ఫూలే బయోపిక్.. కల్వకుంట్ల కవిత భావోద్వేగం!
ABN , Publish Date - Nov 27 , 2026 | 11:50 AM
మహాత్మా జ్యోతిరావ్ పూలే, సావిత్రిబాయి పూలే జీవితాల ఆధారంగా తెరకెక్కిన ఫూలే బయోపిక్‌ను కల్వకుంట్ల కవిత వీక్షించారు. సామాజిక తెలంగాణపై కీలక వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
మహాత్మా జ్యోతిరావ్ పూలే (Mahatma Jyotirao Phule), సావిత్రిబాయి పూలే (Savitribai Phule) జీవితాల ఆధారంగా రూపొందిన చిత్రం ‘ఫూలే’. అనంత్ నారాయణ్ మహదేవన్ ( Anant Mahadevan) తెరకెక్కించారు. ప్రతీక్ గాంధీ (Pratik Gandhi), పత్రలేఖ (Patralekhaa) ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా గతేడాది హిందీలో ప్రేక్షకుల ఎదుటకు వచ్చి విమర్శకుల ప్రశంసలు, అవార్డులు దక్కించుకుంది. ఇప్పుడు ఈ సినిమాను తెలుగులోకి అనువదించి ఈ శుక్రవారం నవంబర్ 27న థియేటర్లలోకి తీసుకు వచ్చారు. డా. పొన్నం రవిచంద్ర నిర్మించిన ఈ చిత్రం ఏషియన్ సినిమాస్ ద్వారా విడుదలయింది.
ఈ సందర్భంగా గురువారం జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో నటుడు ప్రతీక్ గాంధీ మాట్లాడుతూ ‘ఈ చిత్రాన్ని నిర్మించడం ఎంత సవాలుతో కూడుకున్న పనో, ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్లడం కూడా అంతే పెద్ద పని. నేను పుట్టిన పుణెకు, తెలంగాణకు సాంస్కృతిక అనుబంధం ఉంది. ఫూలే దంపతుల స్ఫూర్తిని అందరూ కొనియాడాలి. తరతరాలకు వాళ్ల ఆలోచనలు, పోరాటాలు స్ఫూర్తి కలిగిస్తూనే ఉంటాయి’ అని అన్నారు.
ప్రతి మహిళ తప్పక చూడాల్సిన చిత్రమని, ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి ఈ చిత్రాన్ని నిర్మించామని పొన్నం రవిచంద్ర తెలిపారు. కమర్షియల్ చిత్రాలకు భిన్నంగా ఈ సినిమాకు సంగీతం అందించినట్టు ఎం.ఎం.శ్రీలేఖ తెలిపారు. సినిమా మంచి విజయం సాధించాలని మధుర శ్రీధర్‌రెడ్డి, మాటల రచయిత చేతన్ కత్తి, ప్రతాని రామకృష్ణ గౌడ్, బీసీ స్టడీసర్కిల్ డైరక్టర్ మామిడి హరికృష్ణ ఆకాంక్షించారు.
బయోపిక్ సినిమా చూసిన కవిత
మహాత్మాజ్యోతిరావు పూలే దంపతుల నిజ జీవితాల ఆధారంగా రూపొందిన ‘ఫూలే’బయోపిక్ చిత్రాన్ని సినిమా ప్రధాన నటులు, ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) (Telangana Rakshana Sena - TRS Party) పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha Kalvakuntla) ఐమాక్స్‌లో వీక్షించారు. గురువారం ఆమె పార్టీ నాయకులతో కలిసి మొదట నెక్లెస్డ్ రోటరీ చౌరస్తా లేక్‌వ్యూ పార్కులోని పూలే దంపతుల విగ్ర హాల వద్ద నివాళులర్పించిన అనంతరం ఐమాక్స్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా పూలే దంపతుల సేవలను ఆమె గుర్తు చేశారు.
సినిమా చూసిన అనంతరం కవిత సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ‘కొన్ని సినిమాలను మనం చూస్తాం. మరికొన్ని సినిమాలు మనతోనే ఉండిపోతాయి. సౌకర్యవంతమైన జీవితాన్ని ఎంచుకోకుండా ధైర్యంగా పోరాడిన దంపతుల కథే ఫూలే. సమాజంలోని చీకటి మూలల్లో విద్యాజ్యోతిని వెలిగించిన ఆ మహనీయులు ప్రతిరోజూ ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. అయినా వారు వెలిగించిన ఆ జ్యోతి ఇప్పటికీ ప్రకాశిస్తూనే ఉంది. సామాజిక తెలంగాణ నిర్మాణం కోసం ఆ వెలుగును మేం ముందుకు తీసుకెళ్తాం’ అని పేర్కొన్నారు. అనంతరం.. ఫూలే జీవిత గాథను వెండితెరపైకి తీసుకొచ్చిన దర్శకుడు అనంత్ మహదేవన్, నటీనటులు ప్రతీక్ గాంధీ, పత్రలేఖతో పాటు చిత్ర బృందానికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.