సినిమా రివ్యూ: యూత్
ABN , Publish Date - Mar 26 , 2026 | 02:51 PM
స్కూల్, కాలేజ్ నేపథ్యంలో సాగే యూత్ ఫుల్ ఎంటర్టైనర్స్ కి ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఆ తరహా కథలతో వచ్చిన దక్షిణాది చిత్రాలు చక్కటి విజయాలు సాధించాయి. తాజాగా ఆ కోవలో వచ్చిన తమిళ చిత్రం ‘యూత్’. తమిళంలో హిట్ అయిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది
సినిమా రివ్యూ: యూత్
స్కూల్, కాలేజ్ నేపథ్యంలో సాగే యూత్ ఫుల్ ఎంటర్టైనర్స్ కి ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఆ తరహా కథలతో వచ్చిన దక్షిణాది చిత్రాలు చక్కటి విజయాలు సాధించాయి. తాజాగా ఆ కోవలో వచ్చిన తమిళ చిత్రం ‘యూత్’ (youth Review). బాల నటుడిగా కెరీర్ ప్రారంభించి ‘వాతీ’, ‘తిరుచిత్రంబలం’, ‘అసురన్’ చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేసిన కెన్ కరుణాస్ (Ken Karunas) ఈ చిత్రంలో హీరోగా నటించడమే కాక దర్శకత్వం కూడా వహించారు. ఈ నెల 19న తమిళంలో విడుదలై యూత్ ను ఆకట్టుకోవడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకొంది. ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్ కు ముందే ప్రీమియర్స్ తో ఆడియన్స్ ముందుకు వచ్చిన ‘యూత్’ తెలుగు వారిని ఏ మేరకు మెప్పించిందో చూద్దాం.
కథ:
ప్రవీణ్ (కెన్ కరుణాస్) 15 ఏళ్ల కుర్రాడు. బేకరీ నడుపుకొంటూ జీవితం సాగించే ఉన్నికృష్ణన్ (సూరజ్ వెంజరమూడు), సరోజ (దేవదర్శిని) దంపతుల ఏకైక కుమారుడు. తల్లికి కొడుకంటే ప్రాణం. తండ్రికి ప్రవీణ్ చేసే పనులు నచ్చవు. ప్రవీణ్ చేష్టలకు అమ్మాయిలు అతని వైపే చూడరు. స్కూల్ చదువు పూర్తయ్యేలోగా అమ్మాయిల ప్రేమను పొందాలని పట్టుదలతో ప్రయత్నాలు చేస్తుంటాడు ప్రవీణ్. అలా అమ్మాయిలతో పరిచయాలు పెంచుకునే క్రమంలో ఓ ముగ్గురు అమ్మాయిలు… గంగవల్లి (అనీషా అనిల్ కుమార్), ప్రేషిక (మీనాక్షి దినేష్), సోనల్ (ప్రియాన్సీ యాదవ్) తారసపడటం.. వారితో ప్రేమ విఫలం కావడం జరుగుతుంది. పదో తరగతి నుంచి ఇంటర్ పూర్తయ్యే వరకూ ప్రవీణ్ కు ఎదురైన అనుభవాలు, అవమానాలు బ్రేకప్స్ అతనికి ఏమి నేర్పించాయి? తల్లిదండ్రులు కోరుకున్న లక్ష్యం చేరుకున్నాడా? అతని ప్రేమకథలు ఏమయ్యాయి? అన్నదే ఈ ‘యూత్’ కథాంశం.

