. సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది.


ఇక భరతవర్ష కాకుండా గోపీచంద్ సైన్ చేసిన క్రేజీ ప్రాజెక్ట్‌ ఇంకొకటి ఉంది. ప్రముఖ ఫైట్ మాస్టర్ వెంకట్ డైరెక్టర్ గా మారి తెరకెక్కిస్తోన్న చిత్రం. అవుట్ అండ్ అవుట్ హై-వోల్టేజ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ద్వారా ఎలాగైనా గట్టి కంబ్యాక్ ఇవ్వాలని గోపీచంద్ గట్టి పట్టుదలతో ఉన్నాడు. ఈ మధ్యనే పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమాని కూడా గోపీచంద్ సెట్స్ మీదకు తీసుకెళ్ళాడు. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు సింగా అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. గోపీచంద్ ఇమేజ్‌కి ఈ టైటిల్ సరిగ్గా సరిపోయిందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.


ఇక ఈ సినిమాలో గోపీచంద్ సరసన కథానాయికగా కేరళ కుట్టి అనార్కలి మరీకార్‌ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. మలయాళంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామకి సంగా చిత్రమే తొలి తెలుగు సినిమా కావడం విశేషం. ఇప్పటికే తెలుగును ఏలుతున్న స్టార్ హీరోయిన్స్ లో సగానికి పైగా మలయాళ ముద్దుగుమ్మలే ఉన్నారు. ఇక ఇప్పుడు గోపీచంద్ మరో మలయాళ బ్యూటీని దిమ్పుతున్నాడు. మరి ఈ సినిమాతో ఈ భామ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Updated Date - Aug 01 , 2026 | 08:30 PM