టాలీవుడ్‌లోకి కంగనా రనౌత్ గ్రాండ్ రీఎంట్రీ.. డైరెక్టర్ ఎవరంటే?

ABN , Publish Date - Oct 27 , 2026 | 04:05 PM

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ (Kangana Ranaut)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభాస్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఏక్ నిరంజన్ చిత్రంతో కంగనా టాలీవుడ్‌కు పరిచయమైంది.

Kangana Ranaut

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ (Kangana Ranaut)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభాస్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఏక్ నిరంజన్ చిత్రంతో కంగనా టాలీవుడ్‌కు పరిచయమైంది. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఆ తరువాత కంగనా తెలుగువైపు కన్నెత్తి కూడా చూడలేదు. బాలీవుడ్ లోనే స్టార్ గా మారి రాజకీయాల్లోకి కూడా అడుగుపెట్టింది. ఇక ఎప్పుడెప్పుడు ఆమె మరోసారి టాలీవుడ్ లో అడుగుపెడుతుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దాదాపు 17 ఏళ్ల సుధీర్ఘ విరామం తర్వాత ఇప్పుడు మళ్లీ కంగనా టాలీవుడ్ వైపు కన్నెత్తి చూసింది.


అవును, అందుతున్న సమాచారం ప్రకారం కంగనా టాలీవుడ్ లో రీఎంట్రీకి సిద్ధమయ్యిందని టాక్. టాలెంటెడ్ డైరెక్టర్ రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కబోయే ఓ క్రేజీ ప్రాజెక్ట్ ద్వారా కంగనా మళ్లీ తెలుగు తెరపై కనిపించనున్నట్లు సమాచారం. అనసూయ, అవును, అమరావతి లాంటి లేడీ ఓరియెంటెడ్ హర్రర్ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న రవిబాబు ఈ మధ్య సరైన హిట్ ని అందుకోలేదు. ఈ ఏడాది రేజర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా అది ఎప్పుడు వచ్చింది.. ఎప్పుడు పోయింది అన్న విషయం కూడా ఎవరికీ తెలియలేదు.


తాజాగా రవిబాబు.. కంగనాని కలిసి ఒక కథ వినిపించాడని, అది ఆమెకు నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎప్పటిలానే సురేష్ బాబుతో కలిసి రవిబాబు ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కంగనా నటిస్తుండటంతో ఈ సినిమాను హిందీలో కూడా విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మరి ఈ సినిమాతో కంగనా, రవిబాబు ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.

Updated Date - Oct 27 , 2026 | 04:12 PM