Agadha: ఎం.ఎస్. రాజు కొత్త సినిమా .. హీరోయిన్ ఫస్ట్ లుక్ ఇదే..
ABN , Publish Date - Apr 20 , 2026 | 11:54 AM
దర్శక నిర్మాత ఎం.ఎస్. రాజు మరో ఆసక్తికర కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తాజాగా ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'అగధ'.
దర్శక నిర్మాత ఎం.ఎస్. రాజు మరో ఆసక్తికర కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తాజాగా ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'అగధ'. కామాక్షి భాస్కర్ల కథానాయిక. ఇందులో ఆమె మహాదేవిగా కనిపించనుంది. సోమవారం ఈ చిత్రంలో హీరోయిన్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. త్రిశూలాలు, దీపాలు, ఎత్తైన విగ్రహంతో కూడిన ఆధ్యాత్మిక నేపథ్యం ముందు, నల్ల చీర కట్టుకుని గంభీరంగా కూర్చున్న కామాక్షి భాస్కర్ల లుక్ చూస్తుంటే నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలాగా అనిపిస్తోంది. ఆమె ప్రచండమైన హావభావం, సాంప్రదాయ రూపం, ఆ పరిసరాల్లోని ఆధ్యాత్మిక వాతావరణం, మహాదేవి కేవలం ఒక సాధారణ పాత్ర కాదని, కథ యొక్క ఆధ్యాత్మిక మూలంతో గాఢంగా ముడిపడి ఉన్న వ్యక్తి అని తెలియజేస్తున్నాయి.
దర్శకుడు ఎం.ఎస్. రాజు మాట్లాడుతూ 'ఫస్ట్ లుక్ విడుదల చేసినప్పటి నుంచి స్నేహితులు, సన్నిహితుల నుంచు ఫోన్ కాల్స్, మెసేజ్‌లతో అందుకున్న ప్రశంసలతో నేను చెప్పబోతున్న కథపై మరింత నమ్మకం పెరిగింది. రచయితగా, దర్శకుడిగా, ఈ ప్రోత్సాహం అత్యుత్తమ ప్రతిభను కనబరచడానికి, 'అగధ'లోని ప్రతి అంశం అంచనాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవడానికి నన్ను ప్రేరేపిస్తుంది' అని అన్నారు.
కాశీ విశాలాక్షి బలుసు నిర్మాతగా, శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. 45 నిమిషాల విఎఫ్‌ఎక్స్, విస్తృతమైన సెట్ వర్క్ గొప్ప సినిమాటిక్ అనుభూతిని అందిస్తుందని మేకర్స్ చెబుతున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.