Kalki: సీక్వెల్‌లోనూ.. అదే వరల్డ్! అందులో ఉన్న పాత్రలన్నీ.. ఇందులోనూ ఉంటాయి
ABN , Publish Date - Sep 25 , 2026 | 10:07 AM
‘కల్కి 2898ఏడీ’ సినిమా సీక్వెల్ గొప్ప భావోద్వేగాలతో, అత్యంత భారీ స్థాయిలో సాగుతుందని చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ తెలిపారు.
‘కల్కి 2898ఏడీ’ (Kalki 2898 AD) సినిమా సీక్వెల్ గొప్ప భావోద్వేగాలతో, అత్యంత భారీ స్థాయిలో సాగుతుందని చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ తెలిపారు. ఇటీవల జరిగిన జాతీయ అవార్డుల ప్రదానోత్సవంలో జంట అవార్డులను కైవసం చేసుకుంది ‘కల్కి 2898ఏడీ’.
ఈ సందర్భంగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) మాట్లాడుతూ ‘‘కల్కి’ సినిమాకు యూనిట్ అంతా ప్రాణం పెట్టి పని చేసింది. కల్కి వరల్డ్ రపకల్పనకు అహర్నిశలు శ్రమించాం. మా చిత్రానికి రెండు జాతీయ పురస్కారాలు రావడంతో, మమ్మల్ని భుజం తట్టి ప్రోత్సహించినట్టయింది. సీక్వెల్‌లోనూ అదే వరల్డ్ కంటిన్యూ అవుతుంది. అందులో ఉన్న పాత్రలన్నీ ఇందులోనూ ఉంటాయి.
అయితే అక్కడ మొదలైన కథలోని ఆత్మ ఇందులో బలంగా కనిపిస్తుంది. అన్ని విషయాలను ఓ కొలిక్కి తెచ్చి కథను ఎలా పూర్తి చేస్తామన్నది ఆసక్తికరం. భావోద్వేగాల పరంగా, ప్రొడక్షన్ పరంగా చాలా భారీగా కనిపిస్తుంది’ అని అన్నారు. సెల్యులాయిడ్ మీద పౌరాణిక అంశాల ప్రస్తావన పెరుగుతుండటాన్ని గురించి నాగ్ అశ్విన్ మాట్లాడుతూ ‘గత రెండేళ్లుగా ఈ ఒరవడి బాగా కనిపిస్తోంది.
అనుభవజ్ఞులైన దర్శకులే కాదు, యువ దర్శకులు కూడా ఈ జోనర్‌లో సినిమాలు చేయడానికి ఇష్టపడుతున్నారు. నిర్మాతలు కూడా పౌరాణికాల కోసం ఖర్చు పెట్టడానికి ఉత్సాహ పడుతున్నారు. రానున్న కాలంలో మరిన్ని మైథాలజీ చిత్రాలు ఎగ్జయిట్ చేస్తాయని బలంగా నమ్ముతున్నాను’ అని తెలిపారు.
హీరో ప్రభాస్ గురించి చెబుతూ ‘ప్రభాస్ లాంటి నటుడు దొరకడం మా అదృష్టం. దర్శకుడి విజన్‌ని నమ్మే స్టార్ ఆయన’ అని అన్నారు. కల్కి చిత్రానికి జాతీయ పురస్కారాలు అందుకోవడం గర్వంగా ఉందని నిర్మాత అశ్వనీదత్ (Ashwini Dutt) తెలిపారు. ‘దర్శకుడి విజన్‌ని నమ్మి వేసిన అడుగులకు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కడం ఆనందంగా ఉంది.
మొదటి నుంచీ నాగ్ అశ్విన్‌కి ఈ వరల్డ్ మీద స్పష్టమైన అవగాహన ఉంది. సిల్వర్ స్క్రీన్ మీద దానికి ప్రాణం పోయడం మాములు విషయం కాదు. సమిష్టి కృషితోనే అది సాధ్యమైంది. అంకితభావంతో చిత్ర యూనిట్ మొత్తం అహర్నిశలు పడ్డ కష్టాన్ని ప్రేక్షకులు ఎంతగానో మెచ్చుకున్నారు’ అని ఆయన అన్నారు.