Vijaya Shanti: గుండు కొట్టించుకుంటా అనే సవాళ్లు చేయవద్దు.. సినిమాను నమ్మండి..
ABN , Publish Date - Jul 23 , 2026 | 02:35 PM
సముద్రఖని, అభిరామి, సమైరా, శరణ్య కీలక పాత్రధారులుగా అభినవ్ కృష్ణ తెరకెక్కించిన 'కామాఖ్యా' టైటిల్ ఇప్పుడు 'కర్మాఖ్య' గా మారింది.
సముద్రఖని, అభిరామి, సమైరా, శరణ్య కీలక పాత్రధారులుగా అభినవ్ కృష్ణ తెరకెక్కించిన 'కామాఖ్య' టైటిల్ ఇప్పుడు 'కర్మాఖ్య'గా (Karmakhya) మారింది. ఈ విషయాన్నీ శుక్రవారం ప్రసాద్ లాబ్స్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వెల్లడించారు. ఈ వేడుకకు విజయశాంతి, మధు యాష్కీ తదితరులు హాజరయ్యారు.
విజయశాంతి మాట్లాడుతూ 'నేను మళ్లీ సినిమా చేయాలంటే నాకు సరైన స్క్రిప్ట్ రావాలి. ప్రస్తుతం రాజకీయాల వల్ల సినిమాల గురించి ఆలోచించడం లేదు. ఈ సినిమా విషయానికి వస్తే కామాఖ్య అమ్మవారు ఎంతో పవర్‌ఫుల్. ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. అన్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమా టైటిల్‌ను 'కామాఖ్య' నుంచి 'కర్మాఖ్య'గా మార్చాల్సి వచ్చింది. చిన్న సినిమాల్లోనే బలమైన కథలు ఉంటాయి, అలాంటి చిత్రాలకు ప్రేక్షకులు అండగా నిలవాలి. మేమంతా కూడా చిన్న సినిమాలతోనే కెరీర్ ప్రారంభించాం. అందుకే చిన్న సినిమాలను ప్రోత్సహించాలి. దర్శకుడు అభికి సినిమాపై చాలా నమ్మకం ఉంది. సినిమా ఆడకపోతే గుండు కొట్టించుకుంటానంటూ సవాళ్లు చేయొద్దు. హిట్, ఫ్లాప్‌లను సమానంగా తీసుకోవాలి. సినిమా మీద నమ్మకం పెట్టుకోండి. తెలుగు సినీ పరిశ్రమ ఎంతో మంది హీరోయిన్లకు అవకాశాలు ఇచ్చింది. వారు ఎంచుకునే కథలే వారి కెరీర్‌ను నిర్ణయిస్తాయి' అని విజయశాంతి అన్నారు,
దర్శకుడు అభి మాట్లాడుతూ 'కొన్ని అనివార్య కారణాల వల్ల 'కామాఖ్య' టైటిల్‌ను 'కర్మాఖ్య'గా మార్చాం. ఇది దేవుడి సినిమా కాదు. అమ్మవారి నేపథ్యంతో రూపొందించిన క్రైమ్ థ్రిల్లర్. ఈ సినిమాపై పూర్తి నమ్మకం ఉంది. సినిమా హిట్ అయితే అది మొత్తం టీమ్ కష్టానికి దక్కే విజయం. ఒకవేళ ఫ్లాప్ అయితే పూర్తి బాధ్యత నాదే. ప్రేక్షకులకు సినిమా నచ్చకపోతే నేను గుండు కొట్టించుకుంటా' అని సవాల్ విసిరారు.