వృషకర్మ.. ఆమెరా మెయిన్ విలన్

ABN , Publish Date - Nov 28 , 2026 | 10:01 PM

అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న హారర్ థ్రిల్లర్ వృషకర్మపై అంచనాలు పెరుగుతున్నాయి. విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కీలక పాత్రలో కనిపించనుంది. తాజాగా ఆమె పాత్రలో ఊహించని ట్విస్ట్ ఉండబోతుందంటూ దర్శకుడు ఇచ్చిన హింట్ ఆసక్తిని పెంచుతోంది. దీంతో వృషకర్మలో మీనాక్షి విలన్‌గా కనిపించనుందా అనే చర్చ మొదలైంది.

Vrushakarma Movie

అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya).. ఎప్పుడూ తనకు హర్రర్ సినిమాలు అంటే భయమని, అందుకే తాను అలాంటి సినిమాలు చేయను అని చెప్తూ వచ్చాడు. కానీ, దూత సిరీస్ తో ఆ భయాన్ని వదిలేశాడు. ఇప్పుడు అంతకుమించి హర్రర్ సినిమా వృషకర్మతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాడు. విరూపాక్ష చిత్రంతో టాలీవుడ్ మొత్తాన్ని షేక్ చేసిన కార్తీక్ దండు (Karthik Dandu) ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు.ఈ సినిమాలో నాగచైతన్య సరసన మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) హీరోయిన్‌గా నటించిన విషయం తెల్సిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు సినిమాపై అంచనాలను పెంచేశాయి.


డిసెంబర్ 4న ఈ సినిమా గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతోంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ స్పీడు పెంచిన చిత్రబృందం వరుసగా ఇంటర్వ్యూలు, ఈవెంట్స్ నిర్వహిస్తూ సినిమాపై హైప్ ని క్రియేట్ చేస్తున్నారు. తాజాగా వృషకర్మలో మీనాక్షీ చౌదరి పాత్ర గురించి డైరెక్టర్ కార్తీక్ ఒక హింట్ ఇచ్చాడు. విరూపాక్ష ,వృషకర్మ మధ్య ఒక ఆసక్తికరమైన లింక్ ఉందనే విషయాన్ని ఆయన చెప్పుకొచ్చాడు. విరూపాక్షలో హీరోయిన్ చుట్టూ ఉన్న ట్విస్ట్ ఆఖరి నిమిషం వరకు సస్పెన్స్‌గా ఉండి బాగా పేలింది. ఇప్పుడు వృషకర్మలోనూ హీరోయిన్ పాత్ర విషయంలో అలాంటి షాకింగ్ ట్విస్టే దాగి ఉందా అనే చర్చ మొదలైంది. విరూపాక్ష సినిమా చివరివరకూ సంయుక్త మీనన్ విలన్ అన్న విషయం ఎవరికీ తెలియదు. టీజర్, ట్రైలర్, క్లైమాక్స్ వరకు కూడా ఆ ట్విస్ట్ ని ఎవరూ ఊహించలేకపోయారు.


ఇక ఇప్పుడు వృషకర్మలో కూడా మెయిన్ విలన్ మీనాక్షీనే అని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. ఇందులో ఆమె ఆర్కియాలజిస్ట్ గా కనిపించనుంది. టీజర్, ట్రైలర్ లో ఆమె.. హీరోకి తోడుగా ఉంటున్నట్లు చూపించారు. అయితే ఆమె పాత్ర అంతకి మించి ఉండబోతున్నట్లు డైరెక్టర్ హింట్ ఇచ్చాడు. అంటే విరూపాక్షలో సంయుక్తని విలన్ గా చూపించినట్లే ఇందులో కూడా మీనాక్షీని విలన్ గా చూపించబోతున్నారా అనే డౌట్ ప్రేక్షకుల్లో కలుగుతుంది. కాకపోతే ఆల్రెడీ చూసిన ట్విస్ట్ నే మళ్లీ ఈ సినిమాలో కూడా పెడితే.. ప్రేక్షకులు అంగీకరించరేమో అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కానీ, ఈసారి మీనాక్షీ పాత్ర ప్రేక్షకులందరిని సర్ప్రైజ్ చేస్తుందని మాత్రం వృషకర్మ చిత్రబృందం చెప్పుకొస్తుంది. అంతేకాకుండా వృషకర్మ సినిమాను మొదటి పది నిమిషాలు అస్సలు మిస్ కావద్దని దర్శకుడు కార్తీక్ దండు ప్రేక్షకులను కోరుతున్నాడు. దీంతో ఈ సినిమాపై హైప్ మరింతగా పెరిగింది. మరి ఈ సినిమాలో మీనాక్షీ ఎలా కనిపిస్తుందో.. ఎలాంటి సర్ప్రైజ్ ఇస్తుందో చూడాలంటే డిసెంబర్ 4 వరకు ఆగాల్సిందే.

Updated Date - Nov 28 , 2026 | 10:05 PM