కళ్యాణ్ రామ్: నిన్న అనిల్ రావిపూడి.. ఇప్పుడు శ్రీకాంత్ విస్సా
ABN , Publish Date - Feb 12 , 2026 | 06:41 PM
నందమూరి కళ్యాణ్ రామ్ తన పంథాను వీడలేదు. సినిమాల ఫలితం ఎలా ఉన్నా తన అలవాటును మార్చుకోలేదు. ఎక్కడ పొగొట్టుకున్నాడో మళ్లీ అక్కడే సంపాదించుకునేందుకు రిస్క్ చేయడానికీ వెనకాడటం లేదు.
నందమూరి హీరో కళ్యాణ్ రామ్ (Kalyan Ram) కెరీర్‌లో ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. అది న్యూ టాలెంట్‌ను ప్రోత్సహించడం! నిర్మాతగా మారినప్పటి నుంచి ఆయన కొత్త దర్శకులకు అవకాశాలు ఇస్తూ వచ్చారు. అలా ఆయన ఖాతాలో కొన్ని సూపర్ హిట్ సినిమాలు చేరాయి, అలానే కొన్ని భారీ పరాజయాలు వచ్చాయి. అయినా కూడా కళ్యాణ్ రామ్ కొత్త దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేయడం మాత్రం ఆపలేదు. తాజాగా అదే రిస్క్ మరోసారి ఆయన చేయబోతున్నారు.
కళ్యాణ్ రామ్ పరిచయం చేసిన డైరెక్టర్లలో చాలామంది అగ్రస్థానానికి చేరుకున్నారు. 'పటాస్'తో దర్శకుడిగా పరిచయమైన అనిల్ రావిపూడి లాంటి వాళ్లు ఏకంగా హిట్ మెషిన్‌గా మారారు. అలానే ' బింబిసార'తో దర్శకుడిగా పరిచయమైన వశిష్ఠ ఇప్పుడు చిరంజీవితో 'విశ్వంభర' మూవీ తెరకెక్కిస్తున్నారు. అయితే 'అమిగోస్', 'ది డెవిల్', 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి' వంటి ప్రయోగాలు పెద్దగా ఫలించలేదు. దీంతో తీవ్ర నిరాశకు గురైన కళ్యాణ్ రామ్ కొంతకాలం బ్రేక్ తీసుకున్నారు.
ఇప్పుడు మళ్లీ రేస్‌లోకి రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సారి కూడా మరో కొత్త దర్శకుడికి ఆయన ఛాన్స్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే.. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన 'పుష్ప', 'పుష్ప 2 చిత్రాలతో పాటు ఈ మధ్య కాలంలో చాలా చిత్రాలకు రచయితగా పనిచేసిన శ్రీకాంత్ విస్సా (Sreekanth Vissa) ను కళ్యాణ్ రామ్ దర్శకుడిగా పరిచయం చేయబోతున్నట్టు తెలుస్తోంది.
విశేషం ఏమంటే.. కళ్యాణ్ రామ్ డైరెక్టర్‌గా పరిచయం చేసిన అనిల్ రావిపూడి కూడా దానికి ముందు రైటర్‌గా పలు విజయవంతమైన చిత్రాలకు వర్క్ చేశారు. శ్రీకాంత్ విస్సా దర్శకత్వం వహించే సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయట. 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి' మూవీ నిర్మాణ భాగస్వామి ముప్పా అశోక్ వర్ధన్ ఈ సినిమాకూ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించ బోతున్నాడట. శ్రీకాంత్ విస్సా చెప్పిన కథ కళ్యాణ్ రామ్‌కి బాగా నచ్చడంతో గత ఏడాది చివరిలోనే ప్రాజెక్ట్‌ను లాక్ చేశారని, కొద్ది రోజుల్లో అధికారిక సమాచారం వస్తుందని, ఆ వెంటనే షూటింగ్ మొదలవుతుందని తెలుస్తోంది.