S Janaki: జానకమ్మకు కన్నడ సరిగమప చిన్నారుల పాటల నివాళి
ABN , Publish Date - Jul 13 , 2026 | 04:26 PM
భారతీయ సినీ సంగీత ప్రపంచాన్ని తన మధుర గానంతో దశాబ్దాల పాటు అలరించిన గానకోకిల ఎస్. జానకికి కన్నడ సరిగమప బృందం హృదయాన్ని హత్తుకునే సంగీత నివాళి అర్పించింది.
భారతీయ సినీ సంగీత ప్రపంచాన్ని తన మధుర గానంతో దశాబ్దాల పాటు అలరించిన గానకోకిల ఎస్. జానకికి (S Janaki) కన్నడ సరిగమప బృందం హృదయాన్ని హత్తుకునే సంగీత నివాళి అర్పించింది. మైసూరులోని మహారాజా కళాశాల మైదానంలో ఆమె భౌతికకాయానికి అభిమానులు, సంగీత ప్రియులు, సినీ ప్రముఖులు తుది వీడ్కోలు పలుకుతున్న వేళ ఈ సంగీతాంజలి కార్యక్రమం అందరినీ భావోద్వేగానికి గురిచేసింది.
'సరిగమప' (Saregamapa) వేదికపై తమ ప్రతిభతో గుర్తింపు పొందిన పలువురు చిన్నారి గాయకులు జానకమ్మ ఆలపించిన చిరస్మరణీయ గీతాలను ఆలపిస్తూ ఆమెకు అశ్రునివాళి ఘటించారు. ఆమె స్వరంలో జీవించిన ఎన్నో అజరామర గీతాలు మరోసారి ఆ ప్రాంగణంలో మార్మోగడంతో అక్కడున్న వారంతా కంటతడి పెట్టారు. కొందరు అభిమానులు పాటలతో పాటు జానకమ్మ జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు.
తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో పాటు పలు భారతీయ భాషల్లో వేలాది పాటలు పాడిన ఎస్. జానకి తన అపూర్వ గాత్రంతో కోట్లాది మంది హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారు. ఐదు దశాబ్దాలకు పైగా సాగిన ఆమె సంగీత ప్రయాణం భారతీయ సినీ సంగీత చరిత్రలో ఓ స్వర్ణ అధ్యాయంగా నిలిచిపోతుందని అభిమానులు చెబుతున్నారు.
జానకమ్మ కు తుది వీడ్కోలు పలికేందుకు మైసూరుకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ఈ సందర్భంగా కన్నడ సరిగమప బృందం అందించిన సంగీత నివాళి అక్కడి వాతావరణాన్ని మరింత భావోద్వేగభరితంగా మార్చింది. జానకమ్మ భౌతికంగా దూరమైనా, ఆమె పాడిన పాటలు తరతరాల పాటు సంగీతాభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా మార్మోగుతూనే ఉంటాయని అభిమానులు పేర్కొన్నారు.