'కళ్లు' ఎంవీ రఘుకు అరుదైన గౌరవం.. గొల్లపూడి జాతీయ పురస్కారం ప్రదానం
ABN , Publish Date - Nov 19 , 2026 | 10:09 AM
ప్రముఖ దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ ఎంవీ రఘుకు అరుదైన గౌరవం దక్కింది. 'కళ్లు' సినిమా దర్శకుడిగా గుర్తింపు పొందిన ఆయనకు గొల్లపూడి మారుతీరావు జాతీయ పురస్కారం 2026 ప్రదానం చేశారు.
కళ్లు సినిమా దర్శకుడు, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఎంవీ రఘు (MV Raghu) కు గొల్లపూడి మారుతీరావు జాతీయ పురస్కారం (Gollapudi Maruthirao National Award) 2026 ప్రదానం చేశారు. బుధవారం రాత్రి త్యాగరాయగాన సభలో సింధు కళాసంధ్య సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా పాల్గొన్న ప్రముఖ సినీ దర్శకుడు రేలంగి నరసింహారావు (Relangi Narasimha Rao), వంశీ సంస్థ అధినేత డా. వంశీ రామరాజు (Vamsi Rama Raju) పురస్కారాన్ని బహూకరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గొల్లపూడి మారుతీరావు అద్భుతమైన నటుడు అన్నారు. మారుతీరావు పేరిట ఏర్పాటు చేసిన జాతీయ పురస్కా రాన్ని సినీ దర్శకుడుగానే కాకుండా సినిమాటోగ్రాఫర్ ప్రసిద్ధి చెందిన రఘుకు ఇవ్వడం సముచితంగా ఉందన్నారు. కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు రవి, కోటేశ్వరరావు, ఎంవీ సుబ్రహ్మణ్యం, శివాజీ, ప్రసాద్, సాయినాథ్, రాజ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా తెలుగు, హిందీ సినీ సంగీత విభావరి జరిగింది.