Kalki 2: ‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్ రెగ్యులర్ షూటింగ్.. అప్డేట్
ABN , Publish Date - Sep 26 , 2026 | 12:42 PM
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘కల్కి 2898 ఏడీ’ ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2) ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సైన్స్ ఫిక్షన్, మైథాలజీ, ఫ్యూచరిస్టిక్ వరల్డ్‌ను కలిపి దర్శకుడు నాగ్ అశ్విన్ సృష్టించిన కొత్త ప్రపంచం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. భారీ విజయాన్ని అందుకున్న ఈ చిత్రానికి రెండు నేషనల్ అవార్డులు కూడా దక్కాయి. దీంతో ఇప్పుడు అందరి దృష్టి ‘కల్కి’ సీక్వెల్‌పైనే ఉంది. ఈ నేపథ్యంలో సీక్వెల్‌కు సంబంధించిన కీలక అప్‌డేట్ బయటకు వచ్చింది. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ప్రధాన పాత్రల్లో కొనసాగనున్న ఈ చిత్రానికి రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్‌లో ప్రారంభం కానున్నట్లు మేకర్స్ తెలిపారు.
ఇప్పటికి 10 శాతం చిత్రీకరణ కూడా పూర్తయిందని ఇటీవల దర్శకుడు చెప్పారు . తొలి భాగంతో పోలిస్తే సీక్వెల్‌ను మరింత భారీ స్థాయిలో తెరకెక్కించేందుకు నాగ్ అశ్విన్ ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ పాత్ర చుట్టూ సాగే కథనం ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచేలా ఉంటుందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తొలి భాగంలో కనిపించిన ఫ్యూచరిస్టిక్ ప్రపంచాన్ని మరింత గ్రాండ్‌గా చూపించేందుకు భారీ సెట్స్, అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించనున్నారని సమాచారం.
ప్రభాస్‌తో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కూడా కీలకమైన షెడ్యూల్స్‌లో పాల్గొననున్నారు. వచ్చే నెల నుంచి ప్రధాన నటీనటుల షూటింగ్ ప్రారంభించేలా టీమ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వరుస షెడ్యూల్స్‌తో చిత్రీకరణ కొనసాగించి.. 2027 మధ్య నాటికి మొత్తం ప్రొడక్షన్ పనులను పూర్తి చేయాలని నాగ్ అశ్విన్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం.