అక్క జబర్దస్త్ లో... చెల్లి అంతరిక్షంలో...
ABN , Publish Date - Jul 20 , 2026 | 01:15 PM
నటి సత్యశ్రీ సోదరి కీర్తిశ్రీ మిషన్ ఆగమన్ లో భాగం కావడంతో అందరూ అభినందిస్తున్నారు. అక్కాచెల్లెళ్ళు ఇద్దరూ వేర్వేరు రంగాల్లో ప్రతిభను చాటుకోవడం పట్ల బంధువులు శుభాకాంక్షలు చెబుతున్నారు.
ఒకే తల్లి కడుపున పిల్లల వేవ్ లెంగ్త్ ఒకేలా ఉండాలనేమీ లేదు. ఎవరి మార్గాలను వారు ఎంచుకుని ముందుకు సాగుతుంటాయి. అయితే అలా వేర్వేరు మార్గాల్లో అడుగు పెట్టిన అక్కాచెల్లెళ్ళు ఇద్దరూ మంచి గుర్తింపు తెచ్చుకోవడం పేరెంట్స్ కు గర్వకారణం. ఇప్పుడు సత్యశ్రీ, కీర్తిశ్రీ విషయంలో అదే జరిగింది.
'జబర్దస్' టీవీ ప్రోగ్రామ్ ద్వారా అందం, అభినయంతో చక్కని పేరు తెచ్చుకుంది సత్యశ్రీ. అంతేకాదు ఇప్పుడు పలు చిత్రాలలోనూ ఆమె కీలక పాత్రలు పోషిస్తోంది. తాజాగా విడుదలైన 'వెంకట్రామయ్యగారి తాలూకా' చిత్రంలోనూ సత్యశ్రీ నటించింది. ఇదే సమయంలో ఆమె సోదరి కీర్తిశ్రీ ఇప్పుడు వార్తలలో నిలిచింది. ఇటీవల ప్రముఖ స్పేస్ టెక్ స్టార్టప్ సంస్థ 'స్కైరూట్ ఏరో స్పేస్' ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'విక్రమ్ -1' (మిషన్ ఆగమన్) రాకెట్ ప్రయోగంలో కీర్తిశ్రీ కీలక పాత్ర పోషించింది. శ్రీహరికోటలోని సతీశ్ థావన్ అంతరిక్ష కేంద్రం నుంచి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన తొలి ప్రైవేట్ ఆర్బిటాల్ రాకెట్ ను విజయవంతంగా మనవాళ్ళు ప్రయోగించారు. ఈ రాకెట్ కోసం ఏవియానిక్స్ ఇంజనీర్‌గా, అలాగే ఎలక్ట్రికల్ ఇంటిగ్రేషన్ అండ్ టెన్స్ ఇంజనీర్‌గా బాధ్యతలను నిర్వర్తించింది కీర్తిశ్రీ.
ఈ విషయాన్ని సత్యశ్రీ తన సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియచేసింది. 'ఈ రోజు నేను కేవలం రాకెట్ ను మాత్రమే చూడటం లేదు. నా చెల్లి కలలు ఆకాశంలోకి ఎగరడాన్ని చూస్తున్నాను. 'మిషన్ ఆగమన్' రాకెట్ పై నా చెల్లి తన సంతకం చేస్తుంటే ఒక అక్కగా నా హృదయం ఎంతో గర్వంతో నిండిపోయింది. చిన్నప్పుడు నక్షత్రాలను వింతగా చూసిన నా చిన్నారి యువరాణి, ఈ రోజు ఆ నక్షత్రాల వైపు ప్రయాణాన్ని నిర్మించే స్థాయికి ఎదగడం వెనుక ఎన్నో ఏళ్ల కఠోర శ్రమ ఉంది' అని భావోద్వేగానికి గురౌతూ పెట్టిన పోస్ట్ అందరినీ ఎంతో ఆకట్టుకుంటోంది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణానికి చెందిన సత్యశ్రీ కుటుంబానికి నటనతో అనుబంధం ఉంది. ఆమె తల్లి నటిగా రాణించగా, ఆమె బాటలోనే సాగి సత్యశ్రీ కమెడియన్‌గా ముందుకు సాగుతోంది. ఇక కీర్తిశ్రీ సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో దేశం గర్వపడేలా రాకెట్ ప్రయోగంలో భాగస్వామి అయ్యింది. దాంతో ఈ అక్కచెల్లెళ్ళకు అందరూ అభినందనలు తెలియచేస్తున్నారు.