విశ్లేషణ... (Youth Review)
అల్లరి చిల్లరిగా తిరిగే కుర్రాడు పరిణితి చెందిన వ్యక్తిగా ఎలా మారాడన్నది ఈ సినిమా ఇతివృత్తం. దానికి స్కూల్, కాలేజ్ లైఫ్, ఫ్రెండ్స్.. ఫ్యామిలీ ఎమోషన్స్ జోడించి హీరో కమ్ డైరెక్టర్ కెన్ కరుణాస్ ఈ మూవీ తెరకెక్కించారు. ప్రథమార్థం అంతా స్కూల్ డేస్, క్రష్, ఆపోజిట్ గ్యాంగ్ గొడవలు.. ప్రేషిక, సోనాల్ తో బ్రేకప్ వీటితో ఇంటర్వెల్ కార్డు పడుతుంది. ఇలాంటివి గతంలో పలు సినిమాల్లో చూశాం కదా.. మరి తమిళనాట ఎందుకు ఈ సినిమాకు ఆదరణ దక్కిందనే సందేహం కలుగుతుంది. ఈ సినిమా తొలి అర్ధభాగం ముగిసిన తర్వాత. ఇక సెకండాఫ్ లో ఇంటర్ కాలేజ్ టూర్… అక్కడ గంగవల్లితో ప్రవీణ్ గొడవ.. టూర్ పూర్తయ్యాక ఇద్దరి మధ్య స్నేహం.. స్నేహానికి ఓకే చెప్పిన గంగ ప్రేమకు నో చెప్పడంతో ఆసక్తి పెరిగి ఫేర్వెల్ డే గొడవలు, తల్లి అనారోగ్యంతో కీలకమైన మలుపు తిరిగి హీరోలో మార్పు రావటం, ఫ్యామిలీ ఎమోషన్స్ తో పూర్తిగా ఆడియన్స్ కథలో లీనమై పోతారు. కౌమారదశలో యూత్ ఆలోచనలు.. వారు చేసే చిన్న చిన్న తప్పులు జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే అంశాలను నేచురల్ గా తెరకెక్కించాడు దర్శకుడు. తండ్రీ కొడుకుల బంధాన్ని చూపించిన తీరు హత్తుకునేలా ఉంది. చివరి 20 నిమిషాలు.. సినిమాకు పెద్ద ఎసెట్ అనే చెప్పాలి. ధనుష్, వెంకీ అట్లూరి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన కెన్ కరుణాస్ చిన్న వయసులోనే చక్కటి పాయింట్ తో యూత్ నే కాదు అన్ని వర్గాల వారినీ ఆకట్టుకున్నాడనే చెప్పాలి.
నటీనటుల పనితీరు..
బాల నటుడిగా కెరీర్ మొదలు పెట్టిన కెన్ కరుణాస్ ప్రవీణ్ పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ఎమోషన్స్ కూడా బాగా పండించాడు. అమాయకపు ప్రేమికుడిగా పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యాడు. నిడివి ఎక్కువ ఉన్న కథానాయికగా గంగవల్లి పాత్రలో అనీషా అనిల్ నటన నేచురల్ గా ఉంది. మిగతా హీరోయిన్లు మీనాక్షి దినేష్, ప్రియాన్సీ యాదవ్ కూడా కనిపించిన కాసేపు తమ పాత్రలకు న్యాయం చేశారు. హీరోకి తల్లిగా దేవదర్శిని తో పాటు తండ్రిగా నటించిన సూరజ్ పాత్రలు సినిమాకు హైలైట్. ప్రిన్స్పాల్గా నళిని నటన ఆకట్టుకుంది. వికీ సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. స్కూల్ వాతావరణాన్ని, టీనేజ్ రంగుల ప్రపంచాన్ని చక్కగా చూపించారు. జీవీ ప్రకాశ్ సంగీతం కథకు తగ్గట్టు ఉంది. అయితే యూత్ నోట్లో నానే పాటలను అందించటంలో తను ఫెయిల్ అయ్యాడు. తెలుగు అనువాదం విషయంలో మేకర్స్ జాగ్రత్తలు తీసుకున్నారు. యూత్ నే కాదు పేరెంట్స్ ను సైతం ఈ సినిమా ఆకట్టుకుంటుంది. ప్రత్యేకించి చివరి 20 నిమిషాలు సినిమాకు ఆయువు పట్టు.
ట్యాగ్ లైన్: సెంటిమెంటల్ ‘యూత్’
రేటింగ్: 2.75/